Instagram: స్నాప్‌చాట్‌కు పోటీగా ఇన్‌స్టాగ్రామ్ కొత్త 'ఇన్‌స్టంట్స్' ఫీచర్.. ఒక్కసారి చూసే ఫొటోలు!
ఈ వార్తాకథనం ఏంటి
స్నాప్ చాట్‌కు పోటీగా ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. "ఇన్‌స్టంట్స్" పేరుతో ప్రారంభించిన ఈ ఫీచర్ ద్వారా యూజర్లు రియల్‌టైమ్‌లో తీసిన ఫొటోలను స్నేహితులతో షేర్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎడిట్ చేయాల్సిన అవసరం లేకుండా, సహజమైన క్షణాలను పంచుకునేలా ఈ ఫీచర్‌ను రూపొందించారు. కెమెరాతో అప్పటికప్పుడు తీసిన ఫొటోలనే షేర్ చేయాలి. గ్యాలరీ నుంచి ఫొటోలను అప్‌లోడ్ చేసే అవకాశం ఉండదు.
వివరాలు
Instagramలో Instantsను ఎలా ఉపయోగించాలి?
ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌బాక్స్‌లో కుడి దిగువ భాగంలో కనిపించే ఆప్షన్‌పై ట్యాప్ చేసి ఫొటో తీసి షేర్ చేయవచ్చు. ఫొటోకు క్యాప్షన్ జోడించే అవకాశం ఉన్నప్పటికీ, ఫొటోను ఎడిట్ చేసే అవకాశం ఉండదు. ఈ ఫొటోలను క్లోజ్ ఫ్రెండ్స్ లేదా పరస్పరం ఫాలో అయ్యే వ్యక్తులతో మాత్రమే పంచుకోవచ్చు. షేర్ చేసిన ఇన్‌స్టంట్స్‌ను ఫ్రెండ్స్ ఒక్కసారి మాత్రమే చూడగలరు. వీటికి రియాక్ట్ అవ్వడం, రిప్లై ఇవ్వడం కూడా సాధ్యం. అలాగే పొరపాటున షేర్ చేసినట్లయితే వెంటనే తొలగించేందుకు Undo బటన్ కూడా అందుబాటులో ఉంటుంది.
వివరాలు
ఎంపిక చేసిన దేశాలలో స్టాండ్ అలొన్ Instants యాప్
యూజర్ల అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకుని కొన్ని దేశాల్లో ప్రత్యేకంగా "ఇన్‌స్టంట్స్" యాప్‌ను కూడా పరీక్షిస్తోంది ఇన్‌స్టాగ్రామ్. ఈ యాప్ ద్వారా నేరుగా కెమెరాను ఓపెన్ చేసి ఫొటోలు షేర్ చేయొచ్చు. ఇప్పటికే ఉన్న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌తోనే లాగిన్ అయ్యే సౌకర్యం ఉంటుంది. ఈ యాప్‌లో షేర్ చేసిన ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లోని ఫ్రెండ్స్‌కూ కనిపిస్తాయి. ప్రస్తుతం ఈ యాప్ iOS, Android ప్లాట్‌ఫామ్‌లలో ఎంపిక చేసిన దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది.
వివరాలు
భద్రత,గోప్యతా ఫీచర్లు యథాతథంగా కొనసాగుతాయి
భద్రత, గోప్యత విషయంలో ఎలాంటి సమస్యలు రాకుండా అన్ని రకాల సేఫ్టీ ఫీచర్లను ఇన్‌స్టాగ్రామ్ ఇందులో కొనసాగిస్తోంది. యూజర్ ఎవరితో షేర్ చేస్తే వారికే ఈ ఫొటోలు కనిపిస్తాయి. టీన్ యూజర్ల కోసం ఇప్పటికే ఉన్న Teen Accounts, Parental Supervision సెట్టింగ్స్ ఆటోమేటిక్‌గా పనిచేస్తాయి. ముఖ్యంగా ఈ ఫొటోలను ఒక్కసారి మాత్రమే చూడగలరు. 24 గంటల తర్వాత అవి పూర్తిగా మాయమవుతాయి. స్క్రీన్‌షాట్ లేదా స్క్రీన్ రికార్డింగ్ కూడా చేయలేని విధంగా ప్రత్యేక రక్షణలు అమలు చేస్తున్నారు.