LOADING...
Earth: వాతావరణ మార్పుల ప్రభావం.. భూమి భ్రమణ వేగం తగ్గుతోందట!
వాతావరణ మార్పుల ప్రభావం.. భూమి భ్రమణ వేగం తగ్గుతోందట!

Earth: వాతావరణ మార్పుల ప్రభావం.. భూమి భ్రమణ వేగం తగ్గుతోందట!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 09, 2026
11:40 am

ఈ వార్తాకథనం ఏంటి

వాతావరణ మార్పులు భూమిపై అనేక రకాల ప్రభావాలు చూపుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ అధ్యయనం మరింత ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. భూమిపై ఉన్న హిమనదాలు, ధ్రువ ప్రాంతాల మంచు పొరలు వేగంగా కరుగుతుండటంతో భూమి భ్రమణ వేగం క్రమంగా తగ్గుతోందని, దీంతో రోజుల నిడివి స్వల్పంగా పెరుగుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆస్ట్రియాలోని వియన్నా విశ్వవిద్యాలయం, స్విట్జర్లాండ్‌కు చెందిన ఈటీఎచ్ జ్యూరిచ్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం ప్రకారం ప్రస్తుతం భూమిపై ఒక రోజు నిడివి ప్రతి శతాబ్దానికి సుమారు1.33 మిల్లీసెకన్ల చొప్పున పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం వాతావరణ మార్పుల ప్రభావంతో హిమనదాలు, గ్రీన్‌ల్యాండ్, అంటార్కిటికా ప్రాంతాల్లోని మంచు కరుగడం వల్ల సముద్ర మట్టాలు పెరగడమేనని పరిశోధకులు తెలిపారు.

వివరాలు

క్రమంగా పెరుగుతున్న రోజు నిడివి

మంచు కరిగిన తర్వాత ఆ నీరు ధ్రువ ప్రాంతాల నుంచి సముద్రాల్లోకి చేరుతుంది. దీంతో భూమిపై ద్రవ్యరాశి (మాస్) పంపిణీలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ మార్పుల కారణంగా భూమి భ్రమణ వేగం కొద్దిగా మందగించి, రోజు నిడివి క్రమంగా పెరుగుతోందని అధ్యయనం పేర్కొంది. ఈ మార్పు చాలా స్వల్పంగా ఉన్నప్పటికీ, ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థలు, అంతరిక్ష మిషన్లు, ప్రపంచ కాలమాన వ్యవస్థలపై ప్రభావం చూపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ భూమి భ్రమణానికి సంబంధించిన అత్యంత ఖచ్చితమైన సమాచారంపై ఆధారపడి పనిచేస్తాయి.

వివరాలు

వాతావరణ మార్పులే కారణం

భూమి భ్రమణంలో గతంలో చోటుచేసుకున్న మార్పులను తెలుసుకోవడానికి పరిశోధకులు సముద్ర అడుగుభాగంలో నివసించిన 'బెంథిక్ ఫోరామినిఫెరా' అనే సూక్ష్మ సముద్ర జీవుల శిలాజాలను అధ్యయనం చేశారు. ఆధునిక మెషిన్ లెర్నింగ్ సాంకేతికతను ఉపయోగించి గత 36 లక్షల సంవత్సరాల కాలంలో రోజు నిడివిలో చోటుచేసుకున్న మార్పులను పునర్నిర్మించారు. ఈ పరిశోధన ఫలితాలు Journal of Geophysical Research: Solid Earthలో ప్రచురితమయ్యాయి. అధ్యయనం ప్రకారం గత 36 లక్షల సంవత్సరాల చరిత్రలో 2000 నుంచి 2020 మధ్య నమోదైనంత వేగంగా వాతావరణ మార్పుల కారణంగా రోజు నిడివి పెరిగిన కాలం మరొకటి లేదని వెల్లడైంది.

Advertisement

వివరాలు

వేగంగా కరుగుతున్న హిమనదాలు

సాధారణంగా భూమి భ్రమణాన్ని ప్రభావితం చేసే ప్రధాన సహజ కారకం చంద్రుడే. చంద్రుడి గురుత్వాకర్షణ ప్రభావంతో భూమి భ్రమణ వేగం క్రమంగా తగ్గుతూ, రోజులు పొడవవుతుంటాయి. అయితే ప్రస్తుత వాతావరణ మార్పుల తీవ్రత ఇదే స్థాయిలో కొనసాగితే, ఈ శతాబ్దం చివరినాటికి భూమి భ్రమణంపై చంద్రుడి ప్రభావాన్ని కూడా అధిగమించే స్థాయికి చేరుకోవచ్చని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 21వ శతాబ్దంలో గ్రీన్‌ల్యాండ్, అంటార్కిటికా మంచు పొరలతో పాటు పర్వత ప్రాంత హిమనదాలు వేగంగా కరుగుతున్నాయి. దీంతో సముద్ర మట్టాలు పెరగడంతో పాటు ధ్రువ ప్రాంతాల్లోని ద్రవ్యరాశి ఇతర ప్రాంతాలకు మారుతోంది.

Advertisement

వివరాలు

ఎసిగిపడుతున్న సముద్ర మట్టాలు

ఈ ప్రక్రియ వల్ల భూమి భూమధ్యరేఖ (ఈక్వేటర్) ప్రాంతంలో స్వల్పంగా ఉబ్బినట్లుగా మారి, భ్రమణ వేగం మరింత మందగిస్తున్నట్లు అధ్యయనం తేల్చింది. వాతావరణ మార్పులు కేవలం ఉష్ణోగ్రతలు పెరగడం, సముద్ర మట్టాలు ఎగసిపడటంతో మాత్రమే పరిమితం కాకుండా, భూమి భ్రమణ వేగాన్నే ప్రభావితం చేస్తున్నాయనే విషయం ఈ అధ్యయనంతో మరోసారి స్పష్టమైంది.

Advertisement