Aditya L-1:ఇస్రో మరో చారిత్రక ప్రయోగం; సూర్యూడిపై అధ్యయనానికి 'ఆదిత్య ఎల్1' మిషన్
ఇటీవల ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్-3 మిషన్‌ను చేపట్టిన భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) తాజాగా మరో చారిత్రక ప్రయోగానికి సిద్ధమవుతోంది. సూర్యునిపై అధ్యయనం కోసం 'ఆదిత్య ఎల్1' మిషన్ ప్రయోగానికి ఇస్రో సన్నద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట స్పేస్‌పోర్టుకు ఆదిత్య ఎల్1 శాటిలైట్ చేరుకున్నట్లు ఇస్రో తెలిపింది. ఆదిత్య ఎల్1 సెప్టెంబర్ మొదటి వారంలో ప్రయోగించనున్నట్లు ఇస్రో వెల్లడించింది. ఆదిత్య ఎల్1 శాటిలైట్‌ను బెంగళూరులోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్‌లో తయారు చేశారు. తాజాగా ఇది ప్రయోగం కోసం శ్రీహరికోటకు చేరుకుందని ఇస్రో చెప్పింది. సూర్యునిపై అధ్యయనం కోసం ఇస్రో చేస్తున్న మొదటి మిషన్ ఇదే కావడం గమనార్హం.
హాలో ఆర్బిట్ కక్ష్యలో ఆదిత్య ఎల్1 శాటిలైట్‌ను ప్రవేశపెట్టనున్న ఇస్రో
సూర్యుడు-భూమి మధ్య లాంగ్రెస్ పాయింట్‌కు దగ్గరగా ఉన్న హాలో కక్ష్యలోకి ఆదిత్య ఎల్1 శాటిలైట్‌ను ఇస్రో ప్రవేశపెట్టనుంది. ఇది భూమికి 1.5మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హాలో ఆర్బిట్ కక్ష్యలో శాటిలైట్‌ను ప్రవేశపెట్టడం వల్ల సూర్యుడిని నిరంతరం పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. సౌర తుపానులను గుర్తించడంతో పాటు సూర్యుని వల్ల కలిగే మార్పులను విశ్లేషించడంలో ఈ శాటిలైట్ ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆదిత్య ఎల్1తో పాటు ఏడు పేలోడ్లు కూడా అంతరిక్షంలోకి పంపబడతాయి. వీటిలో నాలుగు పేలోడ్‌లు సూర్యుడిని నిరంతరం పర్యవేక్షిస్తాయి. మిగిలిన మూడు పేలోడ్‌లు పరిస్థితులకు అనుగుణంగా కణాలు, అయస్కాంత క్షేత్రాలను అధ్యయనం చేస్తాయి.