Page Loader
Instagram: పదహారేళ్ల లోపు యూజర్లకు ఇన్‌స్టాగ్రామ్‌ కఠిన నియమాలు.. దానికి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి 
పదహారేళ్ల లోపు యూజర్లకు ఇన్‌స్టాగ్రామ్‌ కఠిన నియమాలు

Instagram: పదహారేళ్ల లోపు యూజర్లకు ఇన్‌స్టాగ్రామ్‌ కఠిన నియమాలు.. దానికి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 09, 2025
04:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇకపై పదహారేళ్లకు తక్కువ వయసున్న ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లు తల్లిదండ్రుల అనుమతి లేకుండా లైవ్‌ స్ట్రీమ్‌ చేయడం లేదా చిత్రాల్లోని మసక తెర (బ్లర్‌)ను తొలగించడం వంటి చర్యలు చేపట్టలేరు. ఈ విషయాన్ని సోషల్ మీడియా సంస్థ 'మెటా' మంగళవారం అధికారికంగా ప్రకటించింది. యువతను సురక్షితంగా ఉంచేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా ఈ కొత్త నిబంధనలు తీసుకువచ్చారు. ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు, 18 సంవత్సరాల లోపు వయసున్న ఫేస్‌ బుక్‌, మెసెంజర్‌ యూజర్లకూ ఇదే రకమైన భద్రతా మార్గదర్శకాలను వర్తింపజేస్తామని మెటా తెలిపింది. యువతపై సోషల్ మీడియా ప్రతికూల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ఈ చర్యలు అవసరమయ్యాయని సంస్థ అభిప్రాయపడుతోంది.

వివరాలు 

సెప్టెంబర్‌ నెల నుంచే 5.4 కోట్లకు పైగా టీనేజీ అకౌంట్లు

టీనేజర్ల ఆన్‌లైన్‌ కార్యకలాపాలపై తల్లిదండ్రులు మరింత పకడ్బందీగా పర్యవేక్షించే వీలు కల్పించేందుకు సహాయపడాలన్న ఉద్దేశంతో, మెటా గత సెప్టెంబరులో 'టీనేజీ అకౌంట్‌' కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ చర్యల ద్వారా తల్లిదండ్రులకు తమ పిల్లల డిజిటల్‌ నడవడికపై మరింత నియంత్రణ కలుగుతుంది. ఇప్పుడు ప్రవేశపెట్టిన తాజా మార్పులు మొదట అమెరికా, బ్రిటన్‌, కెనడా, ఆస్ట్రేలియా దేశాల్లో అమలులోకి వస్తాయి. తదుపరి మరిన్ని దేశాలకు ఈ మార్గదర్శకాలు విస్తరించనున్నారు. టీన్‌ అకౌంట్లకు ప్రత్యేకంగా రూపొందించిన ఈ భద్రతా నియమాలు ఫేస్‌బుక్‌,మెసెంజర్‌ ప్లాట్‌ఫారాలపై కూడా వర్తిస్తాయని మెటా స్పష్టం చేసింది. గత సెప్టెంబర్‌ నెల నుంచే 5.4 కోట్లకు పైగా టీనేజీ అకౌంట్లు ప్రారంభమైనట్టు సంస్థ పేర్కొంది.