రిలయన్స్ జియోతో జతకట్టిన మోటోరోలా.. వినియోగదారులకు 5జీ థ్రిల్!
దిగ్గజ మొబైల్ తయారీ సంస్థ మోటోరోలా.. తమ వినియోగదారులకు 'ట్రూ 5 జీ' సేవలను అందించేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు రిలయన్స్ జియోతో జతకట్టింది. ఈ విషయాన్ని బుధవారం ఇరు సంస్థలు సంయుక్తంగా ప్రకటించాయి. అధునాత ఫీచర్లతో తమ వినియోగదారులకు మంచి అనుభూతిని అందించాలని మోటోరోలా భావిస్తోంది. ఇందుకోసం కొత్తగా క్యారియర్ అగ్రిగేషన్, 4x4 మిమో, భారతదేశంలోని చాలా 5జీ బ్యాండ్‌లకు మద్దతు ఉండే.. అత్యాధునిక 5జీ ఫీచర్లతో మోటోరోలా వస్తోంది. ఈ తాజా ఫీచర్లు జియో ట్రూ 5జీ తోపాటు భారతదేశంలోని మొత్తం సామర్థ్యాన్ని చాటిచెబుతాయని రిలయన్స్ జియో ప్రెసిడెంట్ సునీల్ దత్ చెప్పారు.
జియో వెల్‌కమ్ ఆఫర్
మోటోరోలా ఫోన్లను వినియోగిస్తున్న జియో వినియోగదారులందరూ ట్రూ 5జీ సేవలను పొందవచ్చని సునీల్ దత్ వివరించారు. జియో వెల్‌కమ్ ఆఫర్ కింద అపరిమిత 5జీ ఇంటర్నెట్‌ను పొందవచ్చని చెప్పారు. వినియోగదారులు ఉన్నచోట కచ్చితంగా 5జీ సేవలు అందుబాటులో ఉండాలన్నారు. ప్రస్తుతం ట్రూ 5జీ సేవలు కొన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్ ఈ సేవలు దేశమంతా విస్తరించనున్నాయి. అన్ని ధరల్లో లభించే మోటరోలా స్మార్ట్‌ఫోన్‌లు నమ్మదగినవిగా ఉంటాయని, 5జీ సేవలను వేగంగా అందిస్తాయన్నారు మోటరోలా ఆసియా పసిఫిక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రశాంత్ మణి. భారతీయ వినియోగదారులకు అత్యంత సమగ్రమైన 5జీ స్మార్ట్‌ఫోన్లను అందించాలనే దానికి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. జియో ట్రూ 5జీతో జరిగిన ఒప్పందంతో తమ నిబద్ధతను చాటుకున్నట్లు వివరించారు.