Starship Flight 13: వాతావరణం కారణంగా స్టార్‌షిప్ 13వ ప్రయోగాన్ని వాయిదా వేసిన స్పేస్‌ఎక్స్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ ప్రఖ్యాత అంతరిక్ష సంస్థ స్పేస్-X తన స్టార్‌షిప్ రాకెట్ 13వ సమీకృత పరీక్షా ప్రయోగాన్ని ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా శుక్రవారానికి వాయిదా వేసింది. టెక్సాస్‌లోని బోకా చికాలో ఉన్న స్టార్‌బేస్ కేంద్రం నుంచి గురువారం భారత కాలమానం ప్రకారం ఉదయం 4:15 గంటలకు ప్రయోగాన్ని నిర్వహించేందుకు 90నిమిషాల లాంచ్ విండోను నిర్ణయించినప్పటికీ,వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రయోగంలో రాకెట్ వేగంగా పైకి ఎగిరే సమయంలో స్టార్‌షిప్ హీట్ షీల్డ్ ఎలా పనిచేస్తుందో భూమి నుంచి స్పష్టంగా పరిశీలించనున్నారు. అయితే మేఘావృత వాతావరణం కారణంగా అవసరమైన విజిబిలిటీ లభించలేదు. దీనికి ముందు ప్రయోగ కౌంట్‌డౌన్ చివరి క్షణాల్లో రాప్టర్ ఇంజిన్ స్టార్ట్‌అప్ సమస్య తలెత్తడంతో ప్రయోగాన్ని నిలిపివేశారు.
వివరాలు
అంగారక గ్రహ యాత్రల కోసం ఎలాన్ మస్క్ రూపొందిస్తున్న ప్రణాళికల్లో ఇది కీలక భాగం
అనంతరం స్పేస్-X రెండు రాప్టర్ ఇంజిన్లను మార్చి, రాకెట్‌పై అదనపు సాంకేతిక పరీక్షలు నిర్వహించింది.
సుమారు 123 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత భారీ,శక్తివంతమైన రాకెట్ వ్యవస్థగా గుర్తింపు పొందిన స్టార్‌షిప్‌లో సూపర్ హెవీ బూస్టర్,స్టార్‌షిప్ వ్యోమనౌక పూర్తిగా తిరిగి వినియోగించుకునేలా రూపొందించారు.
భూమి కక్ష్య, చంద్రుడు,భవిష్యత్తులో అంగారక గ్రహ యాత్రల కోసం ఎలాన్ మస్క్ రూపొందిస్తున్న ప్రణాళికల్లో ఇది కీలక భాగం.
వివరాలు
మొత్తం 12 స్టార్‌షిప్ పరీక్షా ప్రయోగాలు నిర్వహించిన స్పేస్-X
ఈ పరీక్షా ప్రయోగంలో 20 స్టార్‌లింక్ ఉపగ్రహాలను కూడా తీసుకెళ్లనున్నారు.
అవి ఉపకక్ష్య మార్గంలో ప్రయాణించి అనంతరం భూమి వాతావరణంలో దహనమయ్యేలా పరీక్ష నిర్వహించనున్నారు.
2023 నుంచి ఇప్పటివరకు స్పేస్‌ఎక్స్ మొత్తం 12 స్టార్‌షిప్ పరీక్షా ప్రయోగాలు నిర్వహించింది.
నాసా ఆర్టెమిస్ చంద్రయాన్ కార్యక్రమంతో పాటు భవిష్యత్ అంతరిక్ష అన్వేషణ, ఉపగ్రహాల ప్రయోగాల్లో స్టార్‌షిప్ కీలక పాత్ర పోషించనుందని సంస్థ భావిస్తోంది.