AI summit : ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ఎఫెక్ట్.. రాజధానిలో ఆకాశానంటుతున్న హోటల్ ధరలు
ఈ వార్తాకథనం ఏంటి
గ్లోబల్ ఏఐ రంగం దృష్టి దిల్లీపై కేంద్రీకృతం కావడంతో, రాజధానిలో హోటల్ గదుల డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. సుందర్ పిచాయ్, సామ్ ఆల్ట్‌మన్ వంటి ప్రముఖ టెక్ నేతలు పాల్గొనే ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ మరో వారం రోజుల్లో జరగనున్న నేపథ్యంలో,లగ్జరీ హోటళ్లలో రూమ్ రెంట్లు ఆకాశానంటుతున్నాయి. కొన్ని టాప్ హోటళ్లలో ఒక్క రాత్రికి రూ.30 లక్షలకుపైగా చార్జ్ చేస్తున్నారు. తాజ్ ప్యాలెస్ న్యూఢిల్లీ లోని గార్డెన్ లగ్జరీ సూట్ సమ్మిట్ రోజుల్లో పన్నులతో కలిపి దాదాపు రూ.32 లక్షలు ఉండగా, అదే గది ఫిబ్రవరి 13-14 తేదీల్లో రూ.2 లక్షలకే లభిస్తోంది. సమ్మిట్ రోజుల్లో రెంట్లు సుమారు 1,500 శాతం పెరిగాయని హోటల్ వర్గాలు చెబుతున్నాయి.
వివరాలు
ఇప్పటికే సోల్డ్ అవుట్ అయిన లగ్జరీ కేటగిరీ గదులు
ఫిబ్రవరి 16-17 తేదీలకు చాలా లగ్జరీ కేటగిరీ గదులు ఇప్పటికే సోల్డ్ అవుట్ అయ్యాయి. లీలా ప్యాలెస్‌లో మహారాజా సూట్‌కు రూ.6-7 లక్షల వరకు ధర ఉండగా,ఒబెరాయ్, అండాజ్ వంటి హోటళ్లలోనూ లక్షల రూపాయల రేట్లు ఉన్నాయి. లలిత్, జయపీ వసంత్ కాంటినెంటల్, ఈరోస్ హోటల్ లాంటి వాటిలో దాదాపు పూర్తి స్థాయి ఆక్యుపెన్సీ నమోదవుతోంది. దేశ విదేశాల నుంచి వేలాది ప్రతినిధులు, విధాన నిర్ణేతలు, కార్పొరేట్ నేతలు ఢిల్లీకి రావడంతో, జనవరి,ఫిబ్రవరి మొదటి భాగంతో పోలిస్తే సమ్మిట్ రోజుల్లో రూమ్ రెంట్లు 2-3 రెట్లు పెరిగాయని హోటల్ పరిశ్రమ ప్రతినిధులు తెలిపారు.
వివరాలు
ఢిల్లీలో హోటల్ సెర్చ్‌లు ఆరు రెట్లు పెరిగాయి
ixigo వంటి ట్రావెల్ ప్లాట్‌ఫార్మ్‌లు కూడా ఢిల్లీలో హోటల్ సెర్చ్‌లు ఆరు రెట్లు పెరిగాయని వెల్లడించాయి. 100కి పైగా దేశాల నుంచి సుమారు 35 వేల మంది ప్రతినిధులు పాల్గొనే ఈ సమ్మిట్ వల్ల హోటళ్లకే కాకుండా, మీటింగ్స్, డైనింగ్, ట్రాన్స్‌పోర్ట్, బిజినెస్ సపోర్ట్ సేవలకు కూడా భారీ డిమాండ్ ఏర్పడిందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. దీర్ఘకాలంలో ఢిల్లీని గ్లోబల్ టెక్నాలజీ, ఎంఐసీఈ హబ్‌గా మరింత బలపరిచే అవకాశముందని వారు అభిప్రాయపడుతున్నారు.