Anil Menon: జూలై 14న ఐఎస్‌ఎస్‌కు భారత సంతతి వ్యోమగామి అనిల్ మేనన్ ప్రయాణం
ఈ వార్తాకథనం ఏంటి
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి అనిల్ మేనన్ ఈ నెల 14న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)కు బయలుదేరనున్నారు. ఈ ప్రయాణం రష్యా సోయుజ్-ఎంఎస్-29 వ్యోమనౌకలో జరగనుండగా,కజకిస్థాన్‌లోని బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి ప్రయోగం నిర్వహించనున్నారు. ఈ మిషన్‌లో మేనన్‌తో పాటు రష్యాకు చెందిన వ్యోమగాములు ప్యోటర్ డుబ్రోవ్,అన్నా కికినా కూడా పాల్గొంటారు. అమెరికాలోని మినియాపొలిస్‌లో జన్మించిన అనిల్ మేనన్ అత్యవసర వైద్య నిపుణుడిగానే కాకుండా మెకానికల్ ఇంజినీర్‌గా కూడా విశేష గుర్తింపు పొందారు. ఆయన తండ్రి భారతదేశం నుంచి అమెరికాకు వలస వెళ్లగా, తల్లి ఉక్రెయిన్ మూలాలు కలిగినవారు. అమెరికా వైమానిక దళంలో సేవలందించిన మేనన్ అఫ్గానిస్థాన్ యుద్ధంలో కూడా పాల్గొన్నారు.
వివరాలు
సూక్ష్మ గురుత్వాకర్షణ పరిస్థితుల్లో రక్తప్రసరణ వ్యవస్థలో జరిగే మార్పుల పరిశీలన
అలాగే హిమాలయ ప్రాంతంలో ఎవరెస్టు పర్వతారోహకులకు సహాయపడే హిమాలయన్ రెస్క్యూ అసోసియేషన్‌లో సేవలు అందించారు. రోటరీ అంబాసడోరియల్ స్కాలర్‌గా ఎంపికైన ఆయన, పోలియో టీకా కార్యక్రమంపై అధ్యయనం కోసం భారత్‌లో ఏడాది పాటు గడిపారు. వైద్య రంగంలోనూ, సేవా కార్యక్రమాల్లోనూ ఆయన విశేష అనుభవాన్ని సంపాదించారు. ఈ మిషన్‌లో భాగంగా అనిల్ మేనన్ సుమారు ఎనిమిది నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉండనున్నారు. దీర్ఘకాలం అంతరిక్షంలో నివసించడం వల్ల మానవ శరీరంపై కలిగే ప్రభావాలను అధ్యయనం చేయడంతో పాటు పలు కీలక శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా సూక్ష్మ గురుత్వాకర్షణ పరిస్థితుల్లో రక్తప్రసరణ వ్యవస్థలో జరిగే మార్పులను పరిశీలించనున్నారు.
వివరాలు
అనిల్ భార్య కూడా వ్యోమగామే
అలాగే ఐఎస్‌ఎస్‌లో అందుబాటులో ఉన్న తాగునీటి వ్యవస్థను ఉపయోగించి,రక్తనాళాల్లోకి ఎక్కించే వైద్య ద్రవాలను తయారుచేసే సాంకేతికతలను పరీక్షించనున్నారు. సెమీకండక్టర్ క్రిస్టల్స్ తయారీ విధానాలను మెరుగుపరిచే పరిశోధనలు కూడా ఈ మిషన్‌లో భాగం. ఈ అధ్యయనాలు భవిష్యత్‌లో మరింత శక్తివంతమైన కంప్యూటర్లు,కృత్రిమ మేధ ఆధారిత సాంకేతికతలు,ఆధునిక వైద్య పరికరాల అభివృద్ధికి ఉపయోగపడనున్నాయి. అంతేకాకుండా కృత్రిమ మేధ(ఏఐ)సహాయంతో అల్ట్రాసౌండ్ విధానాలపై కూడా పరిశోధనలు చేపట్టనున్నారు. అనిల్ మేనన్ 2014లో నాసాలో ఫ్లైట్ సర్జన్‌గా చేరి,అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని వ్యోమగాములతో కలిసి పనిచేశారు. అనంతరం 2018లో స్పేస్‌ఎక్స్ వైద్య విభాగంలో బాధ్యతలు చేపట్టారు.తర్వాత 2021డిసెంబరులో నాసా వ్యోమగామిగా ఎంపికయ్యారు. ఆయన భార్య అన్నా విల్హెల్మ్ కూడా వ్యోమగామే.ఆమె 2024 సెప్టెంబరులో అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేశారు.