Chandrayaan-3: చంద్రయాన్-3 ప్రొపల్షన్ మాడ్యూల్‌ను భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఇస్రో
చంద్రయాన్-3 ప్రాజెక్టులో భారత అంతరిక్ష సంస్థ ఇస్రో మరో ముందడుగు వేసింది. చంద్రయాన్-3 ప్రొపల్షన్ మాడ్యూల్‌ను చంద్రుడి కక్ష్య నుంచి భూమి కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఈ మేరకు ఇస్రో ట్వీట్ చేసింది. కక్ష్య పెంపు విన్యాసం, ట్రాన్స్-ఎర్త్ ఇంజెక్షన్ ప్రక్రియల ద్వారా మాడ్యుల్‌ను తిరిగి భూకక్ష్యలో ప్రవేశపెట్టామని ఇస్రో వెల్లడించింది. ఇదొక అపూర్వ ప్రయోగమని ఇస్రో చెబుతోంది. భవిష్యత్ ప్రయోగాలకు ఉపయోగపడే డేటాను సేకరించడం కోసం ప్రొపల్షన్ మాడ్యూల్‌ను భూ కక్ష్యలోకి పంపినట్లు ఇస్రో పేర్కొంది. చంద్రయాన్ 3 జూలై 14, 2023న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఎల్‌ఎమ్‌వి-ఎం4 రాకెట్ ద్వారా ఇస్రో ప్రయోగించబడింది. ఆగస్టు 23న విక్రమ్ ల్యాండర్ చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గర సురక్షితంగా దిగింది.