Loading...
WhatsApp : ఇకపై వాట్సాప్ వాడాలంటే పుట్టిన తేదీ తప్పనిసరా? కొత్త నోటిఫికేషన్‌తో కలకలం!
ఇకపై వాట్సాప్ వాడాలంటే పుట్టిన తేదీ తప్పనిసరా? కొత్త నోటిఫికేషన్‌తో కలకలం!

WhatsApp : ఇకపై వాట్సాప్ వాడాలంటే పుట్టిన తేదీ తప్పనిసరా? కొత్త నోటిఫికేషన్‌తో కలకలం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 02, 2026
04:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ వాట్సాప్ వినియోగదారులకు త్వరలోనే ఒక కీలక మార్పు కనిపించే అవకాశం ఉంది. కొంతమంది యూజర్లకు ఇప్పటికే యాప్‌లో పుట్టిన తేదీ (Date of Birth) నమోదు చేయాలని కోరుతూ కొత్త నోటిఫికేషన్ కనిపిస్తోంది. ఈ సమాచారం రాబోయే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కోరుతున్నట్లు ఆ నోటిఫికేషన్‌లో పేర్కొనబడింది. అయితే ఈ అంశంపై ఇప్పటివరకు మెటా (Meta) లేదా భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

వివరాలు

వాట్సాప్‌లో ఏం కనిపిస్తోంది?

కొంతమంది భారతీయ వినియోగదారులకు వాట్సాప్ హోమ్ స్క్రీన్‌లో, చాట్‌ల జాబితా పైన పుట్టిన తేదీని నమోదు చేయండి అనే నోటిఫికేషన్ కనిపిస్తోంది.

ఇందులో రాబోయే ప్రభుత్వ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని సేకరిస్తున్నట్లు పేర్కొంటున్నారు.

ప్రస్తుతం ఈ ఫీచర్ అందరికీ అందుబాటులో లేదు. పరిమిత సంఖ్యలో ఉన్న యూజర్లకే ఇది కనిపిస్తోంది.

వివరాలు

వయస్సు వివరాలు ఎందుకు అడుగుతున్నారు?

ఈ వివరాలను ఎందుకు కోరుతున్నారనే దానిపై అధికారిక వివరణ ఇంకా వెలువడలేదు.

అయితే సోషల్ మీడియా, మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌ల వినియోగానికి సంబంధించి కనీస వయోపరిమితి నిబంధనలు భారతదేశంలో కూడా అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే ఆస్ట్రేలియా, యూకే వంటి దేశాలు పిల్లల ఆన్‌లైన్ భద్రత కోసం ఇలాంటి నిబంధనలను అమలు చేస్తున్నాయి.

దీంతో భారత్‌లో కూడా నిర్దిష్ట వయస్సు కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల సోషల్ మీడియా వినియోగాన్ని నియంత్రించే విధానాలు అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు చర్చ సాగుతోంది.

ADVERTISEMENT

వివరాలు

అమెరికాలో ఇప్పటికే అమలు

వాట్సాప్ గతంలో అమెరికాలో వయస్సు ధృవీకరణ (Age Verification) ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.

తల్లిదండ్రుల అనుమతి లేకుండా మైనర్లు అనుచితమైన ఆన్‌లైన్ కంటెంట్‌ను యాక్సెస్ చేయకుండా నిరోధించే రాష్ట్ర చట్టాల నేపథ్యంలో ఈ చర్య తీసుకుంది.

ఆ నిబంధనల ప్రకారం వినియోగదారులు తమ పుట్టిన తేదీని నమోదు చేయాల్సి ఉంటుంది. కొన్ని నివేదికల ప్రకారం, ఒకసారి పుట్టిన తేదీని నమోదు చేసిన తర్వాత దాన్ని మార్చుకునే అవకాశం ఉండకపోవచ్చు.

ప్రస్తుతం ఈ ఫీచర్ కొంతమంది భారతీయ వినియోగదారుల ఫోన్‌లలో కనిపించడం ప్రారంభమైనప్పటికీ, దీనికి కారణం అమెరికా చట్టాలు కాకుండా భారత్‌లో రానున్న నిబంధనలే కావచ్చని భావిస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు

ఇప్పటి వరకు అధికారిక స్పష్టత లేదు

ఈ ఫీచర్‌ గురించి గానీ, భారతదేశంలో వయో ధృవీకరణకు సంబంధించిన కొత్త చట్టాల గురించి గానీ ఇప్పటివరకు మెటా లేదా భారత ప్రభుత్వం నుంచి అధికారిక ధృవీకరణ రాలేదు.

దీంతో ఈ ఫీచర్ అందరికీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? సోషల్ మీడియా వినియోగానికి కనీస వయస్సు నిబంధనలు ఎప్పుడు అమల్లోకి వస్తాయి? అనే అంశాలపై స్పష్టత లేదు.

అయితే ప్రస్తుతం వాట్సాప్‌లో కనిపిస్తున్న ఈ నోటిఫికేషన్‌ను బట్టి భవిష్యత్తులో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వయస్సు ధృవీకరణ ప్రక్రియ తప్పనిసరి అయ్యే అవకాశం ఉందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

ADVERTISEMENT