Reusable Rocket Engine: రీయూజబుల్ రాకెట్ ఇంజిన్ పరీక్షల్లో హైదరాబాద్ సంస్థ ఘన విజయం
ఈ వార్తాకథనం ఏంటి
భారత అంతరిక్ష రంగంలో హైదరాబాద్‌కు చెందిన 'అబ్యోమ్ స్పేస్‌టెక్ అండ్ డిఫెన్స్' సంస్థ కీలక విజయాన్ని నమోదు చేసింది. పూర్తిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన రీయూజబుల్ లిక్విడ్ రాకెట్ ఇంజిన్ క్వాలిఫికేషన్ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసినట్లు సంస్థ వెల్లడించింది. ఈ సాంకేతిక విజయం వల్ల భవిష్యత్తులో అంతరిక్ష ప్రయోగాల ఖర్చు గణనీయంగా తగ్గే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. సంస్థకు చెందిన వాణిజ్య పరీక్ష కేంద్రంలో ఈ ఇంజిన్ పరీక్షలను నిర్వహించారు. ఈ విజయం త్వరలో చేపట్టనున్న 'హోప్' పేరుతో ఉన్న నిలువు దిశలో ఎగిరి, తిరిగి నిలువుగానే దిగే రీయూజబుల్ రాకెట్ ప్రాజెక్టుకు ఎంతో ఉపయోగపడనుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
వివరాలు
అంతరిక్ష ప్రయోగాల ఖర్చును తగ్గించడంలో కీలక ముందడుగు
అలాగే అత్యల్ప ఉష్ణోగ్రతల ఇంధనంతో పనిచేసే రాకెట్ ఇంజిన్ల అభివృద్ధికి కూడా ఈ పరీక్షలు దోహదపడతాయని పేర్కొన్నారు. పరీక్షల్లో వినియోగించిన ఇంజిన్ వ్యవస్థలు, నియంత్రణ నిర్మాణాలు సహా అన్ని కీలక పరికరాలను తమ ఇంజినీరింగ్ బృందమే దేశీయంగా రూపొందించినట్లు అబ్యోమ్ సంస్థ వెల్లడించింది. స్వదేశీ సాంకేతిక సామర్థ్యంతో ఈ స్థాయి విజయాన్ని సాధించడం దేశ అంతరిక్ష రంగానికి శుభపరిణామమని పేర్కొంది. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకుడు, ప్రధాన కార్యనిర్వాహక అధికారి జైనుల్ అబిదీన్ మాట్లాడుతూ, భారత్‌లో స్వదేశీ పునర్వినియోగ చోదక వ్యవస్థల అభివృద్ధిలో ఈ పరీక్షలు కీలక ఘట్టమని అన్నారు. అంతరిక్ష ప్రయోగాల వ్యయాన్ని భారీగా తగ్గించే లక్ష్యంతో సాంకేతికతను మరింత అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
వివరాలు
ఈ స్టార్టప్‌కు బిట్స్ పిలానీ, ఐఐటీలు, ఇస్రో నుంచి మద్దతు
తక్కువ ఖర్చుతో అంతరిక్ష ప్రయాణాలను సాధ్యంచేసే దిశగా తమ బృందం కృషి కొనసాగుతోందని చెప్పారు. బిట్స్ పిలానీ హైదరాబాద్ ప్రాంగణంలోని ఇంక్యుబేటర్ కేంద్రం నుంచి అబ్యోమ్ సంస్థ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ సంస్థకు భారతీయ సాంకేతిక విద్యాసంస్థలైన మద్రాస్, బాంబే కేంద్రాల నుంచి మద్దతు లభిస్తోంది. అలాగే కేంద్ర ప్రభుత్వానికి చెందిన విజ్ఞానశాఖ, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ, సమాచార సాంకేతిక శాఖల సహకారం కూడా అందుతోంది. రాబోయే రోజుల్లో పునర్వినియోగ రాకెట్ నమూనా ప్రదర్శనలు నిర్వహించడంతో పాటు అత్యల్ప ఉష్ణోగ్రత ఇంధన ఇంజిన్ల అభివృద్ధిపై మరింత దృష్టి పెట్టనున్నట్లు సంస్థ స్పష్టం చేసింది.