Microsoft Spam Messages: మైక్రోసాఫ్ట్ ఈమెయిల్ అడ్రస్‌తో స్పామ్ మెసేజ్‌లు.. కొత్త మోసానికి తెరలేపిన సైబర్ కేటుగాళ్లు
ఈ వార్తాకథనం ఏంటి
సైబర్ మోసగాళ్లు ఇప్పుడు కొత్త పద్ధతులతో ప్రజలను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా మైక్రోసాఫ్ట్ ఈమెయిల్ వ్యవస్థలో ఉన్న లోపాన్ని ఉపయోగించుకుని, కంపెనీ అధికారిక ఈమెయిల్ అడ్రస్ నుంచే స్పామ్ మెసేజ్‌లు పంపుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ఖాతాలకు సంబంధించిన అలర్ట్‌లు పంపేందుకు ఉపయోగించే మైక్రోసాఫ్ట్ ఈమెయిల్‌ను దుర్వినియోగం చేస్తున్నట్లు సమాచారం. కొత్త కస్టమర్లలా మైక్రోసాఫ్ట్ అకౌంట్లు క్రియేట్ చేసి, ఆ యాక్సెస్‌తో కంపెనీ పేరుతో నకిలీ ఈమెయిళ్లు పంపుతున్నారని తెలుస్తోంది.
వివరాలు
సమస్యను గుర్తించిన Spamhaus Project
స్పామ్ మెసేజ్‌లను అడ్డుకునే సంస్థ 'ది స్పామ్‌హాస్ ప్రాజెక్ట్' కూడా ఈ వ్యవహారాన్ని గుర్తించింది. మైక్రోసాఫ్ట్ అకౌంట్ నోటిఫికేషన్ ఈమెయిల్‌ను దుర్వినియోగం చేస్తూ స్పామ్‌లు పంపుతున్న ఘటనలు గత కొన్ని నెలలుగా కొనసాగుతున్నాయని తెలిపింది. ఆటోమేటెడ్ నోటిఫికేషన్ సిస్టమ్‌లలో అధిక కస్టమైజేషన్ అవకాశం ఉండటమే ఇలాంటి మోసాలకు కారణమవుతోందని విమర్శించింది. ఈ విషయాన్ని ఇప్పటికే మైక్రోసాఫ్ట్ దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించింది. ఈ వ్యవహారంపై టెక్‌క్రంచ్‌తో మాట్లాడిన మైక్రోసాఫ్ట్ ప్రతినిధి స్పందించినప్పటికీ, సమస్యను అడ్డుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నామనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. ఇటీవలి కాలంలో కంపెనీల అధికారిక వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ వినియోగదారులను మోసం చేసే ఘటనలు పెరుగుతున్నాయి.
వివరాలు
ఇతర కంపెనీల ఈమెయిల్ చిరునామాలతోనూ ఇలాంటి కేసులు
మైక్రోసాఫ్ట్‌కే పరిమితం కాకుండా, ఇతర కంపెనీల ఈమెయిల్ అడ్రస్‌లను కూడా ఇలాంటి స్పామ్ మెసేజ్‌ల కోసం వాడుతున్నట్లు యూజర్లు చెబుతున్నారు. దీంతో ఇది ఒక్క కంపెనీ సమస్య కాకుండా, టెక్ ప్రపంచాన్ని కలవరపెడుతున్న పెద్ద సైబర్ ముప్పుగా మారుతోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.