Page Loader
Chandrayaan 3: 'శివశక్తి' పాయింట్‌ వయసు 3.7 బిలియన్ సంవత్సరాలా? ఇస్రో సంచలన అధ్యయనం!
'శివశక్తి' పాయింట్‌ వయసు 3.7 బిలియన్ సంవత్సరాలా? ఇస్రో సంచలన అధ్యయనం!

Chandrayaan 3: 'శివశక్తి' పాయింట్‌ వయసు 3.7 బిలియన్ సంవత్సరాలా? ఇస్రో సంచలన అధ్యయనం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 10, 2025
03:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

చంద్రయాన్-3 మిషన్‌తో భారత ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. అప్పగించిన పనిని విజయవంతంగా పూర్తి చేసిన అనంతరం ఈ మిషన్‌ చంద్రుడిపై నిద్రాణ స్థితిలోకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఇందులో అమర్చిన పరికరాలు అందిస్తున్న సమాచారంతో ఇస్రో శాస్త్రవేత్తలు కొత్త ఆవిష్కరణల దిశగా ముందడుగు వేస్తున్నారు. ఈ మిషన్‌లో విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశానికి 'శివశక్తి' అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రాంతం భూమిపై జీవం ఆవిర్భవించిన నాటికన్నా పురాతనమైనదని ఇస్రో శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో ఉన్న ఈ ప్రదేశానికి సంబంధించిన తొలి భౌగోళిక పటాన్ని భారత ఫిజికల్ రీసెర్చ్ ల్యాబోరేటరీ బృందం రూపొందించింది.

Details

విజయవంతంగా ల్యాండ్ అయిన చంద్రయాన్-3

ఈ మ్యాపింగ్‌ను విశ్లేషించిన శాస్త్రవేత్తలు, ఆ ప్రాంతం దాదాపు 3.7 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిందని అంచనా వేశారు. భూమిపై తొలి జీవరూపాలు కూడా ఇదే సమయానికి ఆవిర్భవించడం గమనార్హం. ఈ అధ్యయనం 'సైన్స్ డైరెక్ట్‌'లో ప్రచురితమైంది. భౌగోళిక మ్యాపింగ్ అనేది ప్రాథమిక ప్రక్రియ అని పరిశోధక బృందం పేర్కొంది. గ్రహ ఉపరితల ఆకృతి, ప్రాదేశిక, తాత్కాలిక మార్పులను అర్థం చేసుకోవడానికి ఇది ఎంతో ఉపయోగకరమని వెల్లడించారు. చంద్రయాన్-3 మిషన్‌ ఆగస్టు 23, 2023న చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. భారతదేశ వైజ్ఞానిక సత్తాను ఇది ప్రపంచానికి చాటిచెప్పింది.

Details

నాలుగో దేశంగా భారత్ రికార్డు

ఈ ఘనతతో చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్‌ చేసిన నాలుగో దేశంగా భారత్‌ నిలిచింది. అంతేకాకుండా, చంద్రుని దక్షిణ ధ్రువానికి చేరిన తొలి దేశంగా రికార్డు సృష్టించింది. ఇక భారత్‌ ఇప్పుడు చంద్రయాన్-4 ప్రయోగానికి సిద్ధమవుతోంది. చంద్రుడి ఉపరితల నమూనాలను భూమికి తీసుకురావడానికి ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చంద్రయాన్-4 మిషన్‌ను 2027లో చేపట్టనున్నట్లు కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌ ఇటీవల ప్రకటించారు. ఇందులో భాగంగా ఎల్‌వీఎం-3 రాకెట్‌ను కనీసం రెండుసార్లు ప్రయోగించి, చంద్రయాన్-4 మిషన్‌కు సంబంధించిన ఐదు విభిన్న భాగాలను నింగిలోకి పంపుతామని, వాటిని కక్ష్యలోనే ఒకదానితో ఒకటి అనుసంధానం చేస్తామని తెలిపారు.