OpenAI: భద్రతా ఆందోళనల నేపథ్యంలో అధునాతన AI శిక్షణకు తాత్కాలిక బ్రేక్
ఈ వార్తాకథనం ఏంటి
భద్రతాపరమైన ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో OpenAI తన కొన్ని అత్యాధునిక రీఇన్‌ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ (RL) శిక్షణ కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపివేసింది. మోడళ్ల అభివృద్ధి వేగం పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుతం సంస్థ వద్ద ఉన్న భద్రత, అలైన్‌మెంట్, సెక్యూరిటీ, మానిటరింగ్ ప్రమాణాల కంటే AI సామర్థ్యాలు వేగంగా ముందుకు వెళ్తున్నాయని OpenAI సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ తెలిపారు. మోడళ్ల సామర్థ్యాలు మరింత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో.. తమ భద్రతా చర్యలు కూడా అదే స్థాయిలో ముందుకు సాగేలా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆల్ట్‌మన్ వెల్లడించారు.
వివరాలు
ఎందుకు శిక్షణను నిలిపివేశారంటే..
"ముందున్న కొత్త స్థాయి AI సామర్థ్యాలకు తగిన అలైన్‌మెంట్, సెక్యూరిటీ, మానిటరింగ్ ప్రమాణాలను అందుకోగలమని నిర్ధారించుకునేందుకు కొన్ని అత్యాధునిక RL శిక్షణలను తాత్కాలికంగా నిలిపివేశాం" అని ఆల్ట్‌మన్ తెలిపారు.
AI మోడళ్ల సామర్థ్యాలు భద్రత, అలైన్‌మెంట్ ప్రమాణాలను మించి వెళ్లే పరిస్థితి వస్తే చర్యలు తీసుకుంటామని గతంలోనే హామీ ఇచ్చామని ఆయన గుర్తుచేశారు.
ఇటీవల చోటుచేసుకున్న రెండు ఘటనలు.. మరింత శక్తివంతమైన AI వ్యవస్థలతో ఎదురయ్యే ప్రమాదాలను స్పష్టంగా చూపించాయని OpenAI తెలిపింది.
ఈ నేపథ్యంలోనే ప్రస్తుత నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
వివరాలు
రీసెర్చ్ వాతావరణాల భద్రతపై దృష్టి..
అత్యాధునిక AI మోడళ్ల సైబర్ సెక్యూరిటీ సామర్థ్యాలు పెరుగుతున్న కొద్దీ.. తమ పరిశోధనా వాతావరణాలకు కూడా మరింత కఠినమైన భద్రతా ప్రమాణాలు అవసరమవుతున్నాయని OpenAI వెల్లడించింది.
ఈ చర్యల్లో భాగంగా సంస్థ AI సామర్థ్యాల విస్తరణ వేగాన్ని తాత్కాలికంగా తగ్గించింది.
అదే సమయంలో తన పరిశోధనా వాతావరణాలను మరింత సురక్షితంగా మార్చడంతోపాటు వాటిపై పరీక్షలు నిర్వహిస్తోంది.
అలాగే మానిటరింగ్ వ్యవస్థల పరిధిని కూడా విస్తరిస్తోంది.
వివరాలు
AI భద్రతా ప్రమాణాలపై పరిశ్రమ మొత్తం కలిసి పనిచేయాలి..
AI భద్రత తమకు అత్యంత ప్రాధాన్యమైన అంశమని సామ్ ఆల్ట్‌మన్ స్పష్టం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా AI రంగంలోని సంస్థలు కలిసి ఉమ్మడి భద్రతా ప్రమాణాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
"మొత్తం AI రంగం ఉమ్మడి భద్రతా ప్రమాణాల కోసం సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది.
అయితే అప్పటివరకు మేము మా స్థాయిలో స్వతంత్రంగా చర్యలు తీసుకుంటాం" అని ఆల్ట్‌మన్ పేర్కొన్నారు.
కొన్ని అత్యాధునిక AI శిక్షణలను తాత్కాలికంగా నిలిపివేసినప్పటికీ.. అధునాతన AI సామర్థ్యాలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలన్న తమ లక్ష్యంలో ఎలాంటి మార్పు లేదని ఆల్ట్‌మన్ స్పష్టం చేశారు.