Trump Super Intelligence: ట్రంప్ 'సూపర్ ఇంటెలిజెన్స్' ఎఫెక్ట్.. ఒక్కసారిగా దూసుకెళ్లిన స్లోవేనియా .si డొమైన్ రిజిస్ట్రేషన్లు!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఓ నిర్ణయం.. ఊహించని విధంగా స్లోవేనియా ఇంటర్నెట్ డొమైన్ '.si'కు భారీ డిమాండ్ తెచ్చిపెట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)అనే పదానికి బదులుగా 'సూపర్ ఇంటెలిజెన్స్' (SI) అనే పదాలను ఉపయోగించాలని ట్రంప్ సెప్టెంబర్ 29న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. అమెరికా ప్రభుత్వ విభాగాలు అధికారిక లేఖలు, వెబ్‌సైట్లు, నివేదికలు, పాలసీ డాక్యుమెంట్లలో 'AI', 'Artificial Intelligence'కు బదులుగా 'SI', 'Super Intelligence' పదాలను ఉపయోగించాలని ఆదేశించారు. ఈ పరిణామంతో స్లోవేనియాకు చెందిన '.si' డొమైన్ రిజిస్ట్రేషన్లు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. గతంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో అంగ్విల్లాకు చెందిన '.ai' డొమైన్‌కు వచ్చిన డిమాండ్‌ను ఇది గుర్తు చేస్తోంది.
వివరాలు
సెప్టెంబర్‌లో 2,199 శాతం పెరిగిన రిజిస్ట్రేషన్లు
స్లోవేనియా డొమైన్‌లను నిర్వహించే అధికారిక సంస్థ Registry SI ప్రతినిధి క్లారా హెర్మన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్‌లో '.si' డొమైన్ రిజిస్ట్రేషన్లు ఏకంగా 2,199 శాతం పెరిగాయి.
అయితే ఈ పెరుగుదలకు పూర్తిగా ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌నే కారణంగా చెప్పడం సరికాదని ఆమె స్పష్టం చేశారు.
ట్రంప్ ఆదేశం జారీ చేసిన మరుసటి రోజు, సెప్టెంబర్ 30న ఒక్కరోజే సుమారు 11 వేల కొత్త .si డొమైన్‌లు నమోదయ్యాయి. ఆ తర్వాత కూడా రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా కొనసాగింది.
వివరాలు
అమెరికా, భారత్ నుంచి భారీగా రిజిస్ట్రేషన్లు
వెబ్ హోస్టింగ్ సంస్థ హోస్టింగర్ కూడా '.si' డొమైన్‌లకు డిమాండ్ అనూహ్యంగా పెరిగినట్లు తెలిపింది.
సెప్టెంబర్ 30న దాదాపు 4,300 మంది కస్టమర్లు '.si' డొమైన్‌లను రిజిస్టర్ చేసుకున్నారని, అక్టోబర్ 1న మరో 5,400 మంది రిజిస్టర్ చేసుకున్నారని సంస్థ వెల్లడించింది.
సెప్టెంబర్ 23 నుంచి నమోదైన మొత్తం '.si' డొమైన్‌లలో మూడు వంతులకు పైగా గత రెండు రోజుల్లోనే రిజిస్టర్ అయినట్లు హోస్టింగర్ తెలిపింది.
ఆసక్తికరంగా.. ఈ రిజిస్ట్రేషన్లలో సగానికి పైగా అమెరికా, భారత్‌కు చెందినవే కావడం గమనార్హం.
వివరాలు
కేవలం 3 శాతమే AIకి సంబంధించినవి
అయితే '.si' డొమైన్‌లకు పెరిగిన డిమాండ్ అంతా AI లేదా 'సూపర్ ఇంటెలిజెన్స్'కు సంబంధించినదే కాదని తెలుస్తోంది.
కొత్తగా నమోదైన '.si' డొమైన్‌లలో కేవలం 3 శాతం మాత్రమే నేరుగా AIకి సంబంధించినవిగా గుర్తించారు. మిగిలిన వాటిలో చాలా వరకు 'అన్‌క్లాసిఫైడ్' కేటగిరీలో ఉన్నాయి.
అంటే వాటి పేర్లను నిర్దిష్టమైన ఏ విభాగంలోనూ వర్గీకరించలేని పరిస్థితి. అదే సమయంలో కొంతమంది వ్యక్తులు, సంస్థలు భవిష్యత్తులో అధిక ధరకు విక్రయించాలనే ఉద్దేశంతో '.si' డొమైన్‌లను ముందుగానే కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అంటే ఈ రిజిస్ట్రేషన్ల వెనుక కొంత స్పెక్యులేటివ్ కొనుగోళ్ల ధోరణి కూడా ఉన్నట్లు అంచనా.
వివరాలు
.ai స్థానాన్ని .si భర్తీ చేస్తుందా?
'.si' డొమైన్‌కు పెరుగుతున్న డిమాండ్ భవిష్యత్తులోనూ కొనసాగవచ్చని హోస్టింగర్ డొమైన్ విభాగం అధిపతి క్లాడిజియస్ జానుటిస్ అభిప్రాయపడ్డారు.
అయితే సమీప భవిష్యత్తులో '.si' డొమైన్ '.ai' స్థానాన్ని పూర్తిగా భర్తీ చేస్తుందని తాను భావించడం లేదని తెలిపారు.
ప్రారంభ AI బూమ్ సమయంలో అంగ్విల్లాకు చెందిన ప్రీమియం ధరల '.ai' డొమైన్‌ను పొందలేకపోయిన వారికి '.si' మరింత అందుబాటులో ఉండే, తక్కువ ఖర్చుతో కూడిన రెండో ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఇప్పటికే ట్రంప్ 'సూపర్ ఇంటెలిజెన్స్'గా పిలవాలని తీసుకున్న నిర్ణయం తర్వాత '.si'పై ఆసక్తి గణనీయంగా పెరిగింది.