Loading...
Dengue vaccine: డెంగీకి తొలి టీకా.. 2027లో క్యూ‌డెంగా ఎంట్రీ!
డెంగీకి తొలి టీకా.. 2027లో క్యూ‌డెంగా ఎంట్రీ!

Dengue vaccine: డెంగీకి తొలి టీకా.. 2027లో క్యూ‌డెంగా ఎంట్రీ!

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 10, 2026
03:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

డెంగీ వ్యాధికి భారత్‌లో తొలి టీకా క్యూ‌డెంగా (Qdenga)2027 ప్రథమార్ధంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్‌ చంద్రకాంత్‌ లహరియా ఈ విషయాన్ని సోమవారం తన వాట్సాప్‌ ఛానల్‌లో వెల్లడించారు. తొలుత ఈ టీకా ప్రైవేటు ఆరోగ్య సేవల ద్వారా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. జపాన్‌కు చెందిన టకెడా ఫార్మాస్యూటికల్‌ సంస్థ కూడా జులైలో ఇదే విషయాన్ని తెలిపినట్లు రాయిటర్స్‌ పేర్కొంది. డెంగీ అనేది దోమల ద్వారా వ్యాపించే వైరల్‌ వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతున్న దోమల ద్వారా వచ్చే వ్యాధుల్లో ఇది ఒకటి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. 2024లో ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 1.44కోట్ల డెంగీ కేసులు నమోదయ్యాయి.

వివరాలు 

క్యూ‌డెంగా అంటే ఏమిటి?

వీటిలో 11,201 మంది మరణించారు. భారత్‌లో 2,32,425 కేసులు, 233 మరణాలు నమోదయ్యాయి.

క్యూ‌డెంగా ఒక లైవ్‌ అటెన్యుయేటెడ్‌ టెట్రావాలెంట్‌ డెంగీ వ్యాక్సిన్‌.

అంటే డెంగీ వైరస్‌లోని నాలుగు రకాల సెరోటైప్‌లు (1, 2, 3, 4) బలహీనపరిచిన రూపాల్లో ఈ టీకాలో ఉంటాయి.

ఇవి డెంగీ వ్యాధిని కలిగించేంత శక్తివంతంగా ఉండవు. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి భవిష్యత్తులో డెంగీ వైరస్‌ సోకినప్పుడు దాని నుంచి రక్షణ కల్పించడమే ఈ టీకా ఉద్దేశం.

4 నుంచి 60 ఏళ్ల వయసున్న పిల్లలు, పెద్దల్లో డెంగీ నివారణ కోసం దీన్ని ఉపయోగించవచ్చు.

వివరాలు 

భారత్‌లో క్యూ‌డెంగా ఆమోదం పొందిందా?

అవును. కేంద్ర ఔషధ ప్రమాణ నియంత్రణ సంస్థ (CDSCO) ఇప్పటికే భారత్‌లో క్యూ‌డెంగా విక్రయానికి అనుమతి ఇచ్చింది.

2026 జులై 21న కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. టీకా నాణ్యత, భద్రత, సమర్థతపై సమగ్ర శాస్త్రీయ పరిశీలన అనంతరం ఈ అనుమతి మంజూరైంది.

1940 నాటి డ్రగ్స్‌ అండ్‌ కాస్మెటిక్స్‌ చట్టం, 1945 నాటి డ్రగ్స్‌ నిబంధనలకు అనుగుణంగా ఈ ప్రక్రియ జరిగింది.

ADVERTISEMENT

వివరాలు 

ఎవరికి క్యూ‌డెంగా ఉపయోగపడుతుంది?

భారత్‌లో డెంగీ నివారణ కోసం 4 నుంచి 60 ఏళ్ల వయసున్న వారికి ఆమోదం పొందిన తొలి టీకా క్యూ‌డెంగా.

అయితే ఈ టీకా అందరికీ తప్పనిసరిగా అవసరమని చెప్పలేమని నిపుణులు సూచిస్తున్నారు.

టీకా తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించి అది తమకు సరిపోతుందో లేదో తెలుసుకోవాలని డాక్టర్‌ చంద్రకాంత్‌ లహరియా సూచించారు.

గర్భిణులు, 10 ఏళ్లలోపు పిల్లలు, వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి డెంగీ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

మధుమేహం, ఊబకాయం, అధిక రక్తపోటు, కొవ్వు కాలేయం, అధిక కొలెస్ట్రాల్‌ వంటి మెటబాలిక్‌ సమస్యలు ఉన్న పెద్దలు తీవ్రమైన ఇన్ఫెక్షన్ల బారిన పడితే మరింత జాగ్రత్త అవసరమని లహరియా తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు 

ఈ టీకా ఎవరికి ఇవ్వకూడదు?

WHO సూచనల ప్రకారం క్యూ‌డెంగా టీకాలోని పదార్థాలకు అలర్జీ ఉన్నవారు తీసుకోకూడదు.

అలర్జీ లక్షణాల్లో చర్మంపై దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముఖం లేదా నాలుక వాపు వంటివి ఉండొచ్చు.

రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నవారు, జన్యుపరమైన సమస్యలు లేదా హెచ్‌ఐవీ కారణంగా ఇమ్యూనిటీ తగ్గినవారు కూడా ఈ టీకా తీసుకోకూడదు.

రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపే మందులు, ఉదాహరణకు అధిక మోతాదులో కార్టికోస్టెరాయిడ్లు లేదా కీమోథెరపీ తీసుకుంటున్నవారికి కూడా క్యూ‌డెంగా ఇవ్వకూడదు.

అలాంటి చికిత్స పూర్తయిన నాలుగు వారాల తర్వాతే టీకా ఇవ్వాలని WHO సూచించింది. గర్భిణులు, పాలిచ్చే తల్లులు కూడా ఈ టీకా తీసుకోకూడదు.

వివరాలు 

టీకా తీసుకునే ముందు జాగ్రత్తలు

జ్వరం లేదా ఇన్ఫెక్షన్‌ ఉన్న సమయంలో టీకా తీసుకోవడం వాయిదా వేయాల్సి రావచ్చు.

ఇంజెక్షన్‌ తీసుకున్నప్పుడు గతంలో కళ్లు తిరగడం, స్పృహ తప్పడం వంటి సమస్యలు ఎదురైనవారు కూడా వైద్యుడికి ముందే చెప్పాలి.

ముఖ్యంగా చిన్న వయసు వారిలో ఇంజెక్షన్‌ సమయంలో లేదా వెంటనే తర్వాత కళ్లు తిరగడం, పడిపోవడం వంటివి జరగవచ్చు.

ఎప్పుడు టీకా తీసుకోవాలి?

డాక్టర్‌ సూచిస్తే డెంగీ సీజన్‌ ప్రారంభమయ్యే ముందు లేదా డెంగీ వైరస్‌ వ్యాప్తికి గురయ్యే అవకాశం ఉన్న సమయానికి ముందే టీకా ప్రక్రియను ప్రారంభించడం మంచిదని లహరియా తెలిపారు.

వివరాలు 

ఎన్ని డోసులు తీసుకోవాలి?

క్యూ‌డెంగా టీకా షెడ్యూల్‌లో మొత్తం రెండు డోసులు ఉంటాయి. మొదటి డోసు తీసుకున్న మూడు నెలల తర్వాత రెండో డోసు ఇవ్వాలి.

అంటే 0, 3 నెలల వ్యవధిలో ఒక్కోసారి 0.5మిల్లీలీటర్‌ టీకాను చర్మం కింద ఉండే కొవ్వు పొరలోకి ఇంజెక్షన్‌ రూపంలో ఇస్తారు.

డెంగీ వ్యాప్తిని క్యూ‌డెంగా అడ్డుకోగలదా?

క్యూ‌డెంగా వల్ల డెంగీ తీవ్రత, ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితులు తగ్గే అవకాశం ఉందని అపోలో హాస్పిటల్స్‌కు చెందిన అంటువ్యాధుల నిపుణురాలు దివ్య కేఎస్‌ రాయిటర్స్‌తో తెలిపారు.

అయితే డెంగీని వ్యాప్తి చేసే దోమలు విస్తృతంగా ఉన్నంతకాలం ఈ టీకా పూర్తిగా డెంగీ వ్యాప్తిని అడ్డుకోలేదని ఆమె పేర్కొన్నారు.

అంటే టీకా అందుబాటులోకి వచ్చినప్పటికీ దోమల నియంత్రణ, వ్యక్తిగత రక్షణ చర్యలు కొనసాగించాల్సిందే.

వివరాలు 

టీకా తీసుకున్న తర్వాత కూడా డెంగీ వస్తుందా?

వచ్చే అవకాశం ఉంది. ఏ టీకా మాదిరిగానే క్యూ‌డెంగా కూడా ప్రతి ఒక్కరినీ పూర్తిగా డెంగీ నుంచి రక్షిస్తుందని చెప్పలేమని WHO తెలిపింది.

కాలక్రమంలో టీకా అందించే రక్షణ కొంత తగ్గే అవకాశం కూడా ఉంది.

టీకా తీసుకున్న తర్వాత కూడా దోమ కాట్ల నుంచి రక్షించుకోవడం చాలా ముఖ్యం.

అధిక జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి, ఆగకుండా వాంతులు, వేగంగా శ్వాస తీసుకోవడం, చిగుళ్ల నుంచి రక్తస్రావం, తీవ్ర అలసట, ఆందోళన లేదా వాంతుల్లో రక్తం కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

వివరాలు 

క్యూ‌డెంగా దుష్ప్రభావాలు

క్యూ‌డెంగా తీసుకున్న ప్రతి ఒక్కరిలో దుష్ప్రభావాలు కనిపించకపోవచ్చు.

అయితే అధ్యయనాల్లో టీకా వేసిన ప్రదేశంలో నొప్పి, తలనొప్పి, కండరాల నొప్పి, ఎర్రబడటం, అనారోగ్యంగా అనిపించడం, బలహీనత, ముక్కు లేదా గొంతు ఇన్ఫెక్షన్‌, జ్వరం వంటి సమస్యలు సాధారణంగా కనిపించాయి.

ఇంజెక్షన్‌ వేసిన చోట వాపు, నొప్పి లేదా దురద, చిన్నపాటి గాయంలా మారడం, గొంతు లేదా టాన్సిల్స్‌లో వాపు, కీళ్ల నొప్పులు, ఫ్లూ లాంటి లక్షణాలు కూడా కొందరిలో కనిపించవచ్చు.

కొంతమందిలో విరేచనాలు, వికారం, కడుపునొప్పి, వాంతులు, తల తిరగడం, చర్మంపై దురద లేదా దద్దుర్లు, అలసట, ముక్కు కారడం వంటి దుష్ప్రభావాలు ఉండొచ్చు.

వివరాలు 

క్యూ‌డెంగా ఎలా పనిచేస్తుంది?

చాలా అరుదుగా ముఖం,గొంతు, చేతులు, కాళ్ల కింద చర్మం అకస్మాత్తుగా వాపు రావచ్చు.4 నుంచి 5 ఏళ్ల పిల్లల్లో ఆకలి తగ్గడం,నిద్రగా అనిపించడం వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు.

ఈ టీకా శరీరంలోని సహజ రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తుంది. తద్వారా భవిష్యత్తులో డెంగీ వైరస్‌ శరీరంలోకి ప్రవేశించినప్పుడు దాన్ని ఎదుర్కొనే రక్షణ వ్యవస్థ సిద్ధంగా ఉంటుంది.

టీకా ఎంత సమర్థంగా పనిచేస్తుంది?

చివరి దశ క్లినికల్‌ ట్రయల్‌లో రెండో డోసు తీసుకున్న ఏడాది తర్వాత ధ్రువీకరించిన డెంగీ కేసులను నివారించడంలో క్యూ‌డెంగా 80.2 శాతం సమర్థత చూపినట్లు రాయిటర్స్‌ తెలిపింది.

రెండో డోసు తర్వాత 18 నెలలకు డెంగీ కారణంగా ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితులను 90.4 శాతం వరకు తగ్గించినట్లు సంస్థ తెలిపింది.

వివరాలు 

క్యూ‌డెంగా ఎవరు తయారు చేస్తున్నారు?

జర్మనీకి చెందిన టకెడా జీఎంబీహెచ్‌ సంస్థ క్యూ‌డెంగా టీకాను తయారు చేస్తోంది. భారత్‌లో దీన్ని టకెడా బయోఫార్మాస్యూటికల్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ దిగుమతి చేయనుంది.

ఇది కొత్త టీకానా?

కాదు. క్యూ‌డెంగా కొత్తగా అభివృద్ధి చేసిన టీకా కాదు. ఇప్పటికే యూరోపియన్‌ యూనియన్‌, బ్రిటన్‌, స్విట్జర్లాండ్‌, ఇండోనేషియా, మలేసియా, థాయ్‌లాండ్‌ సహా 42 దేశాల్లో పిల్లలు, పెద్దలకు అందుబాటులో ఉంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి కూడా ఈ టీకాకు ప్రీక్యాలిఫికేషన్‌ లభించింది.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 2.4 కోట్లకు పైగా క్యూ‌డెంగా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

వివరాలు 

ఇది కొత్త టీకానా?

2024 ఫిబ్రవరిలో టకెడా, భారత టీకా తయారీ సంస్థ బయలాజికల్‌ ఈతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసింది.

ఈ భాగస్వామ్యం ద్వారా ఏడాదికి 5 కోట్ల డోసుల వరకు తయారు చేసే సామర్థ్యాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 10 కోట్ల డోసుల తయారీ సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు టకెడా ఈ ఏడాది జులైలో తెలిపింది.

ADVERTISEMENT