Vikram-1: అంతరిక్షంలోకి 'వజ్ర కమలం'.. విక్రమ్-1తో కొత్త అధ్యాయానికి భారత్ సిద్ధం
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ అంతరిక్ష రంగంలో మరో అరుదైన ఘట్టానికి సిద్ధమవుతోంది. దేశంలోనే తొలి ప్రైవేటు ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగంతో పాటు ప్రత్యేకంగా రూపొందించిన ల్యాబ్-గ్రోన్ వజ్ర కమలం కూడా అంతరిక్ష ప్రయాణం చేయనుంది. బెంగళూరుకు చెందిన కాస్మోస్ డైమండ్స్ ఈ కళాఖండాన్ని రూపొందించింది. భారతదేశంలో తయారైన ల్యాబ్-గ్రోన్ వజ్ర కళాఖండం అంతరిక్షంలోకి వెళ్లడం ఇదే మొదటిసారి కానుంది. ఈప్రాజెక్టు వివరాలను వెల్లడిస్తూ విడుదల చేసిన వీడియోలో సంస్థ ఆసక్తికర విషయాలను పంచుకుంది. రాకెట్‌లో ఏ వస్తువును పంపాలనే అంశంపై తమ బృందం నెలల తరబడి చర్చించిందని తెలిపింది. మొదట భారీ వజ్రాన్ని పంపాలా,లేక ప్రత్యేక డిజైన్‌లో వజ్రాన్ని రూపొందించాలా అనే ఆలోచనలు చేసినప్పటికీ..చివరకు భారత జాతీయ పుష్పమైన కమలాన్ని ఎంపిక చేసినట్లు వెల్లడించింది.
వివరాలు
భారత సంస్కృతి, ఆధ్యాత్మికతకు ప్రతీకగా కమలాన్ని ఎంపిక చేసిన కాస్మోస్ డైమండ్స్
సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. భారతీయ సంస్కృతి,ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో కమలం పవిత్రత, సృష్టి,జ్ఞానోదయానికి ప్రతీకగా భావిస్తారు. బుద్ధుడు,శ్రీమహావిష్ణువు,మహాలక్ష్మీ,బ్రహ్మదేవుడు,సరస్వతీదేవి వంటి దైవాలతో కమలానికి ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రూపకల్పన చేపట్టినట్లు పేర్కొంది. అలాగే తమ సంస్థ పేరు 'కాస్మోస్'అంటే విశ్వమని, భారతీయ సృష్టి తత్వంలో విశ్వం కమలం నుంచి ఆవిర్భవించిందనే భావన కూడా ఈ ఎంపికకు ప్రేరణగా నిలిచిందని వివరించింది. ఈ కళాఖండం రూపకల్పన కోసం అనేక నమూనాలను పరిశీలించిన అనంతరం తుది డిజైన్‌ను ఖరారు చేసినట్లు కంపెనీ తెలిపింది. బంగారంతో రూపొందించిన మధ్యభాగం చుట్టూ ల్యాబ్-గ్రోన్ వజ్రాలను అమర్చి కమల ఆకారాన్ని తీర్చిదిద్దారు. కమలం మధ్యలోని బంగారు భాగాన్ని లక్ష్మీదేవి,బ్రహ్మదేవుడి ఆసనాన్ని సూచించే విధంగా ప్రత్యేకంగా రూపొందించినట్లు వెల్లడించింది.
వివరాలు
రాకెట్ ప్రయోగాన్ని తట్టుకునేలా ప్రత్యేక బలం, వైబ్రేషన్ పరీక్షలు నిర్వహించిన సంస్థ
అంతరిక్ష ప్రయాణానికి అనువుగా ఉండేలా ఈ వజ్ర కమలంపై పలు సాంకేతిక పరీక్షలు నిర్వహించారు. రాకెట్ ప్రయోగ సమయంలో ఎదురయ్యే తీవ్రమైన ప్రకంపనలు,ఒత్తిడిని తట్టుకునేలా దాని బలం, నిర్మాణ స్థిరత్వాన్ని పరీక్షించినట్లు సంస్థ తెలిపింది. వైబ్రేషన్ టెస్టులను విజయవంతంగా పూర్తి చేయడంతో పాటు ప్రయోగ సమయంలో ఒక్క వజ్రం కూడా విడిపోకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ వజ్ర కమలం శాస్త్రీయ పేలోడ్‌లో భాగం కాకపోయినా..భారతీయ కళాత్మకత,సాంకేతిక ప్రతిభ, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసే ప్రతీకగా అంతరిక్షంలోకి పంపుతున్నట్లు కాస్మోస్ డైమండ్స్ పేర్కొంది. మరోవైపు స్కైరూట్ ఏరోస్పేస్‌కు చెందిన విక్రమ్-1 మిషన్ విజయవంతమైతే.. కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టిన తొలి భారత ప్రైవేటు ఆర్బిటల్ రాకెట్‌గా చరిత్రలో నిలిచే అవకాశం ఉంది.