Mythos AI: మిథోస్‌తో అమెరికా ప్రభుత్వ సాఫ్ట్‌వేర్ కోడ్‌లకు ఏఐ ఆడిట్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాకు చెందిన ఆంత్రోపిక్ సంస్థ కృత్రిమ మేధ (AI) రంగంలో మరో కీలక ముందడుగు వేసింది. సంస్థలు ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌లలో లోపాలను గుర్తించి, సైబర్ భద్రతను మరింత బలోపేతం చేయడానికి 'మిథోస్' (Mythos) అనే ఏఐ మోడల్‌ను అభివృద్ధి చేసింది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, అమెరికా సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ (CISA) ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రభుత్వ సాఫ్ట్‌వేర్ కోడ్‌ల ఆడిట్‌లో మిథోస్‌ను వినియోగిస్తోంది. విదేశీ గూఢచారులు లేదా సైబర్ నేరగాళ్లు చొరబడేందుకు ఉపయోగించే బగ్స్, భద్రతా లోపాలను గుర్తించేందుకు ప్రభుత్వ కోడ్ రిపోర్టులను ఈ ఏఐ సాధనంతో స్కాన్ చేస్తున్నట్లు సమాచారం.
వివరాలు
అధికారికంగా స్పందించని అమెరికా ప్రభుత్వం
ఈ ఆడిట్‌ల ద్వారా ఇప్పటికే గణనీయమైన సంఖ్యలో సాఫ్ట్‌వేర్ లోపాలను అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. వాటిని సరిచేసే ప్రక్రియ కూడా కొనసాగుతోందని సమాచారం. అయితే ఈ అంశంపై అమెరికా ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ధ్రువీకరణ ఇవ్వలేదు. మరోవైపు, ఆంథ్రోపిక్ రూపొందించిన ఫేబిల్ 5 (Fable 5), మిథోస్ 5 (Mythos 5) వంటి ఏఐ మోడళ్ల భద్రతపై గతంలో అమెరికా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మోడళ్ల వినియోగాన్ని విదేశీ పౌరులకు నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, ఆంథ్రోపిక్‌లో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులు కూడా ఫేబిల్, మిథోస్ మోడళ్లను ఉపయోగించకూడదని స్పష్టం చేస్తూ వాటిపై ఆంక్షలు విధించింది.
వివరాలు
ఆంథ్రోపిక్ యాజమాన్యం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు
అయితే అనంతర సమీక్షలో భాగంగా ఈ నెల ప్రారంభంలో ఆ పరిమితులను అమెరికా ప్రభుత్వం ఎత్తివేసింది. ఒకప్పుడు భద్రతా కారణాలతో ఆంక్షలు విధించిన ఇదే ఏఐ సాధనాలను ఇప్పుడు ప్రభుత్వ సాఫ్ట్‌వేర్ కోడ్‌ల పరిశీలన కోసం వినియోగించడం విశేషంగా మారింది. ఈ పరిణామంపై స్పందించాలంటూ ప్రశ్నించగా, ఆంథ్రోపిక్ యాజమాన్యం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.