Anthropic: ఏఐ కోడ్ రాస్తే.. ఇంజినీర్ల పాత్ర ఏంటి? ఆంథ్రోపిక్ క్లారిటీ
ఈ వార్తాకథనం ఏంటి
కృత్రిమ మేధ (ఏఐ) కాలంలో ఇటీవల ఆంత్రోపిక్ పేరు విస్తృతంగా చర్చకు వస్తోంది. ఈ స్టార్టప్ రూపొందించిన క్లాడ్ ప్లగిన్‌లు టెక్ రంగంలో గణనీయమైన ఆసక్తిని రేపుతున్నాయి. తమ ఏఐ మోడళ్ల ద్వారా కోడ్‌ను పూర్తిస్థాయిలో స్వయంగా రూపొందించగలుగుతున్నామని ఆ సంస్థ వెల్లడించడంతో, ఇంజినీర్ల పాత్ర ఏమిటన్న సందేహం నెటిజన్లలో తలెత్తింది. ఈ ప్రశ్నకు ఆంథ్రోపిక్ కోడింగ్ అసిస్టెంట్ క్లాడ్ కోడ్ చీఫ్ బోరిస్ చెర్నీ స్పందించారు. కోడింగ్ అనేది ఉద్యోగంలో ఒక భాగం మాత్రమేనని చెర్నీ స్పష్టం చేశారు. ఏఐ వ్యవస్థలకు సరైన ప్రాంప్ట్‌లు ఇవ్వడం, ఇతర బృందాలతో సమన్వయం చేయడం, కస్టమర్లతో సన్నిహితంగా పనిచేయడం, తదుపరి తీసుకురావాల్సిన ఫీచర్లపై పరిశోధన చేయడం వంటి కీలక బాధ్యతలు ఇంజినీర్లవేనని తెలిపారు.
వివారాలు
సిస్టమ్ డిజైన్, దీర్ఘకాలిక ప్రణాళికల విషయంలో కూడా ఇంజినీర్ల అవసరం తప్పనిసరి
ఇంజినీరింగ్ రంగం మార్పు దశలో ఉందని, ఆ మార్పులకు అనుగుణంగా పనిచేసే ఇంజినీర్లు తమకు అవసరమని అన్నారు. ఏఐ టూల్స్ కోడింగ్, డాక్యుమెంటేషన్ వంటి పనులు చేసినా, వాటిని సమీక్షించి ధృవీకరించే బాధ్యత ఇంజినీర్లదేనని చెప్పారు. సిస్టమ్ డిజైన్, దీర్ఘకాలిక ప్రణాళికల విషయంలో కూడా ఇంజినీర్ల అవసరం తప్పనిసరిగా ఉంటుందని వివరించారు. ఇదిలా ఉండగా, అమెరికాకు చెందిన ఆంథ్రోపిక్ సంస్థ ఇటీవల 'క్లాడ్ కోవర్క్ ఏజెంట్' కోసం 11 ఓపెన్ సోర్స్ ప్లగిన్‌లను విడుదల చేసింది. లీగల్, సేల్స్, మార్కెటింగ్, డేటా అనాలిసిస్ వంటి విభాగాల్లో ఆటోమేషన్‌కు ఇవి ఉపయోగపడనున్నాయి.
వివరాలు
ఆంథ్రోపిక్ ఏఐ టూల్స్ వల్ల ఈ పనులన్నీ స్వయంచాలకంగా జరిగే అవకాశం
అలాగే ఫైనాన్స్, ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్, బయాలజీ పరిశోధన, కస్టమర్ సపోర్ట్ రంగాల్లో కూడా ఈ టూల్స్ కీలక పాత్ర పోషిస్తాయని కంపెనీ ప్రకటించింది. సాధారణంగా డాక్యుమెంట్ రివ్యూలు, డేటా అనాలిసిస్ వంటి పనులను బహుళజాతి సంస్థలు భారత ఐటీ సేవా సంస్థలకు ఔట్‌సోర్సింగ్ ద్వారా అప్పగిస్తుంటాయి. అయితే ఆంథ్రోపిక్ ఏఐ టూల్స్ వల్ల ఈ పనులన్నీ స్వయంచాలకంగా జరిగే అవకాశం కనిపించడంతో, భారత ఐటీ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం పడుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.