Himachal Pradesh: ప్రమాదంలో హిమాచల్‌లోని 9-12 సరస్సులు.. ఐఐటీ మండి హెచ్చరిక!
ఈ వార్తాకథనం ఏంటి
నేపాల్‌లో ఇటీవల సంభవించిన వరదలు హిమాలయ ప్రాంతంలోని హిమ సరస్సుల ముప్పును మరోసారి బయటపెట్టాయి. ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్‌లోని 9 నుంచి 12 హిమ సరస్సులు ప్రస్తుతం 'క్రిటికల్' దశలో ఉన్నాయని ఐఐటీ మండి పరిశోధకుల అధ్యయనం హెచ్చరించింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఈ సరస్సులను అడ్డుకునే మంచు, రాళ్ల కట్టలు బలహీనపడితే అవి ఒక్కసారిగా బద్దలై భారీ వరదలకు దారితీసే ప్రమాదం ఉందని తెలిపింది. సుమారు 2,000 హిమ సరస్సులను పరిశీలించిన ఐఐటీ మండి శాస్త్రవేత్తలు.. హిమనదాలు కరుగుతున్న కొద్దీ సరస్సుల పరిమాణం పెరుగుతోందని, దీంతో ప్రమాదం కూడా ఎక్కువవుతోందని గుర్తించారు.
వివరాలు
వాతావరణ మార్పుల కారణంగా గంగా మారుతున్నహిమనదాల కింద పరిస్థితులు
హిమనదాలు కరగడంతో పాటు హిమ సరస్సులు విస్తరిస్తుండటం, 'పెర్మాఫ్రాస్ట్' (నేలలో చాలా కాలంగా గడ్డకట్టిన పొర) కరగడం కూడా పర్వత ప్రాంతాల స్థిరత్వాన్ని దెబ్బతీస్తున్నాయని పరిశోధకులు పేర్కొన్నారు.
వాతావరణ మార్పుల కారణంగా హిమాలయాల్లోని హిమనదాల కింద పరిస్థితులు వేగంగా మారుతున్నాయి.
పెర్మాఫ్రాస్ట్ కూడా కరగడంతో పర్వత ప్రాంతాలు మరింత అస్థిరంగా మారుతున్నాయి.
ఐఐటీ మండి అధ్యయనం చేసిన పలు హిమ సరస్సులు గత పదేళ్లలో గణనీయంగా విస్తరించాయి.
ప్రస్తుతం వాటిలో 30 నుంచి 60 శాతం సరస్సులు పదేళ్ల క్రితంతో పోలిస్తే పెద్దవిగా మారినట్లు పరిశోధకులు గుర్తించారు.
వివరాలు
నాలుగు సరస్సులపై తక్షణ దృష్టి అవసరమన్న జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ
పెరుగుతున్న పర్యాటకం, కాలుష్యం, హిమనదాలపై పేరుకుపోతున్న దుమ్ము, కార్బన్ నిక్షేపాలు కూడా మంచు కరుగుదలను వేగవంతం చేస్తున్నాయి.
హిమనదాలపై పేరుకునే ఈ నల్లటి పదార్థాలు సూర్యరశ్మిని ఎక్కువగా గ్రహించడంతో మంచు త్వరగా కరుగుతుంది.
మరోవైపు పెర్మాఫ్రాస్ట్ కరిగినప్పుడు పైభాగంలోని నేల, రాళ్లు కదిలే అవకాశం పెరిగి భూభాగం అస్థిరంగా మారుతుంది.
హిమ సరస్సుల ముప్పును దృష్టిలో ఉంచుకుని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) నాలుగు సరస్సులపై తక్షణ దృష్టి అవసరమని గుర్తించింది.
వీటిలో ఘేపన్ సరస్సు, వాసుకి సరస్సు, కషాంగ్ సరస్సు, బాస్పా సమీపంలోని మరో సరస్సు ఉన్నాయి.
ఈ ప్రాంతాల్లో మానవ కార్యకలాపాల కారణంగా ఏర్పడుతున్న మార్పులు కూడా ప్రమాదాన్ని మరింత పెంచుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
వివరాలు
ఘేపన్ సరస్సు, యోచె సరస్సు, కాళీ కుండ్ సరస్సులు అత్యధిక ముప్పు ఉన్నవిగ గుర్తింపు
ఘేపన్ సరస్సు, యోచె సరస్సు, కాళీ కుండ్ సరస్సులు నిరంతరం విస్తరిస్తుండటంతో అత్యధిక ముప్పు ఉన్నవిగా గుర్తించారు.
వాసుకి సరస్సు కూడా విస్తరిస్తోంది. అయితే దాని చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్ల పరిధిలో జనావాసాలు లేకపోవడంతో అక్కడ ప్రాణ, ఆస్తి నష్టం ముప్పు తక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
హిమనదాలు, సరస్సులపై పెరుగుతున్న పర్యాటక ప్రభావం కూడా ఆందోళన కలిగిస్తోంది.
పర్యాటక కార్యకలాపాల వల్ల వెలువడే కార్బన్ కణాలు, దుమ్ము హిమనదాలపై పేరుకుపోతున్నాయి. దీంతో మంచు కరిగే వేగం పెరుగుతోంది.
అదే సమయంలో పెర్మాఫ్రాస్ట్ కరుగుతుండటంతో దాని పైన ఉన్న పొర కదిలి కొండ ప్రాంతాల్లో అస్థిరత ఏర్పడుతోంది.
వివరాలు
నేపాల్, చైనా, భారత్ ప్రాంతాలకు ఈ ముప్పు ఎక్కువ
నేపాల్‌లో సంభవించిన వరదలకు లాంగ్‌టాంగ్ లిరుంగ్ పర్వత శిఖరం సమీపంలోని ఓ హిమనదం కూలి లోయలో పడటం కారణమై ఉండొచ్చని చెబుతున్నారు.
హిమాలయ ప్రాంతంలోని మరిన్ని హిమనదాలు బలహీనపడుతున్న నేపథ్యంలో ఇలాంటి హిమ సరస్సు వరదలు మళ్లీ సంభవించే అవకాశం ఉందని చైనా, ఐక్యరాజ్యసమితి నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇతర ప్రాంతాలతో పోలిస్తే హిమాలయాలు వేగంగా వేడెక్కుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ముఖ్యంగా నేపాల్, చైనా, భారత్ ప్రాంతాలకు ఈ ముప్పు ఎక్కువగా ఉందని పేర్కొంటున్నారు.