Nvidia RTX Spark: మౌస్, కీబోర్డ్‌కు గుడ్‌బై.. ఏఐతో నడిచే పీసీలు రానున్నాయ్!
ఈ వార్తాకథనం ఏంటి
కృత్రిమ మేధ (ఏఐ) రంగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, డేటా సెంటర్ల కోసం అత్యాధునిక చిప్‌లను తయారు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలిచిన నివిడియా ఇప్పుడు మరో కీలక ముందడుగు వేసింది. ఇప్పటివరకు భారీ డేటా సెంటర్లకే పరిమితమైన అత్యున్నత ఏఐ సామర్థ్యాలను వ్యక్తిగత కంప్యూటర్లకు కూడా అందుబాటులోకి తీసుకురావడానికి సంస్థ సిద్ధమైంది. ఈ క్రమంలో 'ఆర్‌టీఎక్స్ స్పార్క్' పేరుతో కొత్త ఏఐ సూపర్ చిప్‌ను ఎన్‌విడియా ఆవిష్కరించింది. ఈ చిప్‌ను డెస్క్‌టాప్‌లు, ల్యాప్‌టాప్‌లలో అమర్చడం ద్వారా అత్యాధునిక ఏఐ ఆధారిత పనులను నిర్వహించవచ్చని సంస్థ వెల్లడించింది. ఈ ఏడాది చివరినాటికి ఈ చిప్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
వివరాలు
కొత్త శకానికి నాంది
తైవాన్ రాజధాని తైపీలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఎన్‌విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్ ఈ కొత్త టెక్నాలజీని ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్‌విడియా,మైక్రోసాఫ్ట్ కలిసి వ్యక్తిగత కంప్యూటర్ల రంగాన్ని పూర్తిగా కొత్త దిశలో తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. సాధారణ మొబైల్ ఫోన్లు కాలక్రమేణా స్మార్ట్‌ఫోన్లుగా మారినట్లే, ల్యాప్‌టాప్‌లు,డెస్క్‌టాప్‌లు కూడా ఈ కొత్త చిప్‌తో మరింత తెలివైన వ్యవస్థలుగా మారనున్నాయని హువాంగ్ పేర్కొన్నారు. కంప్యూటర్ల చరిత్రలో ఇది ఒక కొత్త శకానికి నాంది అని ఆయన అభివర్ణించారు.
వివరాలు
అనేక క్లిష్టమైన పనులను సులభంగా నిర్వహించగలదు
కొత్త తరం కంప్యూటర్లు కేవలం వినియోగదారుడు ఇచ్చిన ఆదేశాలను అమలు చేసే యంత్రాలుగానే కాకుండా, ఒక సహాయకుడిలా, సహచరుడిలా పనిచేస్తాయని ఎన్‌విడియా తెలిపింది. ఈ చిప్‌లో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ (సీపీయూ), గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ (జీపీయూ) సామర్థ్యాలు సమన్వయంగా ఉండటంతో అధిక పనితీరు అందించగలదని పేర్కొంది. ఈ సూపర్ చిప్‌తో కూడిన కంప్యూటర్లు స్వతంత్ర ఏఐ ఏజెంట్లుగా పనిచేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వినియోగదారులు వాటితో నేరుగా మాట్లాడవచ్చు.ఏఐ ఏజెంట్ యూజర్ల అవసరాలను అర్థం చేసుకుని తగిన సహాయాన్ని అందిస్తుంది. ఫైళ్లను చదవడం, సమాచారం విశ్లేషించడం, పరిశోధనలకు సహకరించడం వంటి అనేక క్లిష్టమైన పనులను సులభంగా నిర్వహించగలదు.
వివరాలు
ఏఐ ఏజెంట్లే కంప్యూటర్లను నిర్వహించే పరిస్థితులు
అంతేకాకుండా, భవిష్యత్తులో మౌస్, కీబోర్డ్‌లపై ఆధారపడే అవసరం కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. వినియోగదారుల ఆదేశాలను అర్థం చేసుకుని ఏఐ ఏజెంట్లే కంప్యూటర్లను నిర్వహించే పరిస్థితులు ఏర్పడవచ్చని అంచనా వేస్తున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాల పర్సనల్ కంప్యూటర్ చరిత్రలో ఇదే అతిపెద్ద మార్పుగా పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
వివరాలు
పనితీరు, పోర్టబిలిటీ రెండింటినీ ఒకేసారి పొందే అవకాశం
మైక్రోసాఫ్ట్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, వ్యక్తిగత కంప్యూటర్ల కోసం రూపొందించిన ఈ ఎన్‌విడియా సూపర్ చిప్ అధిక సామర్థ్యంతో కూడిన ఏఐ వ్యవస్థలకు మద్దతు ఇవ్వడమే కాకుండా, సంక్లిష్టమైన పనులను కూడా సమర్థవంతంగా నిర్వహించగలదు. అత్యంత శక్తివంతమైన సాంకేతిక సామర్థ్యాలను కలిగి ఉన్నప్పటికీ, ఈ చిప్‌తో రూపొందించే ల్యాప్‌టాప్‌లు సన్నగా, తేలికగా ఉండేలా తయారవుతాయని కంపెనీ వెల్లడించింది. దీంతో పనితీరు, పోర్టబిలిటీ రెండింటినీ ఒకేసారి పొందే అవకాశం వినియోగదారులకు లభించనుంది.