LOADING...
'Little Brain': వృద్ధాప్యంలో మెదడుకు అండగా నిలిచే 'చిన్న మెదడు'.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర విషయాలు
కొత్త అధ్యయనంలో ఆసక్తికర విషయాలు

'Little Brain': వృద్ధాప్యంలో మెదడుకు అండగా నిలిచే 'చిన్న మెదడు'.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర విషయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 24, 2026
12:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

మన తల వెనుక భాగంలో ఉండే చిన్న మెదడు అయిన సెరెబెల్లం (Cerebellum) వృద్ధాప్యంలోనూ మానసిక సామర్థ్యాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించవచ్చని తాజా పరిశోధన వెల్లడించింది. ఇప్పటివరకు సెరెబెల్లం ప్రధానంగా శరీర కదలికలను నియంత్రించే భాగంగా భావించేవారు. అయితే ఇప్పుడు ఇది ఆలోచన, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత వంటి మేధో సామర్థ్యాలకు కూడా ఎంతో ముఖ్యమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాజా అధ్యయనంలో సెరెబెల్లం వెనుక భాగంలోని కొన్ని ప్రాంతాలు వయసు పెరిగినా పెద్దగా కుంచించుకుపోకుండా ఉండటం గమనించారు. ఈ ప్రాంతాలు బలంగా ఉన్నవారిలో మానసిక పనితీరు మెరుగ్గా ఉన్నట్లు గుర్తించారు. అల్జీమర్స్ వ్యాధి ప్రారంభ దశలో ఉన్నవారిలో కూడా ఇదే ధోరణి కనిపించింది.

వివరాలు 

ఊహించే సామర్ధ్యం 

ఈ పరిశోధనలో భాగంగా అమెరికాకు చెందిన హ్యూమన్ కనెక్టోమ్ ప్రాజెక్ట్ ద్వారా సేకరించిన 700 మందికిపైగా పెద్దల మెదడు స్కాన్‌లు, జ్ఞాన సామర్థ్య పరీక్షల ఫలితాలను విశ్లేషించారు. ఈ పరీక్షల్లో స్వల్పకాలిక జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, భాషా నైపుణ్యాలతో పాటు వస్తువుల ఆకారాలు, పరిమాణాలను మనసులో ఊహించే సామర్థ్యాన్ని కూడా పరిశీలించారు. పరిశీలనలో ఒక స్పష్టమైన విషయం బయటపడింది. వయసు పెరిగేకొద్దీ సెరెబెల్లం పరిమాణం తగ్గుతున్నప్పటికీ, పెద్ద పరిమాణంలో ఉన్న సెరెబెల్లం కలిగినవారు మేధో పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించారు. ముఖ్యంగా సెరెబెల్లం వెనుక భాగం పెద్దగా ఉన్నవారిలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది. విద్యా స్థాయిలలో ఉన్న తేడాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత కూడా ఇదే ఫలితం నమోదైంది.

వివరాలు 

పెద్ద సెరెబెల్లంలో నాడీకణజాలం, నాడీ సంబంధాలు ఎక్కువ

అదే విధంగా బ్రిటన్‌కు చెందిన యూకే బయోబ్యాంక్ డేటాబేస్‌లోని 35 వేల మందికిపైగా పెద్దల వివరాలను పరిశీలించినా ఇదే సంబంధం కనిపించింది. సెరెబెల్లం పరిమాణం ఎక్కువగా ఉండటం వల్ల వృద్ధాప్యంలో మేధో సామర్థ్యాలు మెరుగ్గా కొనసాగవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. పెద్ద సెరెబెల్లంలో నాడీకణజాలం, నాడీ సంబంధాలు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమై ఉండవచ్చని వారు చెబుతున్నారు. ఈ ప్రభావం మెదడు వ్యాధుల్లోనూ ఉంటుందా అనే అంశాన్ని తెలుసుకోవడానికి పరిశోధకులు అమెరికా, కెనడాలకు చెందిన సుమారు 1,350 మంది వివరాలను విశ్లేషించారు. వీరిలో 644 మందిలో అల్జీమర్స్‌కు ప్రధాన సూచికగా భావించే అమిలాయిడ్ ప్లాక్‌లు అధికంగా ఉన్నట్లు గుర్తించారు.

Advertisement

వివరాలు 

అల్జీమర్స్ వల్ల కలిగే నష్టాన్ని కొంతవరకు సెరెబెల్లం భర్తీ చేసే అవకాశం

అల్జీమర్స్ ప్రారంభ దశలో, అమిలాయిడ్ ప్లాక్‌లు ఎక్కువగా పేరుకుపోయే ముందు, పెద్ద సెరెబెల్లం ఉన్నవారిలో జ్ఞాన సామర్థ్య స్కోర్లు మెరుగ్గా ఉన్నట్లు తేలింది. దీంతో అల్జీమర్స్ వల్ల కలిగే నష్టాన్ని కొంతవరకు సెరెబెల్లం భర్తీ చేసే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ అధ్యయనం సెరెబెల్లం వృద్ధాప్య మార్పులపై ఇప్పటివరకు జరిగిన అత్యంత విస్తృత పరిశోధనల్లో ఒకటిగా నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణ వృద్ధాప్యం, అల్జీమర్స్ వంటి వ్యాధుల్లో సెరెబెల్లం పాత్రను మరింతగా అర్థం చేసుకుంటే భవిష్యత్తులో కొత్త చికిత్సా విధానాలకు మార్గం సుగమం కావచ్చని వారు అంటున్నారు.

Advertisement

వివరాలు 

మెదడు ఆరోగ్యంపై ఇంకా ఆశ

అయితే ప్రస్తుతం సెరెబెల్లం పరిమాణం ఎక్కువగా ఉండటం వల్లనే మేధో సామర్థ్యాలు మెరుగ్గా ఉంటాయని ఖచ్చితంగా చెప్పలేమని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. అలాగే ఈ అధ్యయనంలో పాల్గొన్నవారిలో ఎక్కువ మంది శ్వేతజాతీయులు, ఉన్నత విద్యావంతులు కావడంతో ఫలితాలను అందరికీ వర్తింపజేయడంలో జాగ్రత్త అవసరమని పేర్కొన్నారు. అయినప్పటికీ, వృద్ధాప్యంలో మెదడు ఆరోగ్యాన్ని కాపాడడంలో సెరెబెల్లం ఒక రక్షణ కవచంలా పనిచేసే అవకాశం ఉందన్న అంశం ఆశాజనకంగా ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. వయసు పెరగడం అంటే తప్పనిసరిగా మేధో సామర్థ్యాలు తగ్గిపోవాల్సిన అవసరం లేదని, మెదడు ఆరోగ్యంపై ఇంకా ఆశ ఉందని వారు చెబుతున్నారు.

Advertisement