LOADING...
Earth: భూమి భవితవ్యంపై కొత్త ఆశలు రేకెత్తించిన శాస్త్రవేత్తల పరిశోధన
భూమి భవితవ్యంపై కొత్త ఆశలు రేకెత్తించిన శాస్త్రవేత్తల పరిశోధన

Earth: భూమి భవితవ్యంపై కొత్త ఆశలు రేకెత్తించిన శాస్త్రవేత్తల పరిశోధన

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 06, 2026
02:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

సూర్యుడి చివరి దశలో భూమి పూర్తిగా నాశనం అవుతుందనే ఎన్నాళ్లుగానో ఉన్న అభిప్రాయానికి తాజా పరిశోధన సవాల్ విసిరింది. కొత్త అధ్యయనం ప్రకారం, సూర్యుడి మరణం తర్వాత కూడా భూమి మనుగడ సాగించే అవకాశం ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరిశోధన వివరాలు ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. బెల్జియంలోని కేయూ లూవెన్ (KU Leuven) ఖగోళ పరిశోధన సంస్థకు చెందిన పరిశోధకుడు మాట్స్ ఎస్సెల్డ్యూర్స్ నేతృత్వంలోని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. ప్రస్తుతం సూర్యుడి మాదిరిగానే ఉన్న భారీ నక్షత్రాలను పరిశీలించినప్పుడు, భూమి పూర్తిగా నాశనం కాకపోవచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయని ఆయన తెలిపారు.

వివరాలు  

వేడి గర్భ భాగాన్నే వైట్ డ్వార్ఫ్‌గా పిలుస్తారు

శాస్త్రవేత్తల అంచనా ప్రకారం, మరో సుమారు 500 కోట్ల సంవత్సరాల తర్వాత సూర్యుడి గర్భంలో హైడ్రోజన్ ఇంధనం పూర్తవుతుంది. ఆ తర్వాత సూర్యుడు ప్రస్తుతం ఉన్న పరిమాణం కంటే వందల రెట్లు విస్తరించడం ప్రారంభిస్తాడు. ఈ ప్రక్రియలో మొదట సూర్యుడు రెడ్ జెయింట్ దశకు చేరుకుంటాడు. అనంతరం మరింత విస్తరించి ఏజీబీ (AGB) స్టార్గా మారుతాడు. చివరికి తన జీవితాన్ని ముగించి వైట్ డ్వార్ఫ్గా మారిపోతాడు. నక్షత్రం మరణించిన తర్వాత మిగిలే అత్యంత వేడి గర్భ భాగాన్నే వైట్ డ్వార్ఫ్‌గా పిలుస్తారు.

వివరాలు 

L2 Puppis అనే మరణిస్తున్న నక్షత్రం 

ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు సూర్యుడి ఈ చివరి దశల్లో ఏర్పడే తీవ్రమైన ఉష్ణ ప్రభావంతో బుధుడు, శుక్రుడు,భూమి గ్రహాలు పూర్తిగా నాశనం అవుతాయని భావించేవారు. అయితే నక్షత్రాల పరిణామ నమూనాలతో పాటు సూర్యుడి భవిష్యత్ పరిస్థితిని ప్రతిబింబించే అవకాశం ఉన్న L2 Puppisఅనే మరణిస్తున్న నక్షత్రాన్ని పరిశీలించిన అనంతరం పరిశోధకులు కొత్త నిర్ణయానికి వచ్చారు. వారి విశ్లేషణ ప్రకారం భూమి తప్పనిసరిగా నాశనం కావాల్సిన అవసరం లేదని తేలింది. అధ్యయనం ప్రకారం రెండు అవకాశాలు ఉన్నాయి. ఒకవైపు సూర్యుడు విస్తరించే కొద్దీ దాని గురుత్వాకర్షణ ప్రభావం భూమిని తనవైపు లాగి చివరకు మింగివేయవచ్చు. మరోవైపు సూర్యుడి నుంచి వెలువడే శక్తివంతమైన నక్షత్ర గాలుల కారణంగా దాని ద్రవ్యరాశి వేగంగా తగ్గితే, గురుత్వాకర్షణ బలహీనపడుతుంది.

Advertisement

వివరాలు 

భూమి సూర్యుడి ప్రభావం నుంచి బయటపడే అవకాశం

దీంతో భూమి మరింత దూర కక్ష్యలోకి వెళ్లి సూర్యుడి ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. భూమి అంతిమ గమ్యం సూర్యుడు ఎంత వేగంగా తన ద్రవ్యరాశిని కోల్పోతాడనే అంశంపై ఆధారపడి ఉంటుందని పరిశోధకులు తెలిపారు. గురుత్వాకర్షణ ప్రభావం ఎక్కువగా ఉంటే భూమి సూర్యుడిలో కలిసిపోతుందని, ద్రవ్యరాశి తగ్గుదల ప్రభావం అధికంగా ఉంటే భూమి మరింత దూర కక్ష్యలోకి వెళ్లి మనుగడ సాగించే అవకాశం ఉందని మాట్స్ ఎస్సెల్డ్యూర్స్ వివరించారు.

Advertisement