LOADING...
Alien attack: గ్రహాంతర అంతరిక్ష నౌక భూమిపై దాడి.. ప్రపంచ నేతలు సిద్ధం కావాలని  హార్వర్డ్ శాస్త్రవేత్త పిలుపు 
ప్రపంచ నేతలు సిద్ధం కావాలని హార్వర్డ్ శాస్త్రవేత్త పిలుపు

Alien attack: గ్రహాంతర అంతరిక్ష నౌక భూమిపై దాడి.. ప్రపంచ నేతలు సిద్ధం కావాలని  హార్వర్డ్ శాస్త్రవేత్త పిలుపు 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 13, 2025
01:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

భూమి వైపు వస్తోన్న 3I/ATLAS అనే అంతరిక్ష వస్తువు ఏలియన్‌ అంతరిక్ష నౌక అయ్యి ఉంటుందని హార్వర్డ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త అవి లోబ్‌ అన్నారు. అది భూమికి ముప్పు అయితే ఎలా ఎదుర్కోవాలో ఇప్పుడే ప్రణాళిక సిద్ధం చేయాలని ప్రపంచ నాయకులకు పిలుపునిచ్చారు. జూలై 1న చిలీలోని నాసా నిధులతో నడిచే ATLAS టెలిస్కోప్‌ దీన్ని గుర్తించింది. ఇది మన సౌరవ్యవస్థలోకి వచ్చిన మూడో అంతరిక్ష అతిథి. చాలామంది శాస్త్రవేత్తలు ఇది ధూమకేతువే అనుకుంటున్నా, లోబ్ మాత్రం కాదు అంటున్నారు. ఆయనకు ఇది సహజ వస్తువు కాదని, ఏలియన్‌ల "మదర్‌షిప్‌" అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. దానిపై పేపర్ లో కూడా ప్రచురించారు.ఈ పరిస్థితిలో ప్రపంచ నేతలు కలసి అత్యవసర ప్రణాళిక చేయాలని సూచించారు.

వివరాలు 

ఇటువంటి నిర్ణయాలు తీసుకునేందుకు అంతర్జాతీయ బృందం ఉండాలి: లోబ్

ఒక ఇంటర్వ్యూలో లోబ్ మాట్లాడుతూ, ఇలాంటి అంతరిక్ష వస్తువు భూమిని లక్ష్యంగా చేసుకుంటే వెంటనే నిర్ణయాలు తీసుకునే అంతర్జాతీయ బృందం ఉండాలని చెప్పారు. కృత్రిమ మేధస్సు, వాతావరణ మార్పులు, గ్రహశకల ఢీకొనడం వంటి ముప్పుల గురించి మనం ఆలోచిస్తామని, కానీ ఏలియన్‌ ముప్పుపై ఎప్పుడూ చర్చించలేదని అన్నారు. "వస్తువు లక్ష్యం, దాని ఉద్దేశం ఏంటనేదాని బట్టి మన ప్రతిస్పందన ఉండాలి. మన ఇంటి వెనుకవైపు ఎవరో వస్తే అందరికీ ఒకే విధానం అవలంబించం కదా" అని ఉదాహరణ ఇచ్చారు.

వివరాలు 

"ఇది ధూమకేతువు కాదు": హార్వర్డ్‌ శాస్త్రవేత్త 

3I/ATLAS సహజ వస్తువు కాదని లోబ్ మళ్లీ స్పష్టం చేశారు. "దీనికి తోక ఉందని అంటున్నా,ఇది చాలా వేగంగా కదులుతున్నందువల్ల టెలిస్కోపుల్లో అలా కనిపించే అవకాశం ఉంది" అన్నారు. సూర్యుని చుట్టూ దీని కక్ష్య సహజంగా ఉండదని, రేట్రోగ్రేడ్‌లో తిరుగుతుందని చెప్పారు. ఇది సెకనుకు 60 కి.మీ. వేగంతో వస్తోందని, రంగు, పరిమాణం కూడా ధూమకేతువుకి సరిపోదని చెప్పారు. 2017లో వచ్చిన 'ఓమువామువా', 2019లో వచ్చిన 'బోరిసోవ్‌' కంటే ఇది చాలా పెద్దదని, సహజ వస్తువు అయ్యే అవకాశం కేవలం 0.2 శాతం మాత్రమేనని తెలిపారు.