September Android Drop: ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్‌న్యూస్.. జెమినిలో అదిరిపోయే కొత్త ఫీచర్లు
ఈ వార్తాకథనం ఏంటి
రోజువారీ డిజిటల్ అవసరాలను మరింత సులభంగా మార్చే లక్ష్యంతో గూగుల్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం పలు కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. 'సెప్టెంబర్ ఆండ్రాయిడ్ డ్రాప్'లో భాగంగా గూగుల్ జెమిని ఏఐ, ఫైండ్ హబ్, గూగుల్ మెసేజెస్, డివైజ్ యాక్సెసిబిలిటీ విభాగాల్లో ఈ మార్పులు చేసింది. వీటితో స్మార్ట్‌ఫోన్ వినియోగం మరింత సౌకర్యవంతంగా మారనుంది.
వివరాలు
వస్తువులు ఎక్కడ పెట్టారో ఇక గుర్తుపెట్టుకోడం చాల సులభం
పాస్‌పోర్ట్, అదనపు తాళంచెవులు వంటి ముఖ్యమైన వస్తువులను ఎక్కడ పెట్టామో గుర్తులేక ఇబ్బంది పడటం చాలామందికి ఎదురయ్యే సమస్య.
దీనికి గూగుల్ జెమిని కొత్త పరిష్కారాన్ని అందిస్తోంది. ముఖ్యమైన వస్తువును ఎక్కడ ఉంచారో జెమినికి చెబితే.. ఆ వివరాలను ఫైండ్ హబ్‌లో భద్రపరుచుకునే అవకాశం ఉంటుంది.
ఉదాహరణకు.. "నా పాస్‌పోర్ట్‌ను బెడ్‌రూమ్ డ్రాయర్‌లో పెట్టాను, గుర్తుంచుకో" అని జెమినికి వాయిస్ కమాండ్ ఇవ్వొచ్చు. కావాలంటే ఆ వస్తువుకు సంబంధించిన ఫొటోను కూడా జత చేయవచ్చు. ఆ తర్వాత "నా పాస్‌పోర్ట్ ఎక్కడుంది?" అని అడిగితే.. ఫైండ్ హబ్‌లో భద్రపరిచిన సమాచారాన్ని జెమిని వెంటనే స్క్రీన్‌పై చూపిస్తుంది.
ఈ సదుపాయం ఆండ్రాయిడ్ 16, ఆ తర్వాతి వెర్షన్లలో పనిచేసే ఫోన్లకు అందుబాటులోకి వస్తుంది.
వివరాలు
ప్రయాణాల్లో మోషన్ సిక్‌నెస్‌కు 'మోషన్ అసిస్ట్'
కారు, బస్సు వంటి వాహనాల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఫోన్‌ను చూస్తే కొంతమందికి వికారం, కళ్లు తిరగడం వంటి సమస్యలు వస్తుంటాయి.
ఈ మోషన్ సిక్‌నెస్‌ను తగ్గించేందుకు ఆండ్రాయిడ్ 17లో 'మోషన్ అసిస్ట్' ఫీచర్‌ను గూగుల్ ప్రవేశపెట్టింది.
వాహనం కదలికలకు అనుగుణంగా స్క్రీన్‌పై చిన్న బుడగల తరహాలో విజువల్ గ్రాఫిక్స్ కదులుతూ కనిపిస్తాయి.
కళ్లకు కనిపించే దృశ్యానుభూతికి, శరీరం గుర్తించే కదలికలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించడం ద్వారా మోషన్ సిక్‌నెస్‌ను నియంత్రించడంలో ఈ ఫీచర్ సహాయపడుతుంది.
వినియోగదారులు తమ అభిరుచికి అనుగుణంగా బుడగల రంగులు, పారదర్శకతను మార్చుకోవచ్చు.
వివరాలు
దృష్టిలోపం ఉన్నవారికి 'గైడెడ్ విజన్'
చూపు తక్కువగా ఉన్నవారు, అంధుల కోసం గూగుల్ జెమిని లైవ్‌లో 'గైడెడ్ విజన్' అనే ప్రత్యేక సదుపాయాన్ని జోడించింది.
ఫోన్ కెమెరాను ఆన్ చేసి పరిసరాలను జెమినికి చూపిస్తే.. అక్కడ కనిపిస్తున్న విషయాలను ఏఐ వాయిస్ ద్వారా వివరించేలా దీన్ని రూపొందించారు.
దీంతో చిన్న అక్షరాలతో ఉన్న పుస్తకాలు చదవడం, ఎదురుగా ఉన్న వస్తువులను గుర్తించడం, కొత్త ప్రదేశాల్లో దారి తెలుసుకుంటూ నడవడం వంటి పనులు సులభతరం అవుతాయి.
కెమెరాలో వస్తువు సరిగ్గా కనిపించకపోతే.. దాన్ని స్పష్టంగా చూపించేందుకు కెమెరాను ఏ దిశగా తిప్పాలో కూడా జెమిని వాయిస్ ద్వారా సూచిస్తుంది.
ఆండ్రాయిడ్ 9, ఆ తర్వాతి వెర్షన్లలో ఉన్న ఫోన్లలో ఈ ఫీచర్ పనిచేస్తుంది.
వివరాలు
మెసేజెస్‌లోనే గూగుల్ కీప్
గూగుల్ మెసేజెస్‌లో చాటింగ్ చేస్తూనే రోజువారీ పనులకు అవసరమైన జాబితాలను రూపొందించుకునే సదుపాయం కూడా వచ్చింది.
ముఖ్యంగా గ్రోసరీ లిస్ట్‌లు, ప్రయాణ ప్రణాళికలు వంటి వాటిని చాట్‌లోనే రూపొందించుకునేలా 'గూగుల్ కీప్'ను మెసేజెస్‌తో అనుసంధానించారు.
ఇక చాటింగ్ అనుభూతిని వ్యక్తిగతంగా మార్చుకునేందుకు 'చాట్ థీమ్స్' ఫీచర్‌ను కూడా గూగుల్ అందుబాటులోకి తెచ్చింది.
దీని ద్వారా యూజర్లు తమ చాట్ స్క్రీన్‌కు నచ్చిన వాల్‌పేపర్‌లు, రంగులను ఎంచుకుని కొత్త రూపాన్ని ఇవ్వొచ్చు.