ట్విట్టర్ కొత్త సీఈఓగా 'లిండా యక్కరినో'; సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం
ట్విట్టర్‌కు కొత్త సీఈఓను ఎంపిక చేసినట్లు అధినేత ఎలోన్ మస్క్ ప్రకటించారు. అయితే కొత్త సీఈఓ ఎవరనే దానిపై అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్‌బీసీ యూనివర్సల్‌లో అడ్వర్టైజింగ్ హెడ్‌గా ఉన్న లిండా యక్కరినోను ట్విట్టర్‌కు కొత్త సీఈఓగా మస్క్ ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. ట్విట్టర్‌కు కొత్త సీఈఓను నియమించుకున్నట్లు ప్రకటించడానికి సంతోషిస్తున్నట్లు కొన్ని గంటల క్రితం మస్క్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఆమె ఆరు వారాల్లో విధుల్లో చేరుతుందని స్పష్టం చేశారు. అలాగే ట్విట్టర్‌లో తాను పోషిస్తున్న పాత్రలను ఆమె నిర్వహిస్తారని మస్క్ ప్రకటించారు.
లిండా యక్కరినో గురించి తెలుసుకోవలసిన విషయాలు
లిండా యక్కరినో ఎన్‌బీసీ యూనివర్సల్‌లో 2011 నుంచి పని చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె గ్లోబల్ అడ్వర్టైజింగ్, పార్ట్‌నర్‌షిప్‌ల ఛైర్‌పర్సన్‌లో కొనసాగుతున్నారు. యక్కరినో గతంలో కంపెనీ కేబుల్ ఎంటర్‌టైన్‌మెంట్, డిజిటల్ అడ్వర్టైజింగ్ సేల్స్ విభాగానికి అధిపతిగా పనిచేశారు. ఎన్‌బీసీలో పని చేయడానికి ముందు ఆమె టర్నర్‌లో 19 సంవత్సరాలు విధులు నిర్వర్తించారు. అక్కడ ఆమె వివిధ హోదాల్లో పని చేశారు. టర్నర్‌లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, టర్నర్ ఎంటర్‌టైన్‌మెంట్ యాడ్ సేల్స్ సీఓఓ హోదాల్లోనూ విధులు నిర్వర్తించారు. యక్కరినో పెన్ స్టేట్ యూనివర్శిటీ పూర్వ విద్యార్థి. ఆమె లిబరల్ ఆర్ట్స్, టెలికమ్యూనికేషన్స్ విద్యను అభ్యసించారు. యక్కరినో గతంలో తన స్నేహితుల వద్ద ట్విట్టర్‌కు సీఈఓ కావాలనే కోరికను వ్యక్తం చేశారు.