3I/ATLAS: 3I/ATLAS సూర్యుడి పాస్‌కి సిద్ధం… రహస్యం బహిర్గతం కావొచ్చు!
ఈ వార్తాకథనం ఏంటి
దశాబ్దాలుగా మనుషులను ఆశ్చర్యపరుస్తున్న "ఎలియన్స్ ఉన్నారా?" అన్న ప్రశ్నకు సమాధానం అక్టోబర్ 30న దొరుకుతుందేమో! న్యూయార్క్ సిటీ కాలేజ్‌కి చెందిన థియరీటికల్ ఫిజిసిస్ట్ డాక్టర్ మిచియో కాకూ మాట్లాడుతూ, "3I/ATLAS" అనే ఆకాశ వస్తువు ఈ వారం తన అసలు రహస్యాన్ని బయటపెడుతుందని చెప్పారు. ఇది కేవలం ఓ ఖగోళ శిలా? లేక భూభయం బయటున్న తెలివైన జీవుల ఆధారమా? అనేది తేలనుంది. మాన్హాటన్‌ంత పెద్దగా ఉన్న ఈ వస్తువు అసాధారణ కదలికలతో, శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది.
కక్ష్య మార్గం
జూలైలో కనుగొన్న అంతార్క్ష వస్తువు
2025 జూలై 1న హవాయిలో ఉన్న ATLAS టెలిస్కోప్ సిస్టమ్ ఈ వస్తువును గుర్తించింది. ఇది మన సౌరవ్యవస్థ గుండా ప్రయాణిస్తుండటంతో "ఇంటర్‌స్టెల్లార్ ఆబ్జెక్ట్"గా వర్గీకరించారు. దీని మార్గం హైపర్‌బాలిక్‌గా ఉండటంతో, ఇది సూర్యుని చుట్టూ ఒక్కసారి తిరిగి, తిరిగి అంతరిక్షం లోతుల్లోకి వెళ్ళిపోతుంది. అక్టోబర్ 29-30 మధ్య సూర్యుని దగ్గరగా వెళ్ళి, డిసెంబర్ 19న భూమికి అత్యంత సమీపంగా ఉండనుంది.
ఎనర్జీ బూస్ట్
సూర్యుడి పాస్ ఎందుకు ముఖ్యమంటే..
డాక్టర్ కాకూ చెబుతున్నట్లు, ఈ వస్తువు సూర్యుని దగ్గరగా వెళ్ళినప్పుడు సాధారణ శక్తి నియమాలను ధిక్కరించేలా అదనపు వేగాన్ని పొందితే.. అది ఎలియన్స్ నియంత్రణలో ఉందనే సంకేతమవుతుంది. ఇది "ఓబెర్త్ ఎఫెక్ట్" అనే శాస్త్రీయ సిద్ధాంతాన్ని పరిశీలించే ముఖ్యమైన అవకాశం కూడా. సాధారణ వేగం కంటే ఎక్కువ బూస్ట్ కనిపిస్తే..అది "కాస్మిక్ కాలింగ్ కార్డ్" అని ఆయన అభిప్రాయపడ్డారు.
అసాధారణ లక్షణాలు
నిశితంగా గమనిస్తున్న నాసా
నాసా గత కొన్ని నెలలుగా 3I/ATLASను నిశితంగా గమనిస్తోంది. దీని కదలికలు, ఎనర్జీ సిగ్నేచర్స్ సాధారణ ధూళికేతువుల (కామెట్స్) లా లేవని గుర్తించింది. అయితే అధికారికంగా ఇప్పటివరకు ఎటువంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు. కొంతమంది శాస్త్రవేత్తలు దీన్ని 2017లో కనిపించిన "ఓమూమువా" అనే అంతరిక్ష సందర్శకుడితో పోలుస్తున్నారు.
ఎదురుచూపు
అక్టోబర్ 30న ప్రపంచం దృష్టి సూర్యుని అంచుపై
అక్టోబర్ 30 రాగానే ప్రపంచ వ్యాప్తంగా టెలిస్కోపులు సూర్యుని అంచుపై కేంద్రీకరించబడతాయి. 3I/ATLAS సహజమైన వస్తువులా ప్రవర్తిస్తుందా, లేక భౌతిక నియమాలను అతిక్రమిస్తుందా అన్నది ఆ రోజే తేలనుంది. ఇది మనుషుల మొదటి "ఎలియన్ ఆధారమా?" లేదా మరో ఆకాశ అతిథేనా అన్న ప్రశ్నకు సమాధానం దొరకనుంది. ఏదేమైనా — విశ్వం గురించి, భూమి వెలుపల జీవుల సాధ్యసాధ్యాల గురించి మన అవగాహనను మార్చే క్షణం ఇదే కావొచ్చు.