LOADING...
Motorola: మోటరోలాపై సంచలన ఆరోపణలు.. అమెజాన్ లింక్‌లలో రహస్యంగా అఫిలియేట్ కోడ్‌లు!
మోటరోలాపై సంచలన ఆరోపణలు.. అమెజాన్ లింక్‌లలో రహస్యంగా అఫిలియేట్ కోడ్‌లు!

Motorola: మోటరోలాపై సంచలన ఆరోపణలు.. అమెజాన్ లింక్‌లలో రహస్యంగా అఫిలియేట్ కోడ్‌లు!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 26, 2026
02:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్మార్ట్‌ ఫోన్ తయారీ సంస్థ మోటరోలా మరో వివాదంలో చిక్కుకుంది. వినియోగదారుల అనుమతి లేకుండానే అమెజాన్ యాప్‌ను అఫిలియేట్ లింక్‌ల ద్వారా రీడైరెక్ట్ చేస్తోందంటూ యూజర్లు ఆరోపణలు చేస్తున్నారు. ఈ అంశం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ వివాదాన్ని తొలిసారిగా ఓ రెడిట్ యూజర్ బయటపెట్టాడు. తన మోటరోలా రేజర్ 60 అల్ట్రా ఫోన్‌లో అమెజాన్ యాప్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించినప్పుడు, ఫోన్ ముందుగా ఒక అనుమానాస్పద URLతో బ్రౌజర్ విండోను తెరిచి, ఆ తర్వాత మళ్లీ Amazon.comకు రీడైరెక్ట్ చేస్తోందని అతను గుర్తించాడు. అంతేకాకుండా ఈ రీడైరెక్ట్‌లో అఫిలియేట్ కోడ్ కూడా జతచేయబడుతోందని పేర్కొన్నాడు.

వివరాలు

అందులో అఫిలియేట్ కోడ్ ఉన్నట్లు సమాచారం

ఈ సమస్యకు కారణం 'స్మార్ట్ ఫీడ్' అనే హిడెన్ సిస్టమ్ యాప్ అని ఆ యూజర్ ఆరోపించాడు. ఈ యాప్ మోటరోలా ఫోన్లలో అమెజాన్ యాప్ ఓపెన్ చేసే ప్రక్రియను మధ్యలో అడ్డుకుని ట్రాఫిక్‌ను ఇతర లింక్‌ల ద్వారా మళ్లిస్తున్నట్లు తెలుస్తోంది. "నా Razr 60 Ultraలో అమెజాన్ ఓపెన్ చేయగానే ముందుగా ఓ విచిత్రమైన URL కనిపించి, తర్వాత అమెజాన్‌కు రీడైరెక్ట్ అవుతోంది. అందులో అఫిలియేట్ కోడ్ కూడా ఉంది. ఇలాంటి ప్రవర్తన చవక ఫోన్లు తయారు చేసే కంపెనీల నుంచి ఆశించొచ్చు కానీ, మోటరోలా వంటి బ్రాండ్ నుంచి కాదు. పైగా ఇది 1300 డాలర్ల ఫోన్ అంటూ ఆ యూజర్ అసహనం వ్యక్తం చేశాడు.

వివరాలు

మొదట్లో రేజర్ ఫోల్డ్ లో సమస్య గుర్తింపు

ఇదిలా ఉండగా, ప్రముఖ టెక్ వెబ్‌సైట్ 9to5Google కూడా ఈ సమస్యను తమ మోటరోలా రేజర్ ఫోల్డ్ యూనిట్‌లో పరీక్షించి గుర్తించినట్లు వెల్లడించింది. ముఖ్యంగా హోమ్‌స్క్రీన్ షార్ట్‌కట్ నుంచి కాకుండా, యాప్ డ్రాయర్ నుంచి అమెజాన్ యాప్ ఓపెన్ చేసినప్పుడు మాత్రమే ఈ రీడైరెక్ట్ జరుగుతోందని తెలిపింది. దీంతో చాలా మంది వినియోగదారులకు ఈ విషయం సులభంగా గుర్తించలేకపోయే పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది.

Advertisement

వివరాలు

అసలు ఈ రీడైరెక్ట్ ఎలా పనిచేస్తోంది?

వివరాల ప్రకారం, యూజర్ అమెజాన్ యాప్‌ను ఓపెన్ చేయగానే మోటరోలా సాఫ్ట్‌వేర్ ముందుగా ఆ ట్యాప్‌ను ఇంటర్‌సెప్ట్ చేస్తోంది. అనంతరం గూగుల్ క్రోమ్ బ్రౌజర్ క్షణకాలం ఓపెన్ అయి, ట్రాఫిక్‌ను "devicenative.com" అనే థర్డ్ పార్టీ అడ్వర్టైజింగ్ సర్వీస్ ద్వారా మళ్లిస్తోంది. అలాగే 'kira-abboud.com' అనే వెబ్‌సైట్ ద్వారా కూడా యూజర్లను అమెజాన్‌కు రీడైరెక్ట్ చేస్తున్నట్లు 9to5Google పేర్కొంది. ఈ వెబ్‌సైట్ ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్ "@కిరాస్ ఫ్యాషన్ ఫైండ్స్"తో సంబంధం ఉన్నట్లు సమాచారం. అయితే మోటరోలా ఫోన్లలో కనిపిస్తున్న అఫిలియేట్ కోడ్ మాత్రం ఆమె సోషల్ మీడియా ఖాతాల్లో ఉపయోగించే కోడ్‌లతో సరిపోలడం లేదని రిపోర్ట్ వెల్లడించింది.

Advertisement

వివరాలు

మోటరోలా నుంచి ఎలాంటి అధికారిక వివరణ రాలేదు

ఇంకా ఆసక్తికర విషయం ఏమిటంటే, స్మార్ట్ ఫీడ్ యాప్ పాత వెర్షన్‌లలో ఈ సమస్య కనిపించలేదని తెలుస్తోంది. దీంతో ఇటీవల విడుదలైన అప్‌డేట్ ద్వారానే ఈ ప్రవర్తన చేరి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ వివాదంపై మోటరోలా నుంచి ఎలాంటి అధికారిక వివరణ రాలేదు. పలు మీడియా సంస్థలు కంపెనీని సంప్రదించినప్పటికీ స్పందన వెలువడలేదు. అయితే తాత్కాలిక పరిష్కారంగా Motorola ఫోన్లలో స్మార్ట్ ఫీడ్ యాప్‌ను డిసేబుల్ చేయడం ద్వారా ఈ రీడైరెక్ట్ సమస్య ఆగుతున్నట్లు యూజర్లు చెబుతున్నారు.

Advertisement