Instagram: ఇన్‌స్టాగ్రామ్ కీలక నిర్ణయం.. ఏఐతో రూపొందించిన ప్రొఫైల్స్‌కు ప్రత్యేక గుర్తింపు
ఈ వార్తాకథనం ఏంటి
ఏఐతో రూపొందించిన ప్రొఫైల్స్ విషయంలో ఇన్‌స్టాగ్రామ్ కీలక మార్పు చేసింది. ఇకపై కృత్రిమ మేధస్సు (AI)తో రూపొందించిన వ్యక్తులను చూపించే ప్రొఫైల్స్‌కు 'AI-generated profile' అనే కొత్త లేబుల్‌ను ఉపయోగించడం తప్పనిసరి కానుంది. దీంతో ఆ ప్రొఫైల్‌లో కనిపిస్తున్నది నిజమైన వ్యక్తి కాదని, ఏఐతో రూపొందించిన వ్యక్తి అని వినియోగదారులకు స్పష్టంగా తెలుస్తుంది. మానవుల్లా కనిపించే ఏఐ ప్రొఫైల్స్‌ను చూసి యూజర్లు తప్పుదోవ పట్టకుండా ఉండేందుకు ఈ మార్పు తీసుకొచ్చినట్లు ఇన్‌స్టాగ్రామ్ తెలిపింది.
వివరాలు
పాత 'AI creator' ట్యాగ్ స్థానంలో కొత్త లేబుల్
ఇప్పటివరకు ఏఐ కంటెంట్‌ను తరచుగా పోస్ట్ చేసే ప్రొఫైల్స్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 'AI creator' అనే ఆప్షనల్ ట్యాగ్ ఉండేది.
తాజాగా దాని స్థానంలో 'AI-generated profile' అనే కొత్త లేబుల్‌ను తీసుకొచ్చారు. ముఖ్యంగా ఏఐతో రూపొందించిన వ్యక్తిని ప్రధానంగా చూపించే ప్రొఫైల్స్‌కు ఈ గుర్తింపు వర్తిస్తుంది.
నకిలీ ఏఐ ఇన్‌ఫ్లుయెన్సర్లు పెరుగుతున్న నేపథ్యంలో అసలు వ్యక్తులకు, కృత్రిమ వ్యక్తులకు మధ్య తేడా గుర్తించడం కష్టమవుతోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
వివరాలు
నిబంధనలు పాటించకపోతే రీచ్ తగ్గే అవకాశం
కొత్త నిబంధన ప్రకారం తమ ప్రొఫైల్‌కు 'AI-generated profile' లేబుల్ పెట్టని ఖాతాల రీచ్‌ను ఇన్‌స్టాగ్రామ్ తగ్గించే అవకాశం ఉంది.
అయితే తమపై అన్యాయంగా చర్యలు తీసుకున్నారని భావించే క్రియేటర్లు ఇన్‌స్టాగ్రామ్‌లోని 'Account Status' డ్యాష్‌బోర్డ్ ద్వారా అప్పీల్ చేసుకోవచ్చు.
అయితే ప్లాట్‌ఫామ్‌లో ఏఐని ఉపయోగించే ప్రతి ఒక్కరికీ ఈ నిబంధన వర్తించదని సంస్థ స్పష్టం చేసింది.
ఉదాహరణకు ఫొటో ఎడిటింగ్ లేదా క్యాప్షన్‌ను మెరుగుపరచడానికి ఏఐని ఉపయోగించే వారికి ఈ లేబుల్ అవసరం ఉండదు.
వివరాలు
యూజర్ల అభిప్రాయాల ఆధారంగా నిర్ణయం
యూజర్ల నుంచి వచ్చిన అభిప్రాయాలే ఈ కొత్త నిబంధనకు ప్రధాన కారణమని ఇన్‌స్టాగ్రామ్ తెలిపింది.
మానవుడిలా కనిపించే ప్రొఫైల్‌ను చూసిన తర్వాత అది ఏఐతో రూపొందించిన వ్యక్తి అని తెలిసినప్పుడు చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఇన్‌స్టాగ్రామ్ ప్రతినిధి తెలిపారు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఏఐతో రూపొందించిన కంటెంట్ పెరుగుతున్న నేపథ్యంలో దాన్ని పారదర్శకంగా చూపించేందుకు సంస్థలు కొత్త నిబంధనలు తీసుకొస్తున్నాయి.
వివరాలు
అనుమతి లేకుండా చిత్రాల తయారీపై మెటాపై విమర్శలు
ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా ఇటీవల తీసుకున్న ఏఐ టూల్‌పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.
ఇతర వ్యక్తుల చిత్రాలను ఏఐ సాయంతో రూపొందించేందుకు వీలు కల్పించిన ఆ టూల్‌పై పలువురు యూజర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.
తమ ఇన్‌స్టాగ్రామ్‌లో పబ్లిక్‌గా ఉన్న కంటెంట్‌ను స్పష్టమైన అనుమతి లేకుండా ఉపయోగించడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.
దీంతో ఆ ఫీచర్‌ను మెటా తర్వాత తొలగించింది. ఇదిలా ఉండగా, పిల్లలు, టీనేజర్లపై ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ప్రభావానికి సంబంధించిన అమెరికా రాష్ట్రాల వ్యాజ్యాన్ని కూడా మెటా గత వారం 18 బిలియన్ డాలర్లకు పరిష్కరించుకుంది.