Loading...
South Korea: 2030 నాటికి చంద్రుడిపై అడుగుపెట్టాలని దక్షిణ కొరియా లక్ష్యం
2030 నాటికి చంద్రుడిపై అడుగుపెట్టాలని దక్షిణ కొరియా లక్ష్యం

South Korea: 2030 నాటికి చంద్రుడిపై అడుగుపెట్టాలని దక్షిణ కొరియా లక్ష్యం

వ్రాసిన వారు Moogati Shabari
Aug 12, 2026
05:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

చంద్రుడిపై అడుగుపెట్టేందుకు దక్షిణ కొరియా భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 2030 నాటికి చంద్రుడిపై ల్యాండింగ్‌ చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 'సెవెన్ మేజర్ సీడ్' (Seven Major SEED) పేరుతో ప్రతిష్ఠాత్మక సాంకేతిక వ్యూహాన్ని ఆ దేశం ప్రకటించింది. బ్లూ హౌస్‌లో జరిగిన సమావేశంలో అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ ఈ వ్యూహాన్ని వెల్లడించారు. ఇందులో ఏడు కీలక ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చారు. అణుశక్తి, క్వాంటమ్ కంప్యూటింగ్, అంతరిక్ష పరిశోధనలు, బయోటెక్నాలజీ వంటి రంగాలు ఇందులో ఉన్నాయి. సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)పై మాత్రమే ఆధారపడకుండా భవిష్యత్తులో ఆర్థిక వృద్ధికి కొత్త మార్గాలను ఏర్పాటు చేయడమే ఈ వ్యూహం ప్రధాన ఉద్దేశం.

వివరాలు

కీలక లక్ష్యాలు ఇవే..

'సెవెన్ మేజర్ సీడ్' వ్యూహంలో పలు కీలక లక్ష్యాలను దక్షిణ కొరియా నిర్దేశించింది.

2035 నాటికి దేశీయంగా అభివృద్ధి చేసిన చిన్న మాడ్యులర్ రియాక్టర్లను (SMRs) వాణిజ్య స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.

అలాగే 2030 నాటికి చంద్రుడిపై ల్యాండింగ్ చేయాలని నిర్ణయించింది.

2029 నాటికి దేశీయంగా 100-క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్‌ను అభివృద్ధి చేయాలని కూడా దక్షిణ కొరియా లక్ష్యంగా పెట్టుకుంది.

దీంతో పాటు 2035 నాటికి బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ ఉత్పత్తులను వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళిక రూపొందించింది.

వివరాలు

ఏయే రంగాలకు ప్రాధాన్యం?

'సెవెన్ మేజర్ సీడ్' వ్యూహం విస్తృతమైన సాంకేతిక రంగాలను కవర్ చేస్తోంది.

చిన్న మాడ్యులర్ రియాక్టర్లు, ఫ్యూజన్ ఎనర్జీ, తదుపరి తరం పునరుత్పాదక ఇంధన వనరులు, క్వాంటమ్ టెక్నాలజీ, అంతరిక్షం-విమానయాన రంగాలు ఇందులో ఉన్నాయి.

అలాగే అధునాతన బయోటెక్నాలజీ, కీలకమైన ఖనిజాలు, ముడి పదార్థాల సరఫరా వ్యవస్థల అభివృద్ధిపైనా దక్షిణ కొరియా దృష్టి సారించింది.

దీర్ఘకాలంలో ఆర్థిక వృద్ధి మందగించే అవకాశాలను ఎదుర్కొనేందుకు ఈ వ్యూహాన్ని రూపొందించినట్లు ప్రభుత్వం తెలిపింది.

ADVERTISEMENT

వివరాలు

ప్రపంచ సాంకేతిక పోటీకి సమాధానంగా..

కొత్త తరం సాంకేతిక రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా పోటీ పెరుగుతున్న నేపథ్యంలో దక్షిణ కొరియా ఈ వ్యూహాన్ని ప్రకటించింది.

ఆర్థిక పోటీతత్వం, జాతీయ భద్రతకు ఈ సాంకేతికతలు కీలకంగా మారుతున్నాయని ప్రపంచంలోని అనేక దేశాల ప్రభుత్వాలు భావిస్తున్నాయి.

ఈ విషయంపై సైన్స్ మంత్రి బే క్యుంగ్-హూన్ స్పందించారు.

ఈ సాంకేతిక రంగాల్లోని అవకాశాలను మరింతగా అభివృద్ధి చేసి, రాబోయే 10 లేదా 20 ఏళ్లలో ఏ దేశం కూడా పోటీ పడలేని స్థాయిలో దక్షిణ కొరియాను నిర్మించేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.

ADVERTISEMENT