విశ్వంలో కొత్తగా ఏర్పడుతున్న మరో సూర్యుడు.. భూమికి ఎంత దూరంలో ఉన్నాడో తెలుసా?
ఈ విశాల విశ్వం ఎంత పెద్దదో ఎవ్వరికీ తెలియదు. ఇందులో మనకు తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ఆ రహస్యాలను తెలుసుకునే ప్రయత్నంలో మనిషి ఎన్నో వింతల్ని కనుక్కుంటున్నాడు. తాజాగా కొత్తగా ఏర్పడుతున్న సూర్యుడిని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎస్.. మీరు విన్నది నిజమే, భారీ టెలిస్కోప్ జేమ్స్ సాయంతో కొత్త నక్షత్రాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది భూమి నుండి వెయ్యి కాంతి సంవత్సరాల దూరంలో ఉందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. అయితే ఈ నక్షత్రం రూపాంతరం దశలో ఉందని అంటున్నారు. అయితే ఇది ఎప్పుడు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతుందో తెలియదని చెబుతున్నారు. దీన్ని బుల్లి సూర్యుడిగా అభివర్ణిస్తున్నారు.
సూర్యుడులో 8శాతం బరువు
ఈ నక్షత్రం ఇప్పుడిప్పుడే ఏర్పడుతున్నందున అందులో జరిగే మార్పులు గురించి అధ్యయనం చేయవచ్చని, తద్వారా సూర్యుడు గురించి తెలుసుకునే అవకాశం ఉంటుందని నాసా సైంటిస్టులు చెబుతున్నారు. ఇప్పుడు ఏర్పడుతున్న కొత్త నక్షత్రం వయస్సు కొన్ని వేల సంవత్సరాలు ఉంటుందని, కాలం మారుతున్న కొద్దీ నక్షత్రంలో చాలా మార్పులు కలుగుతాయని ఆ తర్వాత అది సూర్యుడిలా ఆవిర్భవించే అవకాశం ఉందని నాసా అంటుంది. అంతేకాదు ఈ నక్షత్రం బరువు చాలా తక్కువగా ఉంటుందని సూర్యుడు బరువులో కేవలం ఎనిమిది శాతం ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడి చేస్తున్నారు.