Chrome extensions: టెలిగ్రామ్, గూగుల్ అకౌంట్లు టార్గెట్.. 100కి పైగా క్రోమ్ ఎక్స్‌టెన్షన్ల ద్వారా డేటా లీక్
ఈ వార్తాకథనం ఏంటి
గూగుల్ క్రోమ్ వినియోగదారులకు భారీ షాక్. 100కి పైగా క్రోమ్ ఎక్స్‌టెన్షన్లు యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నట్టు సైబర్ సెక్యూరిటీ నిపుణులు వెల్లడించారు. మొత్తం 108 ఎక్స్‌టెన్షన్లు ఒకేసారి పని చేస్తూ, గూగుల్ అకౌంట్ వివరాలు, బ్రౌజింగ్ డేటా, అలాగే టెలిగ్రామ్ సెషన్లను హైజాక్ చేస్తున్నాయని తెలిపారు. ఈ యాప్‌లు బయటకు చూస్తే టెలిగ్రామ్ టూల్స్, ట్రాన్స్‌లేటర్లు, గేమ్స్‌లా కనిపించినా, లోపల మాలిషియస్ కోడ్ పనిచేస్తుందని చెప్పారు. ఇవన్నీ ఒకే సర్వర్‌కి డేటా పంపుతున్నట్లు గుర్తించారు. ఈ ఎక్స్‌టెన్షన్లలో కొన్ని లాగిన్ అయ్యిన వెంటనే యూజర్ వివరాలు దోచుకుంటుండగా, మరికొన్ని బ్రౌజర్ ఓపెన్ చేసిన వెంటనే హ్యాకర్ల సైట్లను నిశ్శబ్దంగా తెరుస్తున్నాయి.
వివరాలు
ఈ ఎక్స్‌టెన్షన్ ప్రతి 15 సెకన్లకోసారి టెలిగ్రామ్ డేటాను బయటకు పంపుతోంది
ముఖ్యంగా 'Telegram Multi-account' అనే ఎక్స్‌టెన్షన్ చాలా ప్రమాదకరమని, ఇది ప్రతి 15 సెకన్లకోసారి టెలిగ్రామ్ డేటాను బయటకు పంపుతోందని హెచ్చరించారు. దీంతో పాస్‌వర్డ్ లేకుండానే అకౌంట్‌పై పూర్తిగా నియంత్రణ సాధించే అవకాశం ఉందని తెలిపారు. యూజర్లు వెంటనే అనుమానాస్పద ఎక్స్‌టెన్షన్లు తొలగించుకోవాలని, టెలిగ్రామ్‌లో అన్ని సెషన్లను లాగ్ అవుట్ చేయాలని, గూగుల్ అకౌంట్‌లో తెలియని యాక్సెస్‌లను రద్దు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.