
Gaganyaan: గగన్‌యాన్ మిషన్‌లో మరో విజయవంతమైన అడుగు: హాట్ టెస్టులు సక్సెస్!
ఈ వార్తాకథనం ఏంటి
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకుపోతున్న గగన్‌యాన్ మిషన్‌లో మరో కీలక ముందడుగు వేసింది. ఇందులో భాగంగా సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్ (SMPS) పై రెండు హాట్ టెస్టులు విజయవంతంగా నిర్వహించబడినట్లు ఇస్రో ప్రకటించింది. ఈ పరీక్షలు జూలై 3న తమిళనాడులోని మహేంద్రగిరి ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో నిర్వహించినట్టు వెల్లడించింది. ఈ రెండు పరీక్షలు స్వల్పకాలిక హాట్ టెస్టులుగా జరిగాయి. మొదటిది 30 సెకన్ల పాటు, రెండోది 100 సెకన్ల పాటు కొనసాగినట్లు ఇస్రో బుధవారం తెలిపింది. ఆర్టికల్ కాన్ఫిగరేషన్‌ను ధృవీకరించేందుకు ఈ టెస్టులు చేపట్టినట్టు వివరించింది.
వివరాలు
SMPS వ్యవస్థకు అవసరమైన సాంకేతిక సహకారంను అందిస్తున్న LPSC
ఇస్రో ప్రకారం, "పరీక్షల సమయంలో ప్రొపల్షన్ సిస్టమ్ ప్రదర్శన, పూర్వ అంచనాలకు అనుగుణంగా, సజావుగా సాగింది. ఇవి పూర్తిగా విజయవంతమయ్యాయి" అని పేర్కొంది. గగన్‌యాన్ మిషన్‌లో కీలక భాగమైన SMPS వ్యవస్థకు అవసరమైన సాంకేతిక సహకారంను లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (LPSC) అందిస్తున్నది. గగన్‌యాన్‌లోని ఆర్బిటల్ మాడ్యూల్‌కు ఇది ఒక ముఖ్యమైన భాగంగా ఇస్రో భావిస్తున్నది. ఈ హాట్ టెస్టులు విజయవంతం కావడంతో, తదుపరి దశగా పూర్తి వ్యవధి పరీక్షలను త్వరలో చేపడతామని ఇస్రో పేర్కొంది.
వివరాలు
గగన్‌యాన్ యాత్రను 2027 తొలి త్రైమాసికంలో చేపట్టే అవకాశాలు
భారత వ్యోమగాములను స్వదేశంగా అభివృద్ధి చేసిన మిషన్ ద్వారా అంతరిక్షంలోకి పంపించాలనే లక్ష్యంతో ఈ గగన్‌యాన్ ప్రాజెక్టును చేపట్టిన సంగతి తెలిసిందే. ఇది భారత అంతరిక్ష రంగంలో కీలక మైలురాయిగా పరిగణించబడుతోంది. ఇస్రో చేస్తున్న ప్రయోగాలు సఫలమవుతుండటంతో ప్రాజెక్టుపై నమ్మకం పెరుగుతోంది. ప్రపంచ అంతరిక్ష రంగంలో భారత స్థాయిని మరింత బలంగా నిలబెట్టే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. కాగా, ఈ గగన్‌యాన్ యాత్రను 2027లో తొలి త్రైమాసికంలో ప్రారంభించే అవకాశం ఉంది అని ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ ఇటీవల వెల్లడించిన విషయం విదితమే.