NASA: భూమి దాటి మరో ప్రపంచానికి మీ పేరు.. నాసా సరికొత్త మిషన్
ఈ వార్తాకథనం ఏంటి
మీ పేరు భూమి దాటి అంతరిక్షంలోకి వెళ్లాలని ఎప్పుడైనా అనుకున్నారా? అది కూడా శని గ్రహానికి చెందిన అతిపెద్ద ఉపగ్రహమైన టైటాన్‌పైకి వెళితే ఎలా ఉంటుంది? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA) అలాంటి అరుదైన అవకాశాన్ని కల్పిస్తోంది. తన ప్రతిష్ఠాత్మక డ్రాగన్‌ఫ్లై (Dragonfly) మిషన్‌లో భాగంగా ప్రజల పేర్లను టైటాన్‌పైకి పంపించనుంది. ఇందుకోసం పేర్లు నమోదు చేసుకునే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎంపికైన పేర్లను ఒక మైక్రోచిప్‌లో భద్రపరిచి అంతరిక్ష నౌకలో తీసుకెళ్తారు.
Details
జనవరి 15, 2027 వరకు అవకాశం
ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారు నాసా అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.
ఇందుకు చివరి తేదీ 2027 జనవరి 15. పేర్లు నమోదు చేసుకున్న వారికి ప్రత్యేకమైన డిజిటల్ బోర్డింగ్ పాస్ కూడా అందుతుంది.
అంటే భూమి నుంచి టైటాన్‌కు బయలుదేరే ఈ చారిత్రక ప్రయాణంలో తమ పేరు కూడా భాగమైందనే గుర్తుగా ఈ పాస్‌ను పొందవచ్చు.
నాసా సైన్స్ మిషన్ డైరెక్టరేట్ అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ నిక్కీ ఫాక్స్ ఈ కార్యక్రమంపై ఆసక్తి వ్యక్తం చేశారు.
టైటాన్‌పై జీవం మనుగడకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయా అనే అంశాన్ని పరిశీలించడమే ఈ ప్రయాణంలోని ప్రధాన లక్ష్యాల్లో ఒకటని వివరించారు.
Details
2028లో ప్రయోగం.. 2034లో టైటాన్‌కు చేరిక
డ్రాగన్‌ఫ్లై ప్రస్తుతం అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం లారెల్‌లో ఉన్న జాన్స్ హాప్కిన్స్ అప్లైడ్ ఫిజిక్స్ ల్యాబొరేటరీలో రూపుదిద్దుకుంటోంది.
నాసా ప్రణాళిక ప్రకారం 2028లో దీన్ని అంతరిక్షంలోకి పంపించనున్నారు. ప్రయాణం విజయవంతమైతే 2034లో టైటాన్‌ను చేరుకుంటుంది.
ఈ మిషన్‌లో ప్రత్యేకత ఏమిటంటే.. సాధారణ రోవర్‌లా నేలపై కదిలే బదులు, హెలికాప్టర్ తరహాలో ఎగురుతూ వివిధ ప్రాంతాలను పరిశీలిస్తుంది.
సైన్స్ పరిశోధన కోసం రూపొందిస్తున్న తొలి రోటర్‌క్రాఫ్ట్ ఇదే కావడం విశేషం.
టైటాన్‌పై భిన్నమైన ప్రాంతాలను చేరుకొని అక్కడి వాతావరణం, నేల స్వరూపం, రసాయన పదార్థాలపై వివరాలు సేకరించనుంది.
Details
టైటాన్‌పై జీవానికి సంబంధించిన ఆనవాళ్లు దొరుకుతాయా?
శని గ్రహానికి చెందిన టైటాన్ సాధారణ ఉపగ్రహం కాదు. అక్కడ భూమిని పోలిన కొన్ని భౌగోళిక లక్షణాలు ఉన్నాయి.
దట్టమైన వాతావరణంతో పాటు ద్రవరూప మీథేన్‌తో ప్రవహించే నదులు, సరస్సులు, భారీ ఇసుక దిబ్బలు ఉన్నాయి.
సేంద్రీయ పదార్థాలు కూడా విస్తారంగా కనిపిస్తాయి. డ్రాగన్‌ఫ్లై ప్రధానంగా జీవం ఏర్పడకముందు చోటుచేసుకున్న రసాయన ప్రక్రియలను (Prebiotic Chemistry) అధ్యయనం చేయనుంది.
జీవం పుట్టడానికి అవసరమైన పదార్థాలు, పరిస్థితులు ఏమిటో అర్థం చేసుకోవడానికి ఈ పరిశోధన ఉపయోగపడుతుంది.
టైటాన్‌పై ప్రస్తుతం జీవం ఉందని దీని అర్థం కాదు. అయితే భూమిపై జీవం ఎలా ప్రారంభమైందనే ప్రశ్నకు సమాధానాలు వెతికేందుకు ఈ మిషన్ కొత్త ఆధారాలను అందించే అవకాశం ఉంది.