super-Earth: సూర్యుడి లోపల గ్రహం ఆనవాళ్లు.. కొత్త పరిశోధనలో ఆసక్తికర విషయాలు
ఈ వార్తాకథనం ఏంటి
సౌర కుటుంబంలో ఒకప్పుడు భూమి కంటే ఐదు నుంచి పది రెట్లు ఎక్కువ ద్రవ్యరాశి ఉన్న సూపర్ ఎర్త్ (Super-Earth) అనే గ్రహం ఉండేదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆ గ్రహం కనిపించడం లేదు. అసలు ఆ గ్రహం ఏమైంది? ఎక్కడికి వెళ్లిపోయింది? అనే ప్రశ్నలకు శాస్త్రవేత్తలు ఓ ఆసక్తికరమైన అంచనాను తెరపైకి తీసుకొచ్చారు. ఆ గ్రహాన్ని మన సూర్యుడే మింగేసి ఉండొచ్చని చెబుతున్నారు. అంతేకాదు.. ఈ ఘటనకు సంబంధించిన ఆనవాళ్లు సూర్యుడి అంతర్భాగంలో ఇప్పటికీ ఉండవచ్చని పరిశోధకులు గుర్తించారు.
వివరాలు
సూర్యుడి అంతర్భాగంలో అసాధారణ మార్పులు
టర్కీలోని ఏజియన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ముట్లు యిల్డిజ్ ఈ విషయంపై ఆసక్తికరమైన వివరాలు వెల్లడించారు.
భూమి కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ద్రవ్యరాశి ఉన్న ఓ గ్రహం.. సూర్యుడు చిన్న వయసులో ఉన్నప్పుడు దాని లోపలి పొరల్లోకి పడిపోయి ఉండొచ్చని తెలిపారు.
ఈ ఘటన కారణంగా సూర్యుడి లోపల రసాయనపరమైన మార్పులు జరిగి ఉండొచ్చని, వాటి ప్రభావం ఇప్పటికీ కొనసాగుతోందని వివరించారు.
సౌర కుటుంబ పరిణామ క్రమంపై శాస్త్రవేత్తలు చేసిన లెక్కలు, ప్రస్తుతం సూర్యుడిపై అందుబాటులో ఉన్న పరిశీలనల మధ్య కొన్ని తేడాలు ఉన్నట్లు గుర్తించారు.
సాధారణ సౌర నమూనాలు అంచనా వేసిన దానికంటే సూర్యుడి అంతర్గత నిర్మాణంలో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి.
వివరాలు
సూర్యుడిలో లిథియం తగ్గడానికి కారణం అదేనా?
ముఖ్యంగా సూర్యుడిలో లిథియం (Lithium) అనే రసాయన మూలకం పరిమాణం ఊహించిన దానికంటే చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
ఈ తేడాలకు సూపర్ ఎర్త్ గ్రహం సూర్యుడిలో కలిసిపోవడమే కారణమై ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.
సూర్యుడి పరిణామ క్రమాన్ని అంచనా వేసి, దాని అంతర్భాగంపై అందుబాటులో ఉన్న కచ్చితమైన పరిశీలనలతో పోల్చినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చిందని యిల్డిజ్ తెలిపారు.
ఇందుకోసం పరిశోధకుల బృందం MESA (Modules for Experiments in Stellar Astrophysics) అనే ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించింది.
ఈ సాఫ్ట్వేర్ సాయంతో సూర్యుడు ప్రారంభ దశలో ఉన్నప్పుడు దానిలోకి ఇతర పదార్థాలు చేరితే ఎలాంటి మార్పులు వస్తాయో,నక్షత్రాలు ఎలా పరిణామం చెందుతాయో పరిశీలించారు.
వివరాలు
సూర్యుడు నిజంగానే ఆ గ్రహాన్ని మింగేశాడా?
ఈ లెక్కల ప్రకారం భూమి ద్రవ్యరాశికి ఐదు నుంచి పదిరెట్లు ఎక్కువ బరువున్న ఓ గ్రహం సౌర కుటుంబంలో ఉండి ఉండొచ్చని అంచనా వేశారు.
ఆ గ్రహం రాతి నిర్మాణంతో కూడినదై ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
అది చిన్న వయసులో ఉన్న సూర్యుడి బయటి పొరల్లోకి పడిపోయినప్పటికీ దాదాపు ఎలాంటి నష్టం లేకుండా బయటపడే అవకాశం ఉందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.
అయితే ఆ గ్రహం నిజంగానే సూర్యుడిలో కలిసిపోయిందా? అసలు అలాంటి గ్రహం సౌర కుటుంబంలో ఎప్పుడైనా ఉందా?అనే విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
దీనిపై మరిన్ని పరిశోధనలు,విశ్లేషణలు అవసరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కంప్యూటర్ సిమ్యులేషన్‌లో కనిపించిన గ్రహం నిజ జీవితంలో లేకపోయి ఉండే అవకాశం కూడా ఉందని పేర్కొంటున్నారు.
వివరాలు
సూర్యుడు నిజంగానే ఆ గ్రహాన్ని మింగేశాడా?
సూర్యుడి నమూనాలు, వాస్తవ పరిశీలనల మధ్య తేడాలకు ఇతర కారణాలు కూడా ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో హీలియోసిస్మాలజీ (Helioseismology) సహా ఇతర ఆధునిక పరిశోధనా పద్ధతులను ఉపయోగించి సూర్యుడి అంతర్భాగాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయాలని నిర్ణయించారు.
సూర్యుడిలో కనిపిస్తున్న రసాయన మార్పులు నిజంగానే ఓ గ్రహం కలిసిపోయిన ఆనవాళ్లా? అనే విషయాన్ని స్వతంత్రంగా నిర్ధారించేందుకు ప్రయత్నిస్తున్నారు.