Loading...
DNA: మనిషి డీఎన్‌ఏలో రహస్య పూర్వీకులు.. శాస్త్రవేత్తల సంచలన ఆవిష్కరణ!
మనిషి డీఎన్‌ఏలో రహస్య పూర్వీకులు.. శాస్త్రవేత్తల సంచలన ఆవిష్కరణ!

DNA: మనిషి డీఎన్‌ఏలో రహస్య పూర్వీకులు.. శాస్త్రవేత్తల సంచలన ఆవిష్కరణ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 03, 2026
05:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

మానవ పరిణామ క్రమంపై ఇప్పటివరకు మనం తెలుసుకున్న చరిత్ర పూర్తిగా మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. శాస్త్రవేత్తలు తాజాగా వెల్లడించిన సంచలన పరిశోధన మానవ జన్యుశాస్త్రంలో కొత్త అధ్యాయానికి తెరతీసింది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు ఆధునిక మానవుల (హోమో సేపియన్స్) డీఎన్‌ఏను విశ్లేషించగా, ఇప్పటివరకు ఎవరికీ తెలియని ఇద్దరు రహస్య పూర్వీకుల ఆనవాళ్లు బయటపడ్డాయి. ఆశ్చర్యకరంగా, ఈ పూర్వీకులకు సంబంధించిన శిలాజాలు ఇప్పటివరకు ఎక్కడా లభించకపోయినా, వారి జన్యు ముద్రలు నేటి మానవుల డీఎన్‌ఏలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీరిని శాస్త్రవేత్తలు 'ఘోస్ట్ అన్సెస్టర్స్'(Ghost Ancestors)గా అభివర్ణిస్తున్నారు. ఈ అధ్యయనం ప్రకారం, మానవ పరిణామం ఒకే వంశరేఖలో సాగలేదని, అనేక ప్రాచీన మానవ జాతుల కలయికతో ఏర్పడిన సంక్లిష్ట ప్రక్రియ అని స్పష్టమైంది.

వివరాలు

అంతరించిపోయిన మానవ జాతులతో జన్యు సంబంధాలు

హోమో సేపియన్స్ మాత్రమే భూమిపై జీవించిన ఏకైక మానవ జాతి కాదని గత పరిశోధనలు ఇప్పటికే నిరూపించాయి.

ఒకప్పుడు నియాండర్తల్స్, డెనిసోవన్లు వంటి ఇతర హోమినిన్ జాతులు కూడా మన పూర్వీకులతో కలిసి జీవించాయి.

వారి మధ్య జరిగిన పరస్పర సంబంధాల ఫలితంగానే జన్యు మార్పిడి చోటుచేసుకుంది.

నేటి ఆధునిక మానవుల డీఎన్‌ఏలో కూడా ఈ ప్రాచీన జాతుల ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

అత్యాధునిక డీఎన్‌ఏ సీక్వెన్సింగ్ సాంకేతికత వల్ల లక్షల సంవత్సరాల క్రితం నాటి పరిణామ చరిత్రను కూడా శాస్త్రవేత్తలు అధ్యయనం చేయగలుగుతున్నారు.

వివరాలు

ఆఫ్రికాలో గుర్తించిన తొలి రహస్య పూర్వీకుడు

తాజా పరిశోధన ప్రకారం, ఆఫ్రికాలో ఒకప్పుడు ఆధునిక మానవుల పూర్వీకులతో సంబంధాలు ఏర్పరచుకున్న మరో తెలియని మానవ సమూహం జీవించింది.

యూరప్, ఆసియాలకు మానవులు వలస వెళ్లే దాదాపు 50 వేల సంవత్సరాల కంటే ముందే ఈ జన్యు కలయిక జరిగినట్లు పరిశోధకులు గుర్తించారు.

ఆ సమూహం నుంచి వచ్చిన జన్యువులు నేటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆధునిక మానవుల డీఎన్‌ఏలో సుమారు ఒక శాతం మేర ఉన్నాయని తేలింది.

గణిత ఆధారిత జన్యు విశ్లేషణ ప్రకారం, ఈ రహస్య మానవ జాతి దాదాపు 8 లక్షల సంవత్సరాల క్రితమే ఇతర హోమినిన్ జాతుల నుంచి విడిపోయినట్లు అంచనా. ఇదే కాలంలో నియాండర్తల్స్, డెనిసోవన్లు కూడా వేర్వేరు జాతులుగా రూపుదిద్దుకున్నాయి.

ADVERTISEMENT

వివరాలు

18 లక్షల ఏళ్ల నాటి 'సూపర్ ఆర్కిటిక్' పూర్వీకుడు

ఈ అధ్యయనంలో వెలుగులోకి వచ్చిన రెండో అజ్ఞాత పూర్వీకుడికి శాస్త్రవేత్తలు 'సూపర్ ఆర్కిటిక్ అన్సెస్టర్' అనే పేరు పెట్టారు.

ఈ మానవ జాతి దాదాపు 18 లక్షల సంవత్సరాల క్రితమే ఇతర హోమినిన్ జాతుల నుంచి విడిపోయినట్లు భావిస్తున్నారు.

అనంతరం సుమారు రెండు లక్షల సంవత్సరాల క్రితం యురేషియా ప్రాంతంలో డెనిసోవన్లతో జన్యు సంబంధాలు ఏర్పరచుకుంది.

ఆ సంబంధాల ద్వారానే ఆ ప్రాచీన డీఎన్‌ఏ భాగాలు నేటి ఆధునిక మానవుల జీనోమ్‌లో శాశ్వతంగా చేరాయని పరిశోధకులు చెబుతున్నారు.

ఈ పరిణామం మానవ వికాసం చెట్టు కొమ్మల్లా కాకుండా పరస్పర అనుసంధానమైన సంక్లిష్ట వలలా సాగిందనే సిద్ధాంతానికి బలం చేకూరుస్తోంది.

ADVERTISEMENT

వివరాలు

నియాండర్తల్, డెనిసోవన్ డీఎన్‌ఏ ప్రభావం ఇప్పటికీ కొనసాగుతోంది

ఆఫ్రికా వెలుపల నివసించే ప్రతి మనిషి జీనోమ్‌లో సుమారు 1 నుంచి 2 శాతం వరకు నియాండర్తల్ డీఎన్‌ఏ ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ముఖ్యంగా యూరప్, ఆసియా ప్రజల్లో ఈ జన్యు ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ జన్యువులు మన రోగనిరోధక శక్తి, చర్మం రంగు, జుట్టు లక్షణాలపై ప్రభావం చూపుతున్నాయి.

కొన్ని జన్యు మార్పులు వ్యాధుల బారిన పడే అవకాశాలను ప్రభావితం చేస్తుండగా, మరికొన్ని చలి వాతావరణాన్ని తట్టుకునే సామర్థ్యాన్ని అందిస్తున్నాయి.

ఆసియా, ఓషియానియా ప్రాంత ప్రజల్లో నియాండర్తల్స్‌తో పాటు డెనిసోవన్ల జన్యు ప్రభావం కూడా గణనీయంగా ఉన్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

వివరాలు

ప్రాచీన జాతుల మధ్య సంక్లిష్ట సంబంధాలకు ఆధారాలు

మంగోలియాలోని సాల్ఖిత్ లోయలో లభించిన 34 వేల సంవత్సరాల నాటి మహిళ తలపుర్రె శిలాజం కూడా ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ఆమె జీనోమ్‌లో 25 శాతం డీఎన్‌ఏ పశ్చిమ యురేషియన్ పూర్వీకులదిగా తేలింది. అంతేకాకుండా నియాండర్తల్స్, డెనిసోవన్లు పరస్పరం కూడా జన్యు సంబంధాలు కొనసాగించినట్లు మరోసారి నిర్ధారణ అయింది.

దక్షిణ సైబీరియాలోని డెనిసోవా గుహలో లభించిన శిలాజం ద్వారా ఒక మహిళకు తల్లి నియాండర్తల్ కాగా, తండ్రి డెనిసోవన్ అనే విషయం వెలుగులోకి వచ్చింది.

వివరాలు

ఈ 'ఘోస్ట్' పూర్వీకులు అసలు ఎవరు?

ఈ ఇద్దరు అజ్ఞాత పూర్వీకులు అసలు ఏ మానవ జాతికి చెందినవారనే విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదు. అయితే వీరు మిడిల్ ప్లీస్టోసీన్ కాలంలో జీవించిన హోమో సమూహాలకు చెందినవారై ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

సుమారు 8 లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో జీవించిన మానవ సమూహాలతో తొలి ఘోస్ట్ పూర్వీకుడికి సంబంధం ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఇక 'సూపర్ ఆర్కిటిక్' పూర్వీకుడు దాదాపు హోమో ఎరెక్టస్ జాతికి సమీపంగా లేదా అదే జాతికి చెందినవాడై ఉండవచ్చని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు.

సుమారు 18 లక్షల సంవత్సరాల క్రితమే వీరు యురేషియాలో స్థిరపడ్డారని భావిస్తున్నారు.

వివరాలు

మారిపోతున్న మానవ చరిత్రపై అవగాహన

ఈ కొత్త అధ్యయనం మానవ పరిణామ చరిత్రపై ఉన్న సంప్రదాయ సిద్ధాంతాలను సవాల్ చేస్తోంది.

ఆధునిక మానవుడి ఉనికి అనేది ఒక్క జాతి పరిణామ ఫలితం కాదని, అంతరించిపోయిన అనేక ప్రాచీన మానవ జాతుల జన్యు కలయికతో ఏర్పడిందని డీఎన్‌ఏ ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి.

నేడు ఆ జాతుల శిలాజాలు లేకపోయినా, వారి జన్యు వారసత్వం మన డీఎన్‌ఏలో శాశ్వతంగా నిలిచిపోయింది.

భవిష్యత్తులో ఈ 'ఘోస్ట్ అన్సెస్టర్స్'కు సంబంధించిన పూర్తి జన్యు వివరాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ADVERTISEMENT