Golden Orb: సముద్ర గర్భంలోని 'గోల్డెన్ ఆర్బ్' మిస్టరీ వీడింది.. ఏలియన్ కాదు!
ఈ వార్తాకథనం ఏంటి
అలాస్కా గల్ఫ్‌లో సముద్రం లోతుల్లో కనిపించిన మెరిసే 'గోల్డెన్ ఆర్బ్' రహస్యానికి శాస్త్రవేత్తలు చివరికి చెక్ పెట్టారు. ఇది ఏలియన్ టెక్నాలజీ కాదు, కొత్త జాతి కూడా కాదని స్పష్టం చేశారు. 2023 ఆగస్టు 30న NOAA Ocean Exploration కు చెందిన Deep Discoverer రోబోటిక్ వాహనం సుమారు 10,827 అడుగుల లోతులో సర్వే చేస్తుండగా ఈ బంగారు రంగు గుండ్రని వస్తువు కనిపించింది. రాయికి బిగుసుకుని ఉండటం,స్మూత్‌గా డోమ్ ఆకారంలో ఉండటం, కింద భాగంలో చిన్న రంధ్రం ఉండటం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసింది. నమూనాను సేకరించి అధ్యయనం కోసం Smithsonian మ్యూజియంకు పంపారు. మొదట ఇది చేప గుడ్డు కవచం,స్పాంజ్ అవశేషం,కోరల్ భాగం,లేక ఏలియన్ పదార్థమా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
వివరాలు
అడ్వాన్స్‌డ్ జీనోమ్ సీక్వెన్సింగ్
కానీ పరీక్షల్లో ఇది జీవ సంబంధమైనదే అని తేలింది. సాధారణ డీఎన్ఏ పరీక్షలు క్లియర్ కాకపోవడంతో శాస్త్రవేత్తలు అడ్వాన్స్‌డ్ జీనోమ్ సీక్వెన్సింగ్ చేశారు. చివరికి ఇది అరుదుగా కనిపించే భారీ డీప్-సీ అనిమోన్ "Relicanthus daphneae"కి చెందిన కణజాల అవశేషమని నిర్ధారించారు. ఈ అనిమోన్‌కు 6.6 అడుగుల వరకు పెరిగే టెంటకిల్స్ ఉంటాయి. పూర్తిగా చీకటిలో జీవించే ఈ జీవి కదిలే సమయంలో లేదా పెరుగుదల సమయంలో విడిచిపెట్టిన చర్మం లేదా టిష్యూ భాగమే ఈ 'గోల్డెన్ ఆర్బ్' అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లోతైన సముద్ర పరిశోధనల్లో ఇలాంటి రహస్యాలు తరచూ బయటపడతాయని, ఆధునిక సాంకేతికతతో వాటిని పరిష్కరించడం సాధ్యమవుతోందని NOAA అధికారులు తెలిపారు.