ChatGPT Go: ఓపెన్‌ఏఐ సర్‌ప్రైజ్ ఆఫర్: భారత్ యూజర్లకు ఏడాది పాటు ఉచితంగా 'చాట్‌జీపీటీ గో
ఈ వార్తాకథనం ఏంటి
కృత్రిమ మేధా రంగంలో అగ్రగామి సంస్థ ఓపెన్‌ఏఐ (OpenAI) భారత్‌లో తన కొత్త సేవ 'చాట్‌జీపీటీ గో (ChatGPT Go)'ను ఇటీవల ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సేవకు సంబంధించి దేశీయ వినియోగదారుల కోసం సంస్థ తాజాగా ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. వచ్చే నెల నుండి మొత్తం ఒక సంవత్సరం పాటు 'చాట్‌జీపీటీ గో'ను ఉచితంగా అందుబాటులో ఉంచుతున్నట్లు ఓపెన్‌ఏఐ ప్రకటించింది. "నవంబర్ 4 నుండి పరిమిత కాల ప్రమోషనల్ ఆఫర్ ప్రారంభమవుతుంది. భారత్‌లోని ప్రతి వినియోగదారుడూ ఏడాది పాటు 'చాట్‌జీపీటీ గో'ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. కొత్త యూజర్లతో పాటు ఇప్పటికే సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారికి కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది" అని ఓపెన్ఏఐ (OpenAI) కంపెనీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.
వివరాలు
ఒక సంవత్సరానికి ఉచిత వినియోగ ఆఫర్
గత ఆగస్టులో భారత్‌లో 'చాట్‌జీపీటీ గో' సేవలు ప్రారంభమయ్యాయి.ఉచిత ప్లాన్‌తో పోలిస్తే,ఈ సేవలో మరింత విస్తృతమైన సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. సందేశాల పరిమితి,చిత్రాల సృష్టి (ఇమేజ్ జనరేషన్),ఫైల్ లేదా ఫోటో అప్‌లోడ్ సదుపాయాలు సాధారణ ప్లాన్ కంటే 10 రెట్లు ఎక్కువగా లభిస్తాయి. అదనంగా, మెమరీ సామర్థ్యం కూడా రెండు రెట్లు అధికంగా ఉంటుంది.సేవ ప్రారంభించిన సమయంలో సంస్థ 'చాట్‌జీపీటీ గో' నెలవారీ చార్జీని రూ.399గా నిర్ణయించింది. అయితే ఇప్పుడు మరింత మంది భారతీయ వినియోగదారులను ఆకర్షించడానికి ఒక సంవత్సరానికి ఉచిత వినియోగ ఆఫర్ ను ప్రకటించింది. ప్రస్తుతం రూ.1,999తో చాట్‌జీపీటీ ప్లస్ ప్లాన్ కొనసాగుతుండగా, నిపుణులు,సంస్థల కోసం 'ప్రో ప్లాన్'ను రూ.19,900 చెల్లించి పొందేలా అడ్వాన్స్‌డ్ ఫీచర్లను ఓపెన్‌ఏఐ అందిస్తోంది.