బృహస్పతి కంటే 13రెట్ల పెద్ద గ్రహాన్ని కనిపెట్టిన భారతీయ శాస్త్రవేత్తలు
ఫిజికల్ రీసెర్చ్ ల్యాబోరేటరీ (పీఆర్ఎల్) కు చెందిన అభిజిత్ చక్రవర్తి నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం, ఒక భారీ గ్రహాన్ని కనుగొంది. ఈ గ్రహం సైజు, బృహస్పతి(జుపిటర్) కంటే 13రెట్లు పెద్దగా ఉంటుందట. పీఆర్ఎల్ బృందం కనుక్కున్న మూడవ ఎక్సో ప్లానెట్ ఇది. దీనికి సంబంధించిన వివరాలు ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ లెటర్లలో ప్రచురితం అయ్యాయి. ఈ గ్రహం ద్రవ్యరాశిని కొలవడానికి భారతదేశం, జర్మనీ, స్విట్జర్ ల్యాండ్, అమెరికా దేశాల శాస్త్రవేత్తలు మౌంట్ అబూలోని గురుశిఖార్ అబ్జర్వేటరీలో పీఆర్ఎల్ అడ్వాన్స్‌డ్ రేడియల్-వెలాసిటీ అబు-స్కై సెర్చ్ స్పెక్ట్రోగ్రాఫ్ (PARAS)ని ఉపయోగించింది. దీని ప్రకారం ఆ గ్రహం ద్రవ్యరాశి 14 g/cm3 గా కొలిచారు.
మండుతూ ఉండే గ్రహం
కొత్తగా కనుక్కున్న ఈ గ్రహం, TOI4603 లేదా HD 245134 అనే నక్షత్రం చుట్టూ తిరుగుతుంది. భూమికీ ఈ గ్రహానికి మధ్య 731కాంతి సంవత్సరాల దూరం ఉంది. ఈ గ్రహం దాని నక్షత్రం చుట్టూ తిరగడానికి 7.24రోజులు పడుతుంది. ఈ గ్రహం మీద ఉష్ణోగ్రత 1396డిగ్రీల సెల్సియస్ గా ఉంది. అంటే ఈ గ్రహం మండుతూ ఉంటుందని అర్థం. ఈ గ్రహానికీ, దీని నక్షత్రానికీ మధ్య దూరం, మనకూ సూర్యుడికి మధ్య దూరంలో పదవ వంతు మాత్రమే. ఇతర గ్రహాల మీద జీవం ఉందా అనే అంశం మీద ప్రయోగాలు సాగిస్తున్నప్పుడు ఇలాంటి గ్రహాలు బయటపడతాయని ఇస్రో వెల్లడి చేసింది. ఇప్పటివరకు 5000రకాల ఎక్సో ప్లానెట్ లను ఇలా గుర్తించినట్లు ఇస్రో తెలియజేసింది.