Sony: జపాన్‌లో ఐబో రోబో పెట్ విక్రయాలకు సోనీ ముగింపు.. నిరాశలో అభిమానులు
ఈ వార్తాకథనం ఏంటి
జపాన్‌లో తన పెంపుడు రోబో ఐబో (aibo) విక్రయాలను నిలిపివేస్తున్నట్లు సోనీ ప్రకటించింది. 2018లో విడుదలైన తాజా ERS-1000 మోడల్ మార్కెట్లోకి వచ్చిన ఎనిమిదేళ్ల తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్టాక్ పూర్తిగా అమ్ముడైన తర్వాత ఈ మోడల్ విక్రయాలను నిలిపివేస్తామని కంపెనీ తెలిపింది. ఒక అడుగు పొడవుతో, కదిలే చెవులు, భావాలను వ్యక్తపరిచే కళ్లతో రూపొందించిన ERS-1000 మోడల్ విడుదలైన వెంటనే వినియోగదారులను ఆకట్టుకుంది. విడుదలైన తొలి ఆరు నెలల్లోనే 20 వేల యూనిట్లు అమ్ముడయ్యాయి. ఐబో తొలి మోడల్‌ను సోనీ 1999లో మార్కెట్లోకి తీసుకొచ్చింది. అప్పటి నుంచి మెటాలిక్ సిల్వర్ డిజైన్ నుంచి గుండ్రని ముఖంతో మరింత ఆకర్షణీయంగా కనిపించే పలు మోడళ్లను విడుదల చేసింది.
వివరాలు
వినియోగదారులకు అవసరమైన సేవలు కొనసాగుతాయి: సోనీ
ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 1.5 లక్షలకు పైగా ఐబో యూనిట్లు విక్రయమైనట్లు కంపెనీ తెలిపింది. విక్రయాలు నిలిపివేస్తున్నప్పటికీ ఇప్పటికే ఐబోను కొనుగోలు చేసిన వినియోగదారులకు అవసరమైన సేవలు కొనసాగుతాయని సోనీ స్పష్టం చేసింది. సాంకేతిక సహాయం, విడిభాగాల సరఫరా, ఆన్‌లైన్ క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయని పేర్కొంది. రోబో పెట్‌కు సంబంధించిన జ్ఞాపకాలను క్లౌడ్‌లో భద్రపరచేందుకు ఈ సేవలు ఉపయోగపడతాయని తెలిపింది. అయితే కొత్త తరం ఐబోను తీసుకురానుందా? లేదా అమెరికా వంటి ఇతర దేశాల్లో విక్రయాలు ఎలా ఉంటాయనే విషయాలపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం అమెరికాలో ఐబో ధర 3,000 డాలర్లకు పైగానే ఉంది.
వివరాలు
జపాన్‌లోని ఐబో అభిమానులను నిరాశకు గురి చేసిన సోనీ నిర్ణయం
సోనీ నిర్ణయం జపాన్‌లోని ఐబో అభిమానులను నిరాశకు గురి చేసింది. ఈ ప్రకటన చూసినప్పటి నుంచి తాను తీవ్ర షాక్‌లో ఉన్నానని యాచి అనే వినియోగదారు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. మరో వినియోగదారు ఆండో స్పందిస్తూ, భౌతిక కృత్రిమ మేధస్సు (Physical AI) స్వర్ణయుగం మొదలుకాకముందే ఐబో ప్రయాణం ముగిసిపోయిందా? అని ప్రశ్నించారు.