Loading...
A23a iceberg: ఒకప్పుడు బాలీ అంతటి పరిమాణం.. ఇప్పుడు చిన్న ముక్కలుగా విడిపోయిన భారీ మంచుకొండ!
ఒకప్పుడు బాలీ అంతటి పరిమాణం.. ఇప్పుడు చిన్న ముక్కలుగా విడిపోయిన భారీ మంచుకొండ!

A23a iceberg: ఒకప్పుడు బాలీ అంతటి పరిమాణం.. ఇప్పుడు చిన్న ముక్కలుగా విడిపోయిన భారీ మంచుకొండ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 01, 2026
11:03 am

ఈ వార్తాకథనం ఏంటి

ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద మంచుకొండగా పేరొందిన A23a దాదాపు 40 ఏళ్ల పాటు అంటార్కిటికా, దక్షిణ మహాసముద్రం చుట్టూ ప్రయాణించిన తర్వాత ఇప్పుడు దాదాపు పూర్తిగా కనుమరుగైంది. దశాబ్దాల పాటు సముద్రంలో నిలిచిన ఈ భారీ మంచుకొండ చివరకు చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి కరిగిపోయింది.

వివరాలు

1986లో అంటార్కిటికా నుంచి విడిపోయింది

A23a 1986లో అంటార్కిటికాలోని ఫిల్చ్‌నర్ ఐస్ షెల్ఫ్ నుంచి విడిపోయింది. 1991లో ఇది A23 అనే మరో భారీ మంచుకొండ నుంచి విడిపోవడంతో A23aగా పేరు పొందింది.

అత్యధిక పరిమాణంలో ఉన్నప్పుడు A23a సుమారు 2,000 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉండేది. ఇది దాదాపు బాలీ ద్వీపం అంతటి పరిమాణం.

అయితే విడిపోయిన వెంటనే సముద్రంలోకి దూసుకెళ్లలేదు. వెడ్డెల్ సముద్రంలో దశాబ్దాల పాటు ఒకే ప్రాంతంలో చిక్కుకుపోయింది.

దాని అడుగుభాగంలోని కొంత భాగం సముద్రపు అడుగును తాకుతూ ఉండటమే ఇందుకు కారణం.

వివరాలు

2020లో మొదలైన ప్రయాణం

దాదాపు మూడు దశాబ్దాల తర్వాత 2020లో A23a కదలడం ప్రారంభించింది. 'A-23A కదులుతోంది!' అంటూ శాస్త్రవేత్తలు ప్రకటించారు.

సముద్ర ప్రవాహాల ప్రభావంతో అది క్రమంగా ముందుకు సాగి, 2023 నవంబర్‌లో దక్షిణ మహాసముద్రంలోని బహిరంగ జలాల్లోకి చేరుకుంది.

అప్పట్లో కదులుతున్న మంచుకొండల్లో ఇదే అతిపెద్దదిగా వార్తల్లో నిలిచింది. A23a ప్రయాణాన్ని శాస్త్రవేత్తలు నిశితంగా పరిశీలించారు.

ఆస్ట్రేలియా బ్యూరో ఆఫ్ మెటీరియాలజీకి చెందిన ఐస్ స్పెషలిస్ట్ జాన్ లీసర్ కూడా దీన్ని పర్యవేక్షించిన పరిశోధకుల్లో ఒకరు.

ADVERTISEMENT

వివరాలు

సముద్ర ప్రవాహంలో చిక్కుకుని.. ఎనిమిది నెలలు తిరుగుతూ

బహిరంగ సముద్రంలోకి వచ్చిన తర్వాత A23a అనూహ్య మలుపు తీసుకుంది.

ఉత్తరం వైపు ప్రయాణించాల్సిన ఈ మంచుకొండ.. 2024 మార్చిలో టేలర్ కాలమ్ అనే శక్తివంతమైన సముద్ర ప్రవాహంలో చిక్కుకుంది.

సముద్రం అడుగున ఉన్న ఓ పర్వతం కారణంగా పైభాగంలోని నీటి ప్రవాహానికి అంతరాయం ఏర్పడినప్పుడు టేలర్ కాలమ్ ఏర్పడుతుంది.

ఈ ప్రవాహంలో చిక్కుకున్న A23a దాదాపు ఎనిమిది నెలల పాటు అదే ప్రాంతంలో పదేపదే తిరుగుతూ ఉంది.

చివరకు 2024 నవంబర్‌లో ఆ ప్రవాహం నుంచి బయటపడింది. ఆ తర్వాత వెచ్చని జలాల్లోకి ప్రవేశించడంతో మంచుకొండ వేగంగా కరిగిపోవడం ప్రారంభమైంది.

2025 మార్చిలో దక్షిణ జార్జియా ద్వీపానికి సుమారు 70 మైళ్ల దూరంలో మరోసారి చిక్కుకుంది.

ADVERTISEMENT

వివరాలు

'అంతులేని గోడలా కనిపించింది'

తర్వాత A23a మళ్లీ అక్కడి నుంచి కదిలింది. డాక్యుమెంటరీ చిత్రీకరణలో భాగంగా మంచుకొండను దగ్గరగా పరిశీలించిన డాక్యుమెంటరీ మేకర్ జెరోమ్ బూవియర్ దాని భారీ పరిమాణాన్ని చూసి ఆశ్చర్యపోయారు.

ఆ మంచుకొండ 'చాలా శక్తివంతంగా, అంతులేని గోడలా, భారీ గుహలతో కనిపించింది. దాని కొండచరియల నుంచి మంచు ముక్కలు నిరంతరం కిందపడుతుండేవని ఆయన వివరించారు.

చిత్రీకరణ సమయంలో మంచుకొండ సమీపంలో నీటి అడుగున ఓ రాతి అంచు కనిపించింది. దాని సహాయంతో డైవర్లు సురక్షితంగా మంచుకొండను చిత్రీకరించారు.

అయితే కొంతకాలం తర్వాత తిరిగి వెళ్లినప్పుడు ఆ అంచు కూడా కనిపించకుండా పోయింది.

వివరాలు

A23a చుట్టూ భారీగా సముద్ర జీవులు

A23a సమీపంలో భారీ సంఖ్యలో సముద్ర జీవులు కనిపించడం పరిశోధకులను మరోసారి ఆశ్చర్యపరిచింది.

అక్కడ తిమింగలాలు, పెంగ్విన్లు, వివిధ రకాల పక్షులు, చిరుత ముద్రలు (Leopard seals), స్నో పెట్రెల్స్ వంటి జీవులను గుర్తించారు.

'అంటార్కిటికాలోని ఓ భాగమే అక్కడికి వచ్చి, దానితో పాటు అక్కడి జీవులన్నింటినీ తీసుకొచ్చినట్టుగా అనిపించింది.

మొత్తం జీవులతో ప్రయాణిస్తున్న ఓ నౌకలా కనిపించింది. అది కదులుతున్న ఓ ద్వీపంలా ఉందని బూవియర్ తెలిపారు.

వివరాలు

2025లో అతిపెద్ద మంచుకొండ హోదా కోల్పోయింది

2025 జూన్ నాటికి A23a విస్తీర్ణం 1,200 చదరపు మైళ్లకు దిగువకు పడిపోయింది. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద మంచుకొండగా ఉన్న హోదాను కోల్పోయింది.

అయితే దీని ప్రయాణంపై పరిశోధకుల ఆసక్తి కొనసాగింది. 2026 జనవరిలో తీసిన ఉపగ్రహ చిత్రాల్లో A23a చుట్టూ క్లోరోఫిల్‌ అధికంగా ఉన్న ప్రాంతాలు కనిపించాయి.

వివరాలు

సోవియట్ పరిశోధనా కేంద్రం ఆనవాళ్లు కూడా..

2025 ప్రారంభంలో A23a సమీపంలో పర్యటించిన పర్యాటకులు పాత బ్యారెల్స్‌, స్టోరేజ్‌ ట్యాంకులను గుర్తించారు.

అవి ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై పరిశీలన జరపగా.. డ్రుజ్నయా-1 అనే సోవియట్ పరిశోధనా కేంద్రానికి చెందిన అవశేషాలని తేలింది.

1986లో అంటార్కిటికా నుంచి A23a విడిపోయిన సమయంలో ఆ సోవియట్ పరిశోధనా కేంద్రం అనుకోకుండా మంచుకొండపైకి చేరి, దానితో పాటు సముద్రంలోకి కొట్టుకుపోయింది.

వివరాలు

2026లో అధికారిక ట్రాకింగ్‌ కూడా నిలిపివేత

A23a పరిమాణం క్రమంగా తగ్గిపోవడంతో అమెరికా నేషనల్ ఐస్ సెంటర్ 2026 మార్చిలో దాన్ని అధికారికంగా ట్రాక్ చేయడం నిలిపివేసింది.

ఆ సంస్థ నిర్ణయించిన మంచుకొండ పరిమాణ ప్రమాణాలకు అది ఇక సరిపోకపోవడమే కారణం. 2026 మార్చి, ఏప్రిల్‌లో తీసిన ఉపగ్రహ చిత్రాల్లో A23a అనేక చిన్న ముక్కలుగా విడిపోయి దక్షిణ మహాసముద్రంలో విస్తరించినట్లు కనిపించింది.

ఆ తర్వాత శాస్త్రవేత్తలు మరికొన్ని చిన్న మంచు ముక్కలను గుర్తించారు. అవి గతంలో A23aలో భాగాలై ఉండొచ్చని భావించారు.

మే నాటికి కూడా ఉపగ్రహాల ద్వారా A23aకు చెందిన చిన్నచిన్న అవశేషాలను గుర్తించగలిగారు.

అయితే దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సముద్రంలో ప్రయాణించిన ఈ భారీ మంచుకొండ ఇప్పుడు చాలావరకు కరిగిపోయినట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ADVERTISEMENT