Meta: ఫేస్‌బుక్,ఇన్‌స్టాలో ఇక అలా కుదరదు.. మెటాకు కేంద్రం హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్‌లలో తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ రెండు సామాజిక మాధ్యమాలకు మాతృసంస్థ అయిన మెటాకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) తాజాగా సూచనలు జారీ చేసింది. తమ ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్‌ను వినియోగదారులకు సిఫార్సు చేసే విధానాలను మరోసారి పరిశీలించాలని ఆదేశించింది. కొన్ని రకాల కథనాలు, సమాచారానికే అధిక ప్రాధాన్యం లభించకుండా చూడటంతో పాటు, ప్రజాశాంతికి భంగం కలిగించే లేదా హింసను ప్రేరేపించే కంటెంట్‌పై నియంత్రణలను మరింత బలోపేతం చేయడం ఈ చర్యల ప్రధాన ఉద్దేశం.
వివరాలు
కంటెంట్‌కు తగిన నేపథ్య సమాచారాన్ని అందించాలి
ప్రస్తుతం జరుగుతున్న ఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, గ్రాఫిక్స్, ఇతర సమాచారాన్ని ప్రచురించేటప్పుడు వాటికి తగిన నేపథ్య వివరాలను అందించాలని కేంద్రం మెటాకు సూచించింది.
ముఖ్యంగా ఆ కంటెంట్ నిజమైనదో కాదో, ఏ పరిస్థితుల్లో రూపొందించారో వినియోగదారులు సులభంగా నిర్ధారించలేని సందర్భాల్లో ఈ జాగ్రత్తలు అవసరమని స్పష్టం చేసింది.
ప్రజల్లో గందరగోళం సృష్టించే లేదా హింసకు దారితీసే అవకాశమున్న సమాచారాన్ని వేగంగా గుర్తించి, ఉన్నత స్థాయి పరిశీలనకు పంపే వ్యవస్థలను కూడా బలోపేతం చేయాలని కోరింది.
వివరాలు
ఒకే తరహా సమాచారానికి అల్గారిథమ్‌లలో అధిక ప్రాధాన్యం
మెటా సామాజిక మాధ్యమాల్లో కొన్ని రకాల కథనాలు, సమాచారానికే సిఫార్సు అల్గారిథమ్‌లు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖకు వివిధ సంస్థల నుంచి నివేదికలు అందినట్లు మనీ కంట్రోల్ కథనం వెల్లడించింది.
దీనివల్ల ఇతర అభిప్రాయాలు, సమాచారానికి తగిన ప్రాధాన్యం లభించడం లేదని అధికారులు గుర్తించినట్లు పేర్కొంది.
అంతేకాకుండా, ఐటీ నిబంధనలు-2021 ప్రకారం దర్యాప్తు సంస్థలు, ఇతర అధికారిక ప్రభుత్వ విభాగాలకు మెటా సకాలంలో సహకరించాలని కేంద్రం సూచించింది.
వివరాలు
శాంతిభద్రతలకు సంబంధించిన కంటెంట్‌పై కేంద్రం ఆందోళన
శాంతిభద్రతలకు సంబంధించిన ఘటనలపై రూపొందించిన వీడియోలు, ఫొటోలు, ప్రకటనలు, గ్రాఫిక్స్ మెటా ప్లాట్‌ఫామ్‌లలో వినియోగదారులకు ప్రముఖంగా కనిపించేలా సిఫార్సు అవుతున్నాయని కేంద్రం గుర్తించింది.
తగిన నేపథ్య సమాచారం లేకుండా ఇలాంటి కంటెంట్‌ను ప్రచారం చేయడం లేదా కొన్ని అంశాలకు అసాధారణ ప్రాధాన్యం కల్పించడం వల్ల ప్రజల్లో గందరగోళం, ఆందోళన పెరగడంతో పాటు ప్రజాశాంతి, సామాజిక సామరస్యానికి విఘాతం కలిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
వివరాలు
మెటాకు ఆరు కీలక సూచనలు
పాత వీడియోలు, ప్రస్తుత ఘటనలకు సంబంధం లేని దృశ్యాలు లేదా మార్పులు చేసిన చిత్రాలను తాజాగా జరిగిన సంఘటనలుగా చూపించే కంటెంట్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కేంద్రం సూచించింది.
అత్యవసర పరిస్థితులు, ఆంక్షలు, పోలీసుల చర్యలు, ఇతర అధికారిక నిర్ణయాలకు సంబంధించి ధ్రువీకరించని సమాచారాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలించాలని పేర్కొంది.
ఐటీ నిబంధనల ప్రకారం నిషేధిత కంటెంట్‌ను గుర్తించి, తొలగించడం లేదా తగిన చర్యలు తీసుకోవడం, తప్పుడు సమాచారానికి అధిక ప్రాధాన్యం లభించకుండా కంటెంట్ సిఫార్సు, ర్యాంకింగ్ విధానాలను సమీక్షించడం వంటి ఆరు కీలక అంశాలను కేంద్రం తన సూచనల్లో పొందుపరిచింది.