LOADING...
Dancing Lights: నార్తర్న్ లైట్ల గుట్టు విప్పేందుకు నాసా CT స్కాన్ తరహా రాకెట్ మిషన్
నార్తర్న్ లైట్ల గుట్టు విప్పేందుకు నాసా CT స్కాన్ తరహా రాకెట్ మిషన్

Dancing Lights: నార్తర్న్ లైట్ల గుట్టు విప్పేందుకు నాసా CT స్కాన్ తరహా రాకెట్ మిషన్

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 11, 2026
02:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

భూమి ఉత్తర ధ్రువ ప్రాంతాల్లో ఆకాశాన్ని అబ్బురపరిచేలా మెరిసే 'డ్యాన్సింగ్ లైట్స్' రహస్యాన్ని ఛేదించేందుకు నాసా కీలక అడుగు వేయబోతోంది. ఈ సహజ కాంతి విన్యాసాల వెనుక దాగి ఉన్న విద్యుత్ వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో తెలుసుకునేందుకు, 'CT స్కాన్' తరహా ఆధునిక విధానాన్ని ఉపయోగించే ప్రత్యేక రాకెట్ మిషన్‌ను అలాస్కా నుంచి ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఉత్తర ధ్రువం వద్ద కనిపించే ఈ కాంతులను 'అరోరా బొరియాలిస్'గా కూడా పిలుస్తారు. ఈ పరిశోధనలో జియోఫిజికల్ నాన్-ఈక్విలిబ్రియం అయానోస్పిరిక్ సిస్టమ్ సైన్స్ (GNEISS-"నైస్") అనే సాంకేతికతను వినియోగించనున్నారు. ఇది వైద్య రంగంలోని CT స్కాన్‌లా పనిచేస్తూ,అరోరాల నుంచి ఉద్భవించే విద్యుత్ ప్రవాహాల నిర్మాణాన్ని తిరిగి రూపొందిస్తుంది.

వివరాలు 

పోకర్ ఫ్లాట్ రీసెర్చ్ రేంజ్ నుంచి రాకెట్ ప్రయోగం 

ఈ రాకెట్ ప్రయోగాన్ని అలాస్కాలోని ఫెయిర్‌బ్యాంక్స్ సమీపంలోని పోకర్ ఫ్లాట్ రీసెర్చ్ రేంజ్ నుంచి చేపట్టనున్నారు. అరోరా ప్రాంతంలోని విద్యుత్ వాతావరణాన్ని మూడు పరిమాణాల్లో (3D వ్యూ) చిత్రీకరించేందుకు GNEISS రెండు రాకెట్లు, అలాగే భూమిపై ఏర్పాటు చేసిన రిసీవర్ల నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తుంది. "అరోరా కింద ఉన్న ప్లాస్మాను CT స్కాన్ చేయడంలాంటిదే ఇది" అని GNEISS ప్రధాన పరిశోధకురాలు, న్యూ హాంప్‌షైర్‌లోని డార్ట్‌మౌత్ కళాశాల ప్రొఫెసర్ క్రిస్టినా లించ్ వివరించారు.

వివరాలు 

అరోరాలు - వాటి విద్యుత్ వలయం ఎలా ఉంటుంది?

అరోరాలు అనేవి ఉత్తర,దక్షిణ ధ్రువాలకు సమీపంలోని ఆకాశంలో రంగురంగుల రిబ్బన్‌ల్లా కదులుతూ కనిపించే సహజ కాంతి ప్రదర్శనలు. సూర్యుని నుంచి వచ్చే గాలుల వల్ల ఏర్పడే అయస్కాంత తుపానులు భూ వాతావరణంలోని వాయువులతో ఢీకొన్నప్పుడు శక్తి విడుదలై ఈ కాంతి జన్మిస్తుంది. సరళంగా చెప్పాలంటే, అంతరిక్షం నుంచి భూమి వాతావరణంలోకి దూసుకొచ్చే ఎలక్ట్రాన్లే అరోరాలకు కారణం. ఈ ఎలక్ట్రాన్ కిరణాలను,ఒక బల్బ్ వెలిగేందుకు తీగలో ప్రయాణించే విద్యుత్తుతో పోల్చవచ్చని NASA వివరిస్తోంది. విద్యుత్తు కాంతి కనిపించే చోటే ఆగిపోదు.. అది లూప్‌లుగా తిరిగి ప్రయాణిస్తుంది. బల్బ్ సర్క్యూట్‌లో కాంతి వెలిగే దశ ఒక మధ్యంతర స్టాప్ మాత్రమే. కాబట్టి బల్బ్ వెలిగిన తర్వాత కూడా ఎలక్ట్రాన్లు అదే తీగ ద్వారా తిరిగి వెళ్తాయి.

Advertisement

వివరాలు 

మన వాతావరణంలో నిరంతరం మారుతున్న గందరగోళం

అదే విధంగా, వాతావరణంలోకి ప్రవేశించే అరోరల్ ఎలక్ట్రాన్లు కూడా పవర్ కేబుల్‌లో ప్రవహించే విద్యుత్తులా ప్రవర్తిస్తాయని NASA చెబుతోంది. అయితే ఇక్కడ తిరిగి వెళ్లే ప్రవాహం చాలా అసంఘటితంగా ఉంటుంది. అరోరా వెలిగిన తర్వాత జరిగే ఢీకొన్నలు, గాలుల మార్పులు, పీడన తేడాలు, ఎప్పటికప్పుడు మారే విద్యుదయస్కాంత క్షేత్రాల ప్రభావంతో ఎలక్ట్రాన్లు చెల్లాచెదురుగా వ్యాపిస్తాయి. అయినప్పటికీ, ఈ అల్లకల్లోలం మధ్యే అవి తిరిగి ప్రయాణించి, "మన వాతావరణంలో నిరంతరం మారుతున్న గందరగోళం" గుండా అరోరల్ సర్క్యూట్‌ను పూర్తి చేస్తాయి.

Advertisement

వివరాలు 

అరోరాల రహస్యాలను GNEISS ఎలా వెలికితీయనుంది?

అరోరాల్లోని విద్యుత్ ప్రవాహాలను అర్థం చేసుకోవడం అంటే కేవలం ఒక భౌతిక శాస్త్ర సమస్యను పరిష్కరించడం మాత్రమే కాదు. అంతరిక్షం నుంచి వచ్చే శక్తి భూమి ఎగువ వాతావరణం గుండా ఎలా వ్యాపిస్తుందో గ్రహించడమే దీని లక్ష్యమని NASA చెబుతోంది. ప్రవాహాలు విస్తరించే ప్రాంతాల్లో వాతావరణం వేడెక్కుతుంది, గాలుల దిశలు మారతాయి, దీని ప్రభావంగా ఉపగ్రహాలు ఊహించని అల్లకల్లోల పరిస్థితులను ఎదుర్కొంటాయి. దీనిని స్పష్టంగా తెలుసుకోవాలంటే, అరోరా వెలిగిన తర్వాత ఎలక్ట్రాన్లు ప్రయాణించే వంకర మార్గాలు సహా, ఆ విద్యుత్ వలయం ఎలా ముగుస్తుందో ముందుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

వివరాలు 

ఈ మిషన్‌లో ఒకేసారి రెండు రాకెట్ల ప్రయోగం 

కానీ తిరిగి వచ్చే ప్రవాహాన్ని గుర్తించడం అంత సులభం కాదు—విద్యుత్తు ప్రవహించగల అన్ని మార్గాలను స్కాన్ చేయాలి. ఇదే పనిని GNEISS లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా వాతావరణం గుండా విద్యుత్ ఎలా కిందికి వ్యాపిస్తుందో శాస్త్రవేత్తలు లోతుగా తెలుసుకోగలరు. ఈ మిషన్‌లో ఒకేసారి రెండు రాకెట్లను ప్రయోగిస్తారు. అవి ఒకే అరోరా గుండా పక్కపక్కనే, వేర్వేరు 'స్లైసెస్' వెంట ఎగురుతాయి. ప్రతి రాకెట్ అరోరా ప్రాంతంలోకి ప్రవేశించినప్పుడు నాలుగు సబ్‌పేలోడ్‌లను విడిచిపెడుతుంది. ఇవి అరోరా లోపల విభిన్న స్థానాల్లోని పరిస్థితులను కొలుస్తాయి.

వివరాలు 

అరోరల్ CT స్కాన్

రాకెట్లు పైకి దూసుకెళ్లే సమయంలో రేడియో సంకేతాలను పంపిస్తాయి. ఆ సంకేతాలు చుట్టూ ఉన్న ప్లాస్మా గుండా ప్రయాణించి భూమిపై ఉన్న రిసీవర్లకు చేరుతాయి. మన శరీరంలోని వివిధ కణజాలాలు CT స్కాన్ కిరణాలను ఎలా మార్చుతాయో, అలాగే ప్లాస్మా కూడా ఈ రేడియో తరంగాలను మార్గమధ్యంలో మార్చుతుందని NASA వివరిస్తోంది. దీనిని విస్తృత స్థాయి 'అరోరల్ CT స్కాన్'గా అభివర్ణిస్తూ, ఈ రేడియో డేటా ఆధారంగా ప్లాస్మా సాంద్రతను అంచనా వేస్తామని, తద్వారా విద్యుత్తు ఎక్కడ ప్రవహించగలదో స్పష్టమవుతుందని ఏజెన్సీ తెలిపింది.

Advertisement