Loading...
Mercury: బుధుడి పరిమాణం మరింత తగ్గిందా? శాస్త్రవేత్తల కొత్త పరిశోధనలో ఆసక్తికర విషయాలు
బుధుడి పరిమాణం మరింత తగ్గిందా? శాస్త్రవేత్తల కొత్త పరిశోధనలో ఆసక్తికర విషయాలు

Mercury: బుధుడి పరిమాణం మరింత తగ్గిందా? శాస్త్రవేత్తల కొత్త పరిశోధనలో ఆసక్తికర విషయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 11, 2026
04:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

సూర్యుడికి అత్యంత సమీపంలో ఉండే బుధ గ్రహం గతంలో భావించిన దానికంటే ఎక్కువగా పరిమాణం తగ్గి ఉండొచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. బుధుడి ఉపరితలంపై కనిపించే ముడతలు,కొండచరియల్లాంటి నిర్మాణాలు.. గ్రహం ఒకప్పుడు మరింత పెద్దదిగా ఉండి,కాలక్రమేణా పరిమాణం తగ్గిందనడానికి ఆధారాలుగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ పరిశోధన వివరాలు'జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్‌'లో ప్రచురితమయ్యాయి. సుమారు 450 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడిన బుధుడు.. సూర్యుడి చుట్టూ ఒకసారి తిరగడానికి 88 రోజులు పడుతుంది. గ్రహం ఏర్పడిన తొలినాళ్లలో అంతరిక్ష శిలలు ఒకదానికొకటి ఢీకొనడంతో భారీగా వేడి పుట్టింది. దీంతో అప్పటికే వేడిగా ఉన్న బుధ గ్రహం మరింత వేడెక్కింది.

వివరాలు 

గత అంచనాల కంటే 30 శాతం ఎక్కువగా కుంచించుకుందా?

కాలక్రమేణా ఆ వేడి బయటకు వెళ్లడంతో గ్రహం లోపలి భాగం చల్లబడి, దాని పరిమాణం తగ్గింది. దాంతో ఉపరితలంపై పగుళ్లు, కొండచరియల్లాంటి నిర్మాణాలు ఏర్పడ్డాయి.

అయితే కోట్ల ఏళ్లుగా గ్రహంపై పడిన గ్రహశకలాలు, తోకచుక్కల ప్రభావంతో ఏర్పడిన బిలాలు, శిథిలాలు ఈ నిర్మాణాల్లో కొన్నింటిని కప్పివేసి ఉండొచ్చని పరిశోధకులు తెలిపారు.

నాసా 'మెసెంజర్‌' వ్యోమనౌక నుంచి వచ్చిన సమాచారాన్ని విశ్లేషించిన శాస్త్రవేత్తలు.. బుధుడి గరుకైన ప్రాంతాల్లో ముడతలు తక్కువగా కనిపిస్తున్నట్లు గుర్తించారు.

దీంతో అక్కడి సంకోచ సూచనలు శిథిలాల కింద దాగి ఉండొచ్చని అంచనా వేశారు.

గత అంచనాల కంటే బుధ గ్రహం పరిమాణం 10-30 శాతం ఎక్కువగా తగ్గి ఉండొచ్చని తాజా లెక్కలు సూచిస్తున్నాయి.

వివరాలు 

బుధుడిపై మరింత స్పష్టత ఇవ్వనున్న బెపీకొలంబో

దీని ఆధారంగా గ్రహ వ్యాసార్థంలో సుమారు 11.6 కిలోమీటర్ల వరకు మార్పు జరిగి ఉండొచ్చని పరిశోధకులు తెలిపారు.

ఈ వివరాలు బుధుడి లోహపు గర్భం, అంతర్గత నిర్మాణం, అయస్కాంత క్షేత్రం వంటి అంశాలను అర్థం చేసుకోవడంలో ఉపయోగపడతాయి.

దాదాపు ఎనిమిదేళ్ల ప్రయాణం తర్వాత బుధుడి వద్దకు చేరుకుంటున్న 'బెపీకొలంబో' మిషన్‌.. ఈ ఏడాది చివర్లో గ్రహం చుట్టూ రెండు ఆర్బిటర్లను ప్రవేశపెట్టనుంది.

ఈ మిషన్‌ సేకరించే భౌగోళిక ఎత్తుపల్లాలు, ఉపరితల నిర్మాణాల సమాచారంతో బుధ గ్రహం పరిమాణం ఎంత తగ్గిందో మరింత కచ్చితంగా తెలుసుకునే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.

ADVERTISEMENT