Nasa: ఇక అంతరిక్షంలోనూ సెల్ఫీలు.. నాసా వ్యోమగాములకు స్మార్ట్‌ఫోన్ల అనుమతి
ఈ వార్తాకథనం ఏంటి
ఇకపై నాసా వ్యోమగాములు అంతరిక్ష ప్రయాణాలకు తమ స్మార్ట్‌ఫోన్లను కూడా తీసుకెళ్లవచ్చు. ఈ కొత్త నిబంధనను నాసా తొలిసారి అమలు చేయనుండగా, ఇది క్రూ-12, ఆర్టెమిస్-2 మిషన్ల నుంచి ప్రారంభం కానుంది. దీంతో అంతరిక్షంలో నుంచి తీసే సెల్ఫీలు, వీడియోలు మరింత ఆసక్తికరంగా మారనున్నాయి. క్రూ-12 మిషన్ వచ్చే వారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కు వెళ్లనుండగా, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆర్టెమిస్-2 మిషన్‌ను మార్చి నెలకు వాయిదా వేశారు. ఈ ఆర్టెమిస్-2 మిషన్ ద్వారా 1960ల తర్వాత తొలిసారి మనుషులు చంద్రుడి చుట్టూ ప్రయాణించనున్నారు.
వివరాలు
తాజా ఐఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లకు గ్రీన్ సిగ్నల్
ఈ విషయంపై నాసా అడ్మినిస్ట్రేటర్ జారెడ్ ఐజాక్‌మాన్ సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో స్పందిస్తూ, "మా వ్యోమగాములు తమ కుటుంబాల కోసం ప్రత్యేక క్షణాలను చిత్రీకరించడానికి, ప్రపంచంతో ప్రేరణనిచ్చే ఫోటోలు, వీడియోలను పంచుకోవడానికి అవసరమైన సాధనాలను అందిస్తున్నాం" అని తెలిపారు. తాజా ఐఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లు అందుబాటులో ఉండడంతో వ్యోమగాములు ఇకపై ఫోటోలు, వీడియోలు తీయడంలో మరింత స్వేచ్ఛగా వ్యవహరించగలుగుతారు. దీంతో భూమిపై ఉన్న ప్రజలకు ఈ అంతరిక్ష ప్రయాణాలు నాసా చరిత్రలోనే అత్యంత విపులంగా డాక్యుమెంట్ అయ్యే మిషన్లుగా మారే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
వివరాలు
నిబంధనల మార్పులకు ఎక్కువ సమయం
శూన్య గురుత్వాకర్షణలో వ్యోమగాములు టిక్‌టాక్ వీడియోలు చేస్తే ఎలా ఉంటుందో, లేదా స్పేస్‌క్రాఫ్ట్‌లో అల్ట్రా వైడ్ యాంగిల్ సెల్ఫీలు తీస్తే ఎలా ఉంటుందో ఊహించడమే ఆసక్తికరంగా ఉందని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ వ్యవస్థల్లో సాధారణంగా నిబంధనల మార్పులకు ఎక్కువ సమయం పడుతుంటే, ఈ నిర్ణయాన్ని నాసా వేగంగా ఆమోదించడం కూడా విశేషంగా మారింది. ఈ విషయంపై ఐజాక్‌మాన్ మరోసారి మాట్లాడుతూ, "ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న విధానాలకు సవాల్ విసిరాం. ఆధునిక హార్డ్‌వేర్‌ను వేగంగా అంతరిక్ష ప్రయాణానికి అనుమతించాం. ఈ ఆపరేషనల్ వేగం భవిష్యత్తులో కక్ష్యలో, చంద్ర ఉపరితలంపై అత్యంత విలువైన శాస్త్రీయ పరిశోధనలకు నాసాకు ఉపయోగపడుతుంది" అని అన్నారు.
వివరాలు
చిన్న లోపం జరిగినా మిషన్ మొత్తం ప్రమాదంలో పడే అవకాశం
అంతరిక్షంలో కొత్త టెక్నాలజీకి అనుమతి ఇవ్వడం అంత ఈజీ కాదని నిపుణులు చెబుతున్నారు. చిన్న లోపం జరిగినా మిషన్ మొత్తం ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు ఈ మిషన్లలో ఉపయోగించిన కెమెరాలు దశాబ్దం పాత నికాన్ డీఎస్ఎల్ఆర్‌లు, గోప్రోలేనని ఆర్స్ టెక్నికా పేర్కొంది. అవి మంచి పరికరాలే అయినా, స్మార్ట్‌ఫోన్ వాడకంలో ఉండే సహజత్వం, సులువుతనం వేరుగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. అయితే స్మార్ట్‌ఫోన్లు అంతరిక్షానికి వెళ్లడం ఇది మొదటిసారేమి కాదు. గతంలో ప్రైవేట్ ఆస్ట్రోనాట్ మిషన్లలో స్పేస్‌ఎక్స్ ఇప్పటికే స్మార్ట్‌ఫోన్లను అనుమతించింది. ఇప్పుడు నాసా కూడా అదే బాటలో అడుగులు వేస్తుండటం విశేషంగా మారింది.