Loading...
Lung Cancer: ఊపిరితిత్తుల క్యాన్సర్‌ మరణ ముప్పును 58% తగ్గించిన రెండు మందుల కలయిక
ఊపిరితిత్తుల క్యాన్సర్‌ మరణ ముప్పును 58% తగ్గించిన రెండు మందుల కలయిక

Lung Cancer: ఊపిరితిత్తుల క్యాన్సర్‌ మరణ ముప్పును 58% తగ్గించిన రెండు మందుల కలయిక

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 25, 2026
11:55 am

ఈ వార్తాకథనం ఏంటి

క్యాన్సర్‌ రోగులకు సంబంధించి ఓ కీలక విషయం పరిశోధనలో వెల్లడైంది. ఊపిరితిత్తుల చిన్న కణాల క్యాన్సర్‌ (స్మాల్‌ సెల్‌ లంగ్‌ క్యాన్సర్‌-SCLC)తో బాధపడుతున్న వారికి రెండు ఔషధాలను కలిపి ఇవ్వడం వల్ల మరణ ముప్పు గణనీయంగా తగ్గినట్లు తేలింది. అమెరికాకు చెందిన ఆమ్‌జెన్‌ సంస్థ అభివృద్ధి చేసిన ఇమ్డెల్ట్రా (Imdelltra) అనే ఇమ్యునోథెరపీ ఔషధాన్ని ఆస్ట్రాజెనెకా సంస్థకు చెందిన ఇంఫింజీ (Imfinzi)తో కలిపి ఇచ్చినప్పుడు మరణ ముప్పు 58 శాతం తగ్గినట్లు తుది దశ క్లినికల్‌ ట్రయల్‌లో వెల్లడైంది. గతంలో ఇంఫింజీ, కీమోథెరపీ చికిత్స తీసుకున్నప్పటికీ వ్యాధి తీవ్రత పెరగని రోగులపై ఈ కలయిక చికిత్సను పరీక్షించారు. చికిత్స కొనసాగింపులో భాగంగా ఈ రెండు మందులను ఉపయోగించారు.

వివరాలు 

రోగులు 8 నెలలకు పైగా ఎక్కువ కాలం జీవించే అవకాశం

ఈ రెండు ఔషధాలను కలిపి తీసుకున్న రోగులు ఎక్కువ కాలం జీవించినట్లు పరిశోధనలో తేలింది.

ఈ చికిత్స తీసుకున్నవారి సగటు జీవన కాలం 21.1 నెలలుగా నమోదైంది.

ఇంఫింజీని మాత్రమే తీసుకున్నవారిలో ఇది 12.7 నెలలుగా ఉంది. అంటే రెండు మందుల కలయికతో సగటున 8 నెలలకు పైగా అదనపు జీవన కాలం లభించినట్లు పరిశోధకులు గుర్తించారు.

ఈ ఫలితాలపై ఆమ్‌జెన్‌ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ పాల్‌ బర్టన్‌ స్పందిస్తూ.. వైద్యరంగంలో కొన్ని పరిశోధన ఫలితాలు రోగులకు అందించే చికిత్సా విధానాన్నే మార్చగలవని, ఈ ఫలితాలు కూడా అలాంటివేనని పేర్కొన్నారు.

వివరాలు 

ఇమ్డెల్ట్రా ఔషధానికి పెరగనున్న మార్కెట్‌ అవకాశాలు

ఈ పరిశోధన ఫలితాలు ఇమ్డెల్ట్రా ఔషధానికి మార్కెట్‌లో మరిన్ని అవకాశాలు కల్పించనున్నట్లు సూచిస్తున్నాయి.

ఈ ఔషధం 2026 రెండో త్రైమాసికంలో 288 మిలియన్‌ డాలర్ల విక్రయాలను నమోదు చేసింది.

గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే విక్రయాలు 115 శాతం పెరిగాయి.

గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఈ ఔషధ విక్రయాలు 627 మిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.

భవిష్యత్తులో ఈ ఔషధం భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టే మందుగా ఎదిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఇమ్డెల్ట్రా, ఇంఫింజీ కలయికతో ప్రస్తుతం అత్యంత ప్రమాదకరంగా భావించే ఈ క్యాన్సర్‌ను దీర్ఘకాలం నియంత్రణలో ఉంచగలిగే పరిస్థితి రావచ్చని పాల్‌ బర్టన్‌ అభిప్రాయపడ్డారు.

ADVERTISEMENT

వివరాలు 

చిన్న కణాల ఊపిరితిత్తుల క్యాన్సర్‌ ప్రమాదకరం

స్మాల్‌ సెల్‌ లంగ్‌ క్యాన్సర్‌ చికిత్స చేయడం కష్టంగా ఉంటుంది.

ప్రారంభంలో కీమోథెరపీతో వ్యాధి అదుపులోకి వచ్చినప్పటికీ.. కొన్ని నెలల్లోనే తిరిగి పెరిగే లేదా తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది.

ఇమ్యునోథెరపీ వల్ల కొంతమంది రోగుల్లో వ్యాధిని ఏళ్ల తరబడి నియంత్రణలో ఉంచగలిగినా.. చాలామందికి అలాంటి దీర్ఘకాల ప్రయోజనాలు లభించడం లేదు.

అమెరికాలో ఏటా సుమారు 31 వేల కొత్త స్మాల్‌ సెల్‌ లంగ్‌ క్యాన్సర్‌ కేసులు నమోదవుతున్నాయని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్‌ జాకబ్‌ శాండ్స్‌ తెలిపారు.

ఆయన డానా-ఫార్బర్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌లోని లోవ్‌ సెంటర్‌ ఫర్‌ థొరాసిక్‌ ఆంకాలజీలో వైద్య నిపుణుడిగా పనిచేస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

ఇమ్డెల్ట్రాను ముందుగానే వాడితే వ్యాధి తీవ్రతపై ప్రభావం

క్యాన్సర్‌ చికిత్సలో ఇమ్డెల్ట్రాను మరింత ముందుగానే ప్రవేశపెట్టడం ద్వారా వ్యాధి గమనాన్ని మార్చవచ్చని ఆమ్‌జెన్‌ భావిస్తోంది.

ప్రస్తుతం ప్లాటినం ఆధారిత కీమోథెరపీ సమయంలో లేదా ఆ తర్వాత వ్యాధి తీవ్రత పెరిగిన స్మాల్‌ సెల్‌ లంగ్‌ క్యాన్సర్‌ రోగులకు ఈ ఔషధాన్ని ఉపయోగించేందుకు అనుమతి ఉంది.

అయితే, చికిత్స ప్రారంభ దశలోనే ఇంఫింజీతో పాటు ఇమ్డెల్ట్రాను ఇవ్వడం వల్ల రోగులు ఎక్కువ కాలం జీవించగలరా అనే అంశాన్ని ఈ పరిశోధనలో పరీక్షించారు.

ఈ తరహా క్యాన్సర్‌కు మొదటి దశ చికిత్సగా ఇప్పటికే ఇంఫింజీకి అనుమతి ఉంది.

దానికి ఇమ్డెల్ట్రాను జోడించడం వల్ల మరింత మెరుగైన ఫలితాలు వస్తాయా అనే దానిపై పరిశోధకులు దృష్టి సారించారు.

వివరాలు 

కలయిక చికిత్స తీసుకున్నవారిలో ఏడాది తర్వాత 80 శాతం మంది సజీవం

ఈ పరిశోధనలో మరో కీలక విషయం వెల్లడైంది. ఇమ్డెల్ట్రా, ఇంఫింజీ రెండింటినీ తీసుకున్న రోగుల్లో ఏడాది తర్వాత దాదాపు 80 శాతం మంది సజీవంగా ఉన్నారు.

ఇంఫింజీని మాత్రమే తీసుకున్నవారిలో ఈ సంఖ్య 53 శాతంగా ఉంది.

వ్యాధిని నియంత్రించడంలో, రోగుల జీవన కాలాన్ని పెంచడంలో ఇమ్డెల్ట్రా ప్రభావం కీలకమని డాక్టర్‌ జాకబ్‌ శాండ్స్‌ తెలిపారు.

అందువల్ల మొదటి దశ చికిత్స తర్వాత వ్యాధి అదుపులో ఉన్న రోగులకు అందించే కొనసాగింపు చికిత్సలోనూ ఈ ఔషధాన్ని చేర్చడం ముఖ్యమని పేర్కొన్నారు.

ఇతర ఇమ్యునోథెరపీ మందులతో కలిపి ఉపయోగించినప్పటికీ స్మాల్‌ సెల్‌ లంగ్‌ క్యాన్సర్‌ చికిత్సలో ఇమ్డెల్ట్రా కీలక ఔషధంగా మారే అవకాశముందని పాల్‌ బర్టన్‌ అభిప్రాయపడ్డారు.

ADVERTISEMENT