Page Loader
WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌.. స్కాన్‌, షేర్‌, పీడీఎఫ్‌.. అంతా ఒకే చోటే!
వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌.. స్కాన్‌, షేర్‌, పీడీఎఫ్‌.. అంతా ఒకే చోటే!

WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌.. స్కాన్‌, షేర్‌, పీడీఎఫ్‌.. అంతా ఒకే చోటే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 29, 2025
03:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

వాట్సాప్ నుంచి డాక్యుమెంట్లను షేర్ చేయడంలో వినియోగదారులు ఇకపై థర్డ్ పార్టీ యాప్‌లపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోనుంది. ఎందుకంటే వాట్సాప్ ఓ కొత్త ఫీచర్‌ను పరిచయం చేస్తోంది. తాజాగా బీటా వర్షన్‌లో లభ్యమవుతున్న ఈ ఫీచర్‌తో, యూజర్లు యాప్‌ నుంచే నేరుగా డాక్యుమెంట్లను స్కాన్ చేసి, పీడీఎఫ్‌గా మార్చి పంపించవచ్చు. వాబెటాఇన్ఫో నివేదిక ప్రకారం, ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు అందుబాటులో ఉంది. దీని కోసం ప్రస్తుతం వాట్సాప్ బీటా 2.25.18.29 వర్షన్లో టెస్టింగ్ జరుగుతోంది. గతంలో ఐఓఎస్ వినియోగదారులకు ఇది అందుబాటులోకి వచ్చినప్పటికీ.. ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా ఈ సౌకర్యం లభించనుంది.

Details

ఆటోమేటిక్‌గా స్కాన్ చేసి ఫోటోను తీసుకుంటుంది

ఈ కొత్త ఫీచర్‌తో వాట్సాప్ వినియోగదారులు యాప్‌ లోపలే "స్కాన్ డాక్యుమెంట్" ఆప్షన్‌ను చూడగలుగుతారు. ఆ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే మీ ఫోన్ కెమెరా ఓపెన్ అవుతుంది. డాక్యుమెంట్‌ను సరైన దిశలో ఉంచేలా లైవ్ ప్రివ్యూ ద్వారా సహాయపడుతుంది. ఫీచర్‌లో 'Manual', 'Auto Capture' అనే రెండు మోడ్‌లు ఉంటాయి. మాన్యువల్ మోడ్‌లో వినియోగదారులు స్వయంగా ఫోటో తీసుకోవచ్చు. ఆటో మోడ్‌లో వాట్సాప్ డాక్యుమెంట్ అంచులను గుర్తించి, ఆటోమేటిక్‌గా స్కాన్ చేసి ఫోటోను తీసుకుంటుంది. వెంటనే దాన్ని ప్రాసెస్ చేసి పీడీఎఫ్ ఫైల్‌గా మారుస్తుంది.

Details

ఇప్పటికే ఈ ఫీచర్ ను ఉపయోగిస్తున్న వినియోగదారులు 

ఈ ఫీచర్ విడుదలయ్యే వరకు యూజర్లు కేమ్‌స్కానర్, అడోబ్ స్కాన్ వంటి యాప్‌లను ఉపయోగించాల్సి వచ్చేది. ఇకపై వాట్సాప్‌లోనే స్కానింగ్, పీడీఎఫ్ రూపంలో షేరింగ్ సౌలభ్యం అందుబాటులోకి రానుండడంతో యూజర్లకు మరింత మేలు కలిగే అవకాశముంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి తాజా బీటా వర్షన్‌ను అప్‌డేట్ చేసుకున్న యూజర్లు ఇప్పటికే ఈ ఫీచర్‌ను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇది అన్ని వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.