Sunita Williams: సునీతా విలియమ్స్‌కు అరుదైన గౌరవం.. న్యూయార్క్ పరేడ్‌కు నాయకత్వం
ఈ వార్తాకథనం ఏంటి
భారత సంతతికి చెందిన ప్రముఖ వ్యోమగామి, అమెరికా నావికాదళ రిటైర్డ్ కెప్టెన్ సునీతా విలియమ్స్‌కు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలో మాజీ సైనికుల సేవలను గుర్తుచేసుకుంటూ ఏటా నిర్వహించే 'వెటరన్స్ డే పరేడ్'కు ఆమె గ్రాండ్ మార్షల్‌గా వ్యవహరించారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం న్యూయార్క్‌లోని మాన్‌హాటన్ ఫిఫ్త్ అవెన్యూలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ భారీ పరేడ్‌లో 20 వేల మందికి పైగా పాల్గొన్నారు. కార్యక్రమానికి సునీతా విలియమ్స్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రాండ్ మార్షల్‌గా వ్యవహరించే అవకాశం రావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. నావికాదళంలో పనిచేసిన అనుభవమే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా సిద్ధం చేసిందని చెప్పారు.
వివరాలు
టెస్ట్ పైలట్‌గా పని చేసిన సునీతా విలియమ్స్
ప్రతి తరం సైనికుల సేవలు, త్యాగాలు, అంకితభావాన్ని గుర్తించి గౌరవించే ఈ కార్యక్రమంలో భాగస్వామి కావడం గర్వంగా ఉందన్నారు.
నాసాలో చేరకముందు సునీతా విలియమ్స్ టెస్ట్ పైలట్‌గా పనిచేశారు.
అనంతరం వ్యోమగామిగా మూడు అంతరిక్ష యాత్రల్లో పాల్గొని మొత్తం 608 రోజులు అంతరిక్షంలో గడిపారు.
తొమ్మిదిసార్లు స్పేస్‌వాక్ చేసి, మొత్తం 62 గంటల పాటు అంతరిక్షంలో నడిచిన మహిళగా రికార్డు సృష్టించారు.
107వ వార్షిక వెటరన్స్ డే పరేడ్‌లో వేలాది మంది మాజీ సైనికులతో పాటు సాయుధ దళాల బృందాలు, పాఠశాల విద్యార్థులు కూడా పాల్గొన్నారు.
వివరాలు
గతంలో భగవద్గీత, ఉపనిషత్తులను అంతరిక్షంలోకి తీసుకెళ్లిన సునీత
ప్రముఖ న్యూరోఅనాటమిస్ట్ దీపక్ పాండ్యా, స్లోవేనియాకు చెందిన ఉర్సులిన్ పాండ్యా దంపతులకు సునీత జన్మించారు.
గతంలో 2006లో భగవద్గీతను, 2012లో ఉపనిషత్తులను అంతరిక్షంలోకి తీసుకెళ్లి వార్తల్లో నిలిచారు.
2024లో బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమనౌక ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన ఆమె.. సాంకేతిక సమస్యల కారణంగా దాదాపు తొమ్మిది నెలల పాటు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.
చివరకు స్పేస్‌ఎక్స్ క్రూ-9 మిషన్ ద్వారా భూమికి తిరిగి వచ్చారు.
ఇప్పుడు న్యూయార్క్ వెటరన్స్ డే పరేడ్‌కు గ్రాండ్ మార్షల్‌గా వ్యవహరించడం ద్వారా మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు.