China Human Robots: చైనా నుంచి షాకింగ్ హ్యూమనాయిడ్ రోబో.. హావభావాలు చూసి ఆశ్చర్యపోతున్న ప్రపంచం
ఈ వార్తాకథనం ఏంటి
మనిషిని చూస్తున్నామా.. లేక రోబోను చూస్తున్నామా అనే సందేహం కలిగించేలా చైనాకు చెందిన రోబోటిక్స్ సంస్థ AheadForm అత్యంత సహజమైన హ్యూమనాయిడ్ రోబోను రూపొందించింది. Origin-F1 పేరుతో తీసుకొచ్చిన ఈ మహిళా రోబో రూపం, ముఖ కవళికలు, కళ్ల కదలికలు, మాట్లాడే తీరు అన్నీ నిజమైన మనిషిని తలపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే "డబ్బు తీసుకోండి.. వెంటనే ఈ రోబోను ఇవ్వండి" అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఈ రోబోలోని ముఖ కవళికలను కృత్రిమ మేధ (AI) ఆధారిత ఫేషియల్ మోషన్ అల్గోరిథమ్స్ నియంత్రిస్తాయి.
వివరాలు
సూక్ష్మమైన ముఖ కవళికలను కూడాప్రదర్శించగల రోబో
కళ్ల రెప్పలు కొట్టడం, కళ్లను పైకి, కిందికి, ఎడమ, కుడి వైపు తిప్పడం, మాట్లాడేటప్పుడు పెదవుల కదలిక, చిరునవ్వు వంటి ప్రతి చిన్న హావభావాన్ని సహజంగా చూపించేలా దీనిని రూపొందించారు.
మొత్తం 26 డిగ్రీల ఫ్రీడమ్ కలిగిన మెకానికల్ వ్యవస్థ వల్ల చాలా సూక్ష్మమైన ముఖ కవళికలను కూడా ఈ రోబో ప్రదర్శించగలదని కంపెనీ తెలిపింది.
AheadForm ప్రకారం, ఇది నిజ జీవితంలో మనుషులతో సహజంగా సంభాషించేలా రూపొందించిన డెస్క్‌టాప్ అల్ట్రా-బయోనిక్ హ్యూమనాయిడ్ రోబో.
బయోనిక్ మెకానికల్ డిజైన్‌తో పాటు మల్టీమోడల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను కలిపి మరింత సహజమైన, జీవంతో కూడిన ఇంటరాక్టివ్ అనుభూతిని అందించేలా దీన్ని అభివృద్ధి చేశామని కంపెనీ వెల్లడించింది.
వివరాలు
రెండు వేరియంట్లలో రోబో
ఈ రోబో రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది.
బ్లాక్ వెర్షన్‌లో నల్ల జుట్టుతో మహిళా రూపం ఉండగా, వైట్ వెర్షన్‌లో లైట్ బ్లాండ్ హెయిర్‌తో మరో మహిళా రూపాన్ని అందించనున్నారు.
భవిష్యత్తులో వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా మరిన్ని క్యారెక్టర్ డిజైన్లను కూడా విడుదల చేయాలని సంస్థ యోచిస్తోంది.
అయితే ఈ రోబో ధర కూడా అంతే భారీగా ఉంది. కాన్ఫిగరేషన్‌ను బట్టి దీని ధర 50 వేల డాలర్ల నుంచి 1.73 లక్షల డాలర్ల వరకు ఉంటుంది.
భారత కరెన్సీలో ఇది సుమారు రూ.48 లక్షల నుంచి రూ.1.6 కోట్ల వరకు ఉంటుంది.
అయినప్పటికీ ఈ ధర కొనుగోలుదారులను ఏమాత్రం వెనక్కి తగ్గించడం లేదని సోషల్ మీడియా స్పందనలు చూస్తే అర్థమవుతోంది.
వివరాలు
రోబో ఎప్పుడు విడుదల అవుతుందన్న విషయంపై స్పష్టత ఇవ్వని కంపెనీ
రోబో వీడియోలను చూసిన నెటిజన్లు దాని సహజత్వాన్ని ప్రశంసిస్తున్నారు.
ముఖ్యంగా కళ్ల కదలికలు, రెప్పలు కొట్టే వేగం,మాట్లాడేటప్పుడు కనిపించే ముఖ కవళికలు నిజమైన మనిషిలా ఉన్నాయని కొనియాడుతున్నారు.
ఈ రోబో వీడియోలు చూసిన నెటిజన్లు దాని సహజమైన రూపం, హావభావాలను ప్రశంసిస్తున్నారు. "ఇది రోబోటిక్స్ రంగంలో ఓ కొత్త మైలురాయి"అని ఒకరు వ్యాఖ్యానించగా,మరొకరు"ఇక మన ఊహలకు మించిన రోబో గర్ల్‌ఫ్రెండ్ కూడా అందుబాటులోకి వచ్చే రోజులు దూరంలో లేవు"అంటూ సరదాగా స్పందించారు.మరికొందర "వెంటనే విడుదల చేయండి.. ఎంత ధరైనా కొనడానికి సిద్ధమే", "నా డబ్బు తీసుకోండి"అంటూ తమ ఆసక్తిని వ్యక్తం చేశారు.
అయితే ఈ హ్యూమనాయిడ్ రోబోను ఎప్పుడు మార్కెట్‌లో విడుదల చేస్తారనే విషయంపై కంపెనీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.