WhatsApp New Feature: కొత్త గ్రూప్ సభ్యులకు ఇక నో టెన్షన్.. గ్రూప్ మెసేజ్ హిస్టరీ ఫీచర్ ను ప్రవేశపెట్టిన వాట్సాప్
ఈ వార్తాకథనం ఏంటి
వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త. ముఖ్యంగా గ్రూపుల్లో ఉన్న సభ్యులకు ఇది నిజంగా పండుగలాంటి విషయం. ఇకపై కొత్తగా గ్రూపులో చేరే వారికి ప్రత్యేక ప్రయోజనం లభించనుంది. మెటా సంస్థకు చెందిన వాట్సాప్, గ్రూప్ యూజర్ల కోసం "గ్రూప్ మెసేజ్ హిస్టరీ" అనే సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటివరకు వాట్సాప్ గ్రూపులో కొత్తగా చేరిన సభ్యులు, తమకు ముందు జరిగిన చాట్‌లను చూడలేకపోయేవారు. అయితే ఇప్పుడు ఈ హిస్టరీ ఫీచర్ ద్వారా కొత్తగా జాయిన్ అయిన వారు కూడా గత సందేశాలను వీక్షించే అవకాశం పొందనున్నారు.
వివరాలు
కొత్తగా చేరిన సభ్యులు కనీసం 25 నుండి గరిష్టంగా 100 వరకు తాజా సందేశాలు చూడచ్చు
అయితే ఆ మెసేజ్ హిస్టరీని అడ్మిన్ లేదా గ్రూప్ సభ్యుల్లో ఎవరైనా పంపాల్సి ఉంటుంది. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఫీచర్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ సదుపాయంతో పనిచేస్తుంది. వ్యక్తిగత చాట్‌ల మాదిరిగానే గ్రూప్ చాట్‌లు కూడా భద్రంగా ఉంటాయని సంస్థ స్పష్టం చేసింది. కొత్తగా చేరిన సభ్యులు కనీసం 25 నుండి గరిష్టంగా 100 వరకు తాజా సందేశాలను చూడగలరని వాట్సాప్ తెలిపింది. దీంతో పాత చాట్‌ల కోసం వెనక్కి స్క్రోల్ చేయాల్సిన అవసరం ఉండదు. అవసరమైన సమాచారం నేరుగా అందుబాటులోకి వస్తుంది. స్క్రీన్‌షాట్‌లు పంపడం లేదా వేర్వేరుగా మెసేజ్‌లు ఫార్వర్డ్ చేయడం వంటి పనులు తగ్గుతాయి. దీంతో గ్రూప్ సంభాషణలు మరింత సులభతరం అవుతాయి.
వివరాలు
హిస్టరీ పంపాలా వద్దా అన్న నిర్ణయం గ్రూప్ అడ్మిన్ లేదా సభ్యులు తీసుకోవచ్చు
ఈ హిస్టరీ పంపడం మాన్యువల్ ప్రక్రియగా ఉంటుంది. కొత్త సభ్యుడు గ్రూపులో చేరినప్పుడు సంబంధిత ఆప్షన్ కనిపిస్తుంది. హిస్టరీ పంపాలా వద్దా అన్న నిర్ణయం గ్రూప్ అడ్మిన్ లేదా సభ్యులు తీసుకోవచ్చు. అదేవిధంగా, ఈ సౌకర్యాన్ని నిలిపివేసే అవకాశం కూడా అడ్మిన్‌కు ఉంటుంది. అయితే అడ్మిన్‌కు ఎప్పుడైనా హిస్టరీను షేర్ చేసే అధికారం ఉంటుంది. పారదర్శకత దృష్ట్యా హిస్టరీ పంపిన ప్రతిసారి అన్ని గ్రూప్ సభ్యులకు నోటిఫికేషన్ అందుతుంది. కంపెనీ వివరాల ప్రకారం, పంపిన హిస్టరీ సందేశాల్లో స్పష్టమైన టైమ్‌స్టాంప్, పంపిన వారి వివరాలు కనిపిస్తాయి.
వివరాలు
వాట్సాప్ వెబ్‌లో వాయిస్, వీడియో కాలింగ్ సదుపాయాలు
ఇవి సాధారణ సందేశాల కంటే కొంచెం భిన్నమైన రూపంలో ప్రదర్శించబడతాయి. ఈ గ్రూప్ మెసేజ్ హిస్టరీ ఫీచర్ ప్రస్తుతం విడుదల దశలో ఉందని, త్వరలోనే సాధారణ వాట్సాప్ వినియోగదారులందరికీ అందుబాటులోకి రానుందని సంస్థ తెలిపింది. ఇక వాట్సాప్ వెబ్‌లో వాయిస్, వీడియో కాలింగ్ సదుపాయాలు ఇప్పటికే ప్రవేశపెట్టబడ్డాయి. కొందరు వినియోగదారులు తమ చాట్ విండోలోనే వాయిస్, వీడియో కాల్ బటన్లు చూడగలుగుతున్నారు. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ఉంది. ప్రారంభ దశలో వినియోగదారులు వ్యక్తిగత చాట్‌ల నుంచే వాయిస్ కాల్‌లు చేయగల అవకాశముంది.